సహజీవనం చేస్తే పోక్సో కింద శిక్షించవచ్చా! తమిళనాడు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు
దిల్లీ: సహజీవనంలో ఉంటూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న వారిపై పోక్సో చట్టం కింద శిక్ష విధించాలా? వద్దా? అనే అంశంపై స్పందించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ కృష్ణ మురారీతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే, వివాహానికి నిరాకరించడం వల్ల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకునిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం జరగలేదని, ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నట్లు విచారణలో యువతి వెల్లడించింది. తిరిగి ఆ యువకునితో కలిసి జీవించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. యువతి వాదనలను తిరస్కరించిన దిగువ కోర్టు.. పోక్సో చట్టాన్ని అనుసరించి యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. యువతికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. భిన్న పరిణామాల అనంతరం మద్రాసు హైకోర్టుకు చేరిన ఈ అంశంపై యువతీయువకులిద్దరూ ఒకే వాదనలు వినిపించారు. తమ సంబంధం పరస్పర అంగీకారంతో కూడినదని మద్రాసు హైకోర్టు ఎదుట యువతి సాక్ష్యమిచ్చింది. ఆ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఆమె పిటిషన్ను కొట్టివేసింది. దీంతో యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.