కాశ్మీరం – 01

నేటి నుండి కాశ్మీర్ చరిత్రను వ్రాయడానికి మొదలు పెడుతున్నాను. కాశ్మీర్ చరిత్ర హిందువులకు కనువిప్పు. భారత దేశం మొత్తంలో హిందువుల రక్తపుటేరులు పారిన రాజ్యం కాశ్మీరం. ఒక్కసారి కాదు చరిత్రలో 7 సార్లు హిందూ రక్తపుటేరులు కాశ్మీరాన్ని తడిపి వేశాయి.

దాదాపు 30 సంవత్సరాల క్రితం నా మనస్సులో కాశ్మీర్ గురించి వేదన మొదలైంది. నాటి నుండి కాశ్మీరానికి సంబంధించిన ఏ అంశమైనా తప్పక అధ్యయనం చేసే వాడిని. ఈ విషయాలన్నింటినీ ఒక పుస్తకరూపంగా వెలువరించాలనేది నా సంకల్పం. నా ఆర్థిక స్థోమత కారణంగా ఈ కార్యాన్ని చేయలేక పోయాను. ఈ నాటికి మీ అందరితో కలసి కాశ్మీర్ కష్టాన్ని పంచుకునే అవకాశం దొరికింది. ముఖ పుస్తక మిత్రులు ఇక్కడ అందించే విషయాలన్నింటినీ కాపీ చేసి దాచుకుంటే ఇది ఒక పుస్తక రూపం ధరిస్తుంది. ఇక కాశ్మీర్ కథలోకి నడుద్దాం.

కాశ్మీర్ అనగానే అందమైన మంచు పర్వతాలు, పెద్ద పెద్ద జలాశయాలు, సుందర నందనోద్యానవనాలు, హౌస్ బోట్లు, ఓ ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనసును ఆనంద డోలికలలో ఉగేలా చేస్తాయి.

“నాదు జన్మభూమి కంటె నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది.
సుందర కాశ్మీరాలు, బృందా సౌందర్యాలు స్వర్గసీమలో ఎక్కడ ఎక్కడ.
అమరేంద్రులు గంధర్వులు అచ్చరలు వియచ్చరలు
వేడుకతో వలస వచ్చి విహరించే హిమశృంగం”

ఇది మద్ గురుదేవులు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు వ్రాసిన దేశభక్తి గీతం. స్వర్గాన్ని సైతం తలపింప జేసే కాశ్మీరం. దేవతలు సైతం భూమిమీదకు దిగి కాశ్మీరాన్ని చూసి మురిసి పోయే సౌందర్యం. కవుల కలాలు, భావుకుల మనస్సులను పులకింప జేసే భూతల స్వర్గం కాశ్మీరం. అది గతం

మరి నేడు – రక్తపు టేరులు పారుతూ, హాహాకారాలు ఆర్తనాదాలతో దద్దరిల్లుతున్న నరక ద్వారం. ఎక్కడ తుపాకులు పేలుతాయో, ఎక్కడ బాంబుల వర్షం కురుస్తుందో, ఎక్కడ ఎంత మంది మట్టికరుస్తారో తెలియదు. అటు సైన్యం, ఇటు వేర్పాటు వాదులు ఇద్దరి మద్యా కాశ్మీరం రక్తసిక్తమౌతుంది. అటు పాకిస్తాన్, ఇటు భారత్ రెండు దేశాల మద్య అడకత్తెరలో పోకచెక్కలా నలుగుతుంది. శీతల పవనాలతో చల్లదనాన్నిచ్చే కాశ్మీరం ఆరని రావణకాష్టంలా మారింది. చల్లటి నీహారికలు, మంచు కురిసే హిమ సమూహాలు తుపాకీ గుళ్ళు, బాంబుల వర్షం కురిపించే దయనీయ దశకు చేరుకుంది.

అసలు కాశ్మీరం ఎవరిది? కాశ్మీరును రావణకాష్టంగా మార్చిన పరిస్తితులు, వాటి వెనుక ఉన్న స్వార్థ ప్రయోజనాలు, ఆప్రయోజనాలను పొందే స్వార్థపర వ్యక్తులు ఎవరు? ఎందుకు కాశ్మీరం ఇలా తగలబడుతుంది?

మదన్ గారి
సౌజన్యముతో
Cont… Part,,,2

About The Author