బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం…


బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం…
చరిత్ర సృష్టించిన భారత్…
నింగిలోకి చేరిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం…
ప్రయోగం విజయవంతం కావడంతో షార్ లో సంబరాలు…
కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు…
శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్ నారాయణన్…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన బాహుబలి రాకెట్ ఎల్ వి ఎం 3 ఎం 6 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం ఉదయం 8.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో ఈ బాహుబలి రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 ఎం 6 విజయవంతంగా ప్రయోగించింది.అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2ను రాకెట్ మోసుకెళ్లింది.15.30 నిమిషాల్లో మూడు దశల్లో రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. అమెరికాకు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ సంస్థ తో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. సుమారు 6,100 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన అత్యంత బరువైన వాణిజ్య పేలోడ్ గా రికార్డు సృష్టించింది. దీంతో ఇస్రో కేంద్రంలో సంబరాలు మొదలయ్యాయి.

*కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు*

ఈ ప్రయోగం ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలోనే విప్లవాత్మక మార్పులకు బాటలు వేసింది.బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం ద్వారా 4జి/5జి సిగ్నల్స్ అందుతాయి.దీనివల్ల ఎటువంటి సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా మొబైల్ సేవలు పొందే వీలుంటుంది.ఆర్బిట్ లో అతి పెద్ద వాణిజ్య ఉపగ్రహంగా గుర్తింపు పొందిన దీని యాంటీనా విచ్చుకున్న తర్వాత ఏకంగా 223 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది.ఈ విజయంతో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో భారత్ మరోసారి తన సత్తా చాటింది.

భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలు
ఇస్రో చైర్మన్ వెల్లడి…

భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ శ్రీహరికోటలోని మీడియా సెంటర్ లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.మానవ రహిత ప్రయోగాలు,నావిగేషన్,ఎయిర్ స్పేస్ స్టేషన్,వీనస్ ఆర్బిట్ ప్రయోగాలు,వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయని తెలిపారు.శ్రీహరికోట నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి చేరుకోవడంతో షార్ లో సంబరాలు మొదలయ్యాయి. ప్రయోగం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ అభినందించి,శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author