పాక్ చెర నుంచి బైటపడ్డా.. మిలటరీ విచారణ తప్పదు…

పాక్ చెర నుంచి బైటపడ్డా.. మిలటరీ విచారణ తప్పదు…

దేశం మొత్తం హీరోగా నీరాజనాలు అందుకుంటున్న అభినందన్ పాక్ చెర నుంచి స్వదేశానికి తిరిగివచ్చినా మిలటరీ నిబంధనల ప్రకారం ఆయనను శత్రు చెరలో వున్న వ్యక్తిగానే పరిగణించి మరికొన్ని రోజుల పాటు మిలటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేస్తారు. ఎంతటి త్యాగధనులైనా, ఎంతటి దేశభక్తులైనా శత్రుచెరల నుంచి తిరిగివచ్చిన తర్వాత అనుమానంగా చూడడం మిలటరి సంప్రదాయం. 1970 నాటి డొక్కు మిగ్ -21 విమానంతో అత్యాధునికమైన ఎఫ్-16 విమానాలను వెంటపడి వాటిని కూల్చివేసిన అభినందన్ నిజంగా అభినందనీయుడే. శత్రువుల భూభాగంలో ఆ దేశంలో జరిగిన క్షిపణి కాల్పుల్లో తన విమానం పేలిపోయినా, ప్యారాచూట్ సహాయంతో కిందకి దిగి శత్రువులతో పోరాడి కూడా వారికి బందీ అయిన అభినందన్ ను రాష్ట్రపతి మొదలు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు కీర్తిస్తున్నాడు. అతడిని ఒక రియల్ హీరోగా భావిస్తున్నారు. శత్రువులకు బందీగా వున్నప్పుడు కూడా దేశ భద్రతను, దేశ రహస్యాలను కాపాడి శత్రువులకు భయపడకుండా వున్న మహా పరాక్రమవంతుడిగా ఖ్యాతి సంపాదించుకున్నాడు. అయినా శత్రువుల బంధీఖానా నుంచి వచ్చిన తర్వాత ఆయనకు కొన్ని రోజుల పాటు మనదేశంలోని మిలటరీ ఇంటెలిజెన్స్ విచారణ తప్పదు. సమగ్రమైన వారి విచారణ కూడా తప్పదు. ఇది మిలటరీ నిబంధన. మొట్టమొదటి సారిగా అభినందన్ ను ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ తీసుకెళ్ళారు. అక్కడ ఆయనను పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్కానింగ్ చేసి అతని శరీరంలో ఏవైనా ఎలక్ట్రో సిలికాన్ చిప్స్ అమర్చారేమో పరిశీలిస్తారు. మానసికమైన పరీక్షలు కూడా చేస్తారు. మన దేశ రహస్యాలను అతని నుంచి ఏమైనా రాబట్టారా అన్న విషయాలపై కూడా అనేక ప్రశ్నలు సంధించారు. అవసరమైతే నిజనిర్ధారణ పరీక్షలు కూడా చేస్తారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు రా నిఘా విభాగం అధికారులు ఆయనను విచారిస్తారు. సాధారణంగా ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు తాము మాత్రమే ముగించి దాన్ని ముగిస్తారు. అయితే అభినందన్ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు ఐబీ మరియు రా అధికారులకు అప్పగిస్తారు. శత్రుదేశాలకు బంధీగా వున్నప్పుడు వారికి ఆయన ఏం చెప్పారన్నది ఇంటెలిజెన్స్ అధికారులు రాబట్టాలనుకునేది ప్రధానమైన అంశం. అభినందన్ దేశభక్తి, ధైర్యసాహసాలపై తమకు అచంచలమైన విశ్వాసం వుందని అయితే మిలటరీ నిబంధనల ప్రకారం ఆయనను విచారించక తప్పదని మిలటరీ అధికారులు చెబుతున్నారు. గతంలో నచికేత, ఎయిర్ మార్షల్ నందా కరియప్ప పాకిస్తాన్ బంధీలుగా వున్నప్పుడు ఇదే పద్దతిని అనుసరించారు. నందా కరియప్ప 1965 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి విడుదలయ్యారు. ఆయన భారత సైనిక దళాల పితామహుడు జనరల్ కె.ఎం. కరియప్ప కుమారుడు. పాకిస్తాన్ బంధీలుగా వాళ్ళు మనదేశ రహస్యాలను ఏమీ చెప్పనప్పటికీ మిలటరీ నిబంధనలకు ఎవరూ మినహాయింపు కాదని, అందువల్ల నిబంధనల ప్రకారం విచారించాల్సిందేనని చెబుతున్నారు.

About The Author