డ్రోన్లు ఎగరాలంటే ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే
భారత సైన్యంపై డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ వాటి ముప్పు గురించిన చర్చ మొదలైంది. అయితే, డ్రోన్ల వల్ల తలెత్తే అవాంఛనీయ పరిస్థితులను ముందే పసిగట్టిన మన రాష్ట్ర పోలీసులు వాటికి విరుగుడుగా గత ఏడాది గరుడదళం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ దళం ఉనికి, పనితీరు గురించిన పురోగతిని ఇంతవరకూ పోలీసు శాఖ వెల్లడించకపోవడం గమనార్హం. ప్రధానంగా మావోయిస్టులను కట్టడి చేయడమే ధ్యేయంగా ఈ గరుడదళానికి పురుడుపోశారు. ఛత్తీస్గఢ్–మహారాష్ట్రల నుంచి మావోలు అప్పుడప్పుడూ రాష్ట్రంలోకి ప్రవేశించేవారు.డ్రోన్ల సాయంతో కూంబింగ్ దళాల ఉనికిని తెలుసుకొని గోదావరి–ప్రాణహిత నదులను దాటుతూ తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో తక్కువ ఎత్తులో ఎగిరే అనుమానాస్పద డ్రోన్లను పట్టుకునేందుకు ‘‘గరుడస్క్వాడ్’’పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయా లని 2020 ఆగస్టులో పోలీసు శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని గద్దలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇద్దరు శిక్షకులను కూడా నియమించింది. ఈ శిక్షణ 2021 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఆ తరువాత అవి విధుల్లో చేరతాయని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది జూలై వచ్చినా వీటి గురించి ఎలాంటి సమాచారం లేదు.
జిల్లాల్లో ఇష్టానుసారంగా..
జిల్లాల్లో కొందరు ఫొటో, వీడియోగ్రాఫర్లు ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం డ్రోన్లను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. కొందరు అర కిలోమీటరు ఎత్తు వరకు ఎగిరే డ్రోన్లను కిరాయికి తీసుకు వస్తున్నారు. మరికొందరు నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బర్త్డే పార్టీలు, పెళ్లిళ్లు, బారసాలలు, జాతరలు, ర్యాలీలు, ఉత్సవాలు, రాజకీయనేతల సభలు, సమావేశాల్లో వీటిని ఎడాపెడా వాడుతున్నారు. ముఖ్యంగా వీఐపీల నివాసాలు, సాగునీటి ప్రాజెక్టుల సమీపంలో ఎగరేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ డ్రోన్లు దాదాపు 500 గ్రాముల బరువును మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటాయి.
90 శాతం డ్రోన్లకు అనుమతుల్లేవు..
పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రోన్ల వివరాలు సేకరిస్తోంది. అధికారిక కార్యక్రమాలు మినహా ప్రైవేట్ కార్యక్రమాలలో వినియోగించే డ్రోన్లపై దృష్టి సారించింది. ఎక్కడైనా డ్రోన్లను ఎగరేయాలనుకుంటే ముందుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అనుమతి తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 నుంచి 2,000 వరకు డ్రోన్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. గ్రేటర్ పరిధిలోనే 800లకుపైగా ఉన్నట్టు సమాచారం. సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం… వీటిలో 90 శాతం డ్రోన్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అని 2014లోనే కేంద్రం హెచ్చరించింది.
నెదర్లాండ్స్ స్ఫూర్తితో…
డ్రోన్లను పట్టుకునేందుకు నెదర్లాండ్స్ దేశంలోని పోలీసులు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో వీరిబాటనే పలు దేశాలు అనుసరిస్తున్నాయి. డ్రోన్లతో ఉగ్రముప్పు ఉన్న విషయాన్ని ముందుగానే ఊహించిన తెలంగాణ పోలీసులు ఆ మేరకు గతేడాదే సంసిద్ధులయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్టుల ఆటకట్టించే దిశగా ఎంపిక చేసిన గద్దలకు శిక్షణ ప్రారంభించారు. కానీ, వాటి పురోగతిని మాత్రం తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారు.