పరీక్షల వేళ పోషకాహారం… ప్రత్యేక శిక్షణ…

హాస్టల్ సంక్షేమ అధికారులు ఎస్.ఎస్.సి. పరీక్షలు ప్రారంభమైనందున విద్యార్థులకు మంచి డైట్ ఇవ్వాలని, విద్యార్థులు పరీక్షలు బాగుగా వ్రాసేటట్లు ట్యూటర్లతో శిక్షణ ఇప్పిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్.సి. అభివృద్ధి శాఖ సంచాలకులు శ్రీ పి. కరుణాకర్ ఆదేశించారు. శనివారం సచివాలయం నుండి ఎస్.ఎస్.సి. పరీక్షల నిర్వహణ, ట్రెజరీ లలో బిల్లులు సమర్పణ తదితర విషయాలపై జిల్లా ఎస్.సి. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎస్.ఎస్.సి. పరీక్షలు జరుగుతున్న ఈ సమయంలో హాస్టల్ సంక్షేమ అధికారులు, విద్యార్థులు పరీక్షలలో 100 శాతం రిజల్ట్స్ సాధించడానికి కృషి చేయాలని ఎస్.సి. అభివృద్ధి శాఖ సంచాలకులు శ్రీ పి. కరుణాకర్ ఆదేశించారు. విద్యార్థులకు స్టేషనరీ, కంపాస్, వాటర్ బాటిల్స్, ఎండలు తీక్షణంగా ఉన్నందున ఎనర్జీ కోసం ORS ప్యాకేట్స్, శీతల పానీయాలు అందచేయాలని, పరీక్షా కేంద్రాల వరకు ఆటోలు, మినీ బస్సుల్లాంటి రవాణా సదుపాయాలు కలుగచేయాలని అధికారులకు సూచించారు.
అన్ని జిల్లాల ఎస్.సి. అభివృద్ధి అధికారులు తమ తమ కార్యాలయ బిల్లులకు ట్రెజరీలలో వెంటనే టోకెన్ నెంబరు జనరేట్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. డైట్, కాస్మోటిక్, అంబేద్కర్ ఓవర్శిస్ పథకం వంటి బిల్లుల పేమెంట్స్ పెండింగ్ లో లేకుండా చూడాలని ఆదేశించారు. అవసరం లేని పద్దులలో మిగులు బడ్జెట్ ను ఈ నెల 18 తేదీ లోగా డైరెక్టరేట్ కు సరెండర్ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు సంచాలకులు శ్రీ డి. హన్మంత్ నాయక్, ఉప సంచాలకులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి, విజయమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు.

About The Author