కరోనా జ్వరంతో 5 రోజులు దాటితే ప్రమాదం


ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వచ్చి మూడురోజులు దాటినా తగ్గలేదంటే జాగ్రత్త పడాల్సిందే. ఐదురోజులు దాటితే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అందువల్ల మూడురోజులు దాటగానే అప్రమత్తమై ఎవరో ఒక వైద్యుడినో, ఆన్‌లైన్‌ కన్సల్టేషనో కాకుండా స్పెషలిస్ట్‌ను కలిసి వైద్యం చేయించుకోవాలి. మూడు రోజులకే జాగ్రత్త పడితే మొదటివారంలో స్టెరాయిడ్స్‌ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకోవచ్చు. త్వరగా కోలుకుంటారు. లేని పక్షంలో రెండోవారంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగిపోయి సైటోకాన్‌ స్టార్మ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలతో ప్రాణాలకు ముప్పు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఇప్పటికీ ఔట్‌ పేషెంట్లుగా వచ్చేవాళ్లు చాలామంది 90 శాతానికి తక్కువ ఆక్సిజన్‌ శాచురేషన్‌ లెవెల్స్‌తో వస్తున్నారు. వీరి ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు వెంటిలేటర్‌ అమర్చాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.. అంటున్నారు కిమ్స్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్, స్లీప్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వీవీ రమణ ప్రసాద్‌. ప్రస్తుత కరోనా పరిస్థితులు, మొదటి వేవ్‌కు భిన్నంగా సెకండ్‌ వేవ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఆరోగ్యం వేగంగా క్షీణించడానికి దారితీస్తున్న కారణాలు, జ్వరం కొనసాగుతున్నా కరోనా కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర అంశాలపై ‘సాక్షి’ఇంటర్వ్యూలో ఆయన వివరణ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…

పెరిగిన ముప్పు
సెకండ్‌ వేవ్‌లో మ్యుటేట్‌ అయిన వైరస్‌ తీవ్రత పెరగడంతో పాటు దాని వ్యాప్తి అధికం కావడం తోనే సమస్య జటిలమై ఎక్కువ చేటు చేస్తోంది. మొదటి దశతో పోల్చితే ప్రస్తుతం గుంపులు గుంపులుగా ఇన్ఫెక్ట్‌ అవుతున్నారు. గతంలో పెద్ద వయసు వారు, డయాబెటిక్, బీపీ, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారిపై వైరస్‌ అధిక ప్రభావం చూపింది. కానీ ఇప్పుడు 30–50 ఏళ్ల వయసులోని వారికి కూడా వైరస్‌ సోకడంతో పాటు దాని ప్రభావంతో ఆరోగ్యం కూడా వేగంగా దిగజారుతోంది. మొదటి దశలో లాగా చికిత్సకు ఎక్కువ టైం ఉండడం లేదు. దీనివల్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు, స్వల్పంగానే ఉంది తర్వాత చూద్దాంలే అనుకున్న వారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారుతోంది.

ఐదో రోజు దాటితే క్లిష్టపరిస్థితులు
ఐదో రోజు తర్వాత కూడా జ్వరం కొనసాగిన పక్షంలో రెండో వారం ప్రవేశించేకల్లా రోగుల ఆరోగ్య పరిస్థితి చాలా త్వరగా విషమిస్తోంది. సాధారణ జ్వరం లేదా వైరల్‌ ఇన్ఫెక్షన్లు సోకితే మూడోరోజు కల్లా జ్వరం తగ్గిపోతుంది. మొదటి వారంలో ఎవరో ఒకరి సలహాతో సీటీ స్కాన్‌ చేయించుకుని న్యూమోనియా లేదు ఇంకా ఏ సమస్య లేదు అంతా బాగానే ఉంది అని ధైర్యంగా ఉన్నవాళ్లు, చిన్నజ్వరమే కదా అని తగ్గిపోతుంది అని తాత్సారం చేసే వాళ్ల పరిస్థితి తర్వాత ప్రమాదకరంగా మారుతోంది. వీరిలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ చాలా వేగంగా పడిపోతోంది. కుటుంబంలో ఒకరికి వస్తే మొత్తం ఇంటి సభ్యులందరికీ సోకడం, కొందరికి సీరియస్‌గా మారడం సెకండ్‌ వేవ్‌లో వచ్చిన మార్పుగా గమనించొచ్చు.

వ్యాక్సిన్‌ జ్వరంపై అపోహలు
వ్యాక్సినేషన్‌ (అది మొద టిది లేదా రెండో డోస్‌ కావొచ్చు)తీసుకున్నాక, ఒకటి లేదా రెండురోజులు జ్వరం రావొచ్చు. ఒకవేళ వచ్చినా పారాసిటమాల్‌ మాత్ర సరిపోతుంది అని డాక్టర్లు, నర్సులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే 3, 4 రోజులు గడిచినా జ్వరం తగ్గకపోయినా, అది వ్యాక్సిన్‌ కారణంగా వచ్చినదే అని అపోహపడి, రెండో వారం దాకా నిర్లక్ష్యం చేయకూడదు. అలా నిర్లక్ష్యంతో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గి, న్యూమోనియా ఏర్పడి ఆలస్యంగా ఆసుపత్రులకు వస్తున్న కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి.

ఆక్సిజన్‌ పరిజ్ఞానం ఉండటం లేదు
తక్కువ వయసులో ఉన్నవారు ఈసారి ఎక్కువగా వైరస్‌ బారిన పడి వేగంగా అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు, అంతగా చదువుకోని వారు చాలామందిలో పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ స్థాయిలు పరీక్షించుకునే పరిజ్ఞానం ఉండడం లేదు. దానిని ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా వాడాలి అన్న అవగాహన లేని వారు కూడా ఉన్నారు. ఒకవేళ పల్స్‌ ఆక్సీమీటర్‌ అందుబాటులో లేకపోయినా థర్మామీటర్‌తో రోజుకు నాలుగుసార్లు టెంపరేచర్‌ చెక్‌ చేసుకోవాలి. కొత్తగా దగ్గు, ఆయాసం వచ్చినా లేదా జ్వరం తగ్గకపోయినా వెంటనే స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో పాటు బోర్లా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకుంటే ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

అపోహలకు గురికావొద్దు
మొదటి వారంలోనే సొంత వైద్యం లేదా ఇతరుల సలహాలతో ఇష్టం వచ్చిన మందులు, స్టెరాయిడ్స్‌ వంటివి వాడి చాలామంది అంతా బాగానే ఉందనే అపోహతో ఉంటున్నారు. మొదటి రోజు నుంచే వరసగా డోలో లేదా పారాసిటమల్‌ బిళ్లలు 3, 4 వేసుకుంటే టెంపరేచర్‌ తెలియదు కాబట్టి నియంత్రణలోకి వచ్చిందనే భావన కలుగుతోంది. ఇది ఆరు, ఏడో రోజు కొనసాగి ఆక్సిజన్‌ స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి తీవ్రంగా జబ్బుపడుతున్న కేసులు కూడా పెరుగుతున్నాయి. గతంలో పేషెంట్లకు 10 –14 రోజుల్లో ఉత్పన్నమయ్యే సమస్యలు ఇప్పుడు ఐదు రోజుల తర్వాత తీవ్రమైన సమస్యలుగా మారుతున్నాయి. ఈ సమయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం, పాజిటివ్‌ వచ్చినా ఇంకా ముదరలేదు కదా అన్న ధీమా కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది.

నెగెటివ్‌ వచ్చినా..
జ్వరం ఉంటోంది. నెమ్మదిగా పెరుగుతుంది. తగ్గడం లేదు. దగ్గు,ఆయాసం వస్తున్నాయి. అయినా ర్యాపిడ్‌ యాంటీజెన్, ఆర్‌టీపీసీర్‌లలో నెగెటివ్‌ రావడంతో కొందరు కోవిడ్‌ రాలేదని తమకు తామే భరోసా ఇచ్చుకుంటున్నారు. కొంతమంది టైఫాయిడ్, డెంగీ టెస్ట్‌లు చేయిస్తూ అందులో పాజిటివ్‌ వచ్చింది. ఆర్టీపీసీర్‌ నెగెటివ్‌ వచ్చింది కాబట్టి తమకు టైఫాయిడ్‌ లేదా డెంగీ వచ్చిందే తప్ప కరోనా కాదని అనుకుంటున్నారు. వాటికి మందులు వాడుతూ కోవిడ్‌ను నిర్లక్ష్యం చేయడం చేటు చేస్తోంది.

సీటీస్కాన్‌ తప్పనిసరి
ఐదోరోజు తర్వాతా ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చిన వారిలో జ్వరం కొనసాగుతూ.. దగ్గు, ఆయాసం కూడా ఉంటే వారు తప్పనిసరిగా సీటీస్కాన్‌ చేయించుకోవాలి. స్కాన్‌లో తేడాలుంటే కోవిడ్‌గా భావిం చి చికిత్స తీసుకోవాలి. అప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు ఘోరంగా ఉంటాయి.

అందుబాటులో ప్రత్యామ్నాయాలు
గతంతో పోల్చితే చికిత్స పరంగా కొన్ని ప్రత్యా మ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా కొన్ని బయలాజికల్స్‌ ఉపయోగిస్తున్నారు. ప్లాస్మాతో ఫలితాలొస్తున్నాయి. తక్కువ రేటుకే ఇతర ఇంజెక్షన్లు కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ట్రీట్‌మెంట్‌ పరంగా మెరుగైన స్థితిలోనే ఉన్నా..పేషెం ట్లు జబ్బు ముదిరాక ఊపిరితిత్తులు పాడై ఆసుపత్రులకు వస్తుండడం పెద్ద సమస్యగా మారింది. అందువల్ల సెకండ్‌వేవ్‌ పరిస్థితులను అర్థం చేసుకుని జాగురూకతతో వ్యవహరిస్తేనే మంచిది. ఏ వయసు వారైనా అజాగ్రత్తతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దాని బారిన పడడం ఖాయమనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్, భౌతికదూరం, శానిటైజేషన్‌ వంటివి పాటించడంతో పాటు కచ్చితంగా అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

About The Author