ఐటీ రిటర్న్‌ ఫారాలలో మార్పులు

అన్‌లిస్టెడ్‌ కంపెనీల డైరెక్టర్లు, ఇన్వెస్టర్లకు సహజ్‌, సుగమ్‌ ఫైలింగ్‌ నిషేధం

డొల్ల కంపెనీలు, నిధుల రౌండ్‌ట్రిప్పింగ్‌ అడ్డుకునేందుకు మరో ప్రయత్నం

♦న్యూఢిల్లీ: ప్రస్తుత మదింపు సంవత్సరం(2019-20)లో వ్యక్తులు, కంపెనీల కోసం రూపొందించిన ఆదాయం పన్ను రిటర్ను(ఐటీఆర్‌) ఫారాలను ఐటీ శాఖ విడుదల చేసింది. వేతన జీవులు సమర్పించాల్సిన ఐటీఆర్‌-1(సహజ్‌)లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఐటీఆర్‌-2,3,5,6,7 ఫారాల్లోని కొన్ని సెక్షన్లను మాత్రం హేతుబద్ధీకరించింది. వ్యక్తులు, వ్యాపారాలు, కంపెనీలు 2018-19లో ఆర్జించిన ఆదాయంపై ఈ ఆర్థిక సంవత్సరం(2019-20)లో పన్ను రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. తమ ఖాతాలకు ఆడిటింగ్‌ అవసరం లేని వారు జూలై 31లోగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. కొత్త ఐటీ రిటర్ను ఫారాల్లో చేసిన కీలక మార్పులు..

♦ అన్‌ లిస్టెడ్‌ కంపెనీల డైరెక్టర్లు, వాటిలో పెట్టుబడులు పెట్టిన వారు సహజ్‌, ఐటీఆర్‌-4 (సుగమ్‌)లు సమర్పించకుండా నిషేధించింది. డొల్ల కంపెనీలు, నల్లధనం లాండరింగ్‌ కార్యకలాపాలకు చెక్‌ పెట్టేందుకు ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై లిస్టెడ్‌, అన్‌ లిస్టెడ్‌ కంపెనీల డైరెక్టర్లు ఐటీఆర్‌-2ను సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నుల్లో తమ డైరెక్టర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు (డీఐఎన్‌), పాన్‌ నంబరు, ఈక్విటీ వాటాలతోపాటు ఏయే కంపెనీల్లో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.

♦ అన్‌ లిస్టెడ్‌ కంపెనీల ఇన్వెస్టర్లు సైతం వాటా కొనుగోలు కోసం పెట్టిన పెట్టుబడి, వాటా విక్రయ యోచన, కొనుగోలు లేదా విక్రయించిన తేదీ వంటి వివరాలను రిటర్నుల్లో పొందుపర్చాల్సి ఉంటుంది.
వేతనం, ఇంటి అద్దె, వడ్డీ, వ్యవసాయంలో ఏదేని లేదా పలు మార్గాల ద్వారా రూ.50 లక్షలకు మించని వార్షికాదాయం కలిగిన వ్యక్తులు (అన్‌ లిస్టెడ్‌ కంపెనీల డైరెక్టర్లు, ఇన్వెస్టర్లు మినహాయించి) మాత్రమే ఐటీఆర్‌-1 (సహజ్‌) ఫైల్‌ చేయడానికి అనుమతి ఉంటుంది.

♦ సంభావిత ఆదాయ పథకంలో భాగంగా వ్యాపారం, ప్రొఫెషనల్‌ సర్వీసుల ద్వారా రూ.50 లక్షల వరకు వార్షికాదాయం ఆర్జించే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(హెచ్‌యూఎఫ్‌), సంస్థలు (అన్‌ లిస్టెడ్‌ కంపెనీల డైరెక్టర్లు, ఇన్వెస్టర్లు మినహాయించి) మాత్రమే ఐటీఆర్‌-4 లేదా సహజ్‌ను సమర్పించవచ్చు. అన్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో డమ్మీ డైరెక్టర్ల నియమాకాలు, డొల్ల కంపెనీల ద్వారా నిధుల రౌండ్‌ట్రిప్పింగ్‌కు పాల్పడకుండా అడ్డుకునేందుకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

♦ ఇక కంపెనీలు ఫైల్‌ చేయాల్సిన ఐటీఆర్‌-6 విషయానికొస్తే.. కొత్త ఫారాల్లో స్టార్ట్‌పల కోసం ప్రత్యేక కాలమ్‌ను పొందుపర్చడం జరిగింది. ఇందులో స్టార్ట్‌పలు డీపీఐఐటీ గుర్తింపు, పెట్టుబడిదారులు, షేర్ల జారీ ధర, సేకరించిన నిధుల వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.

♦ఐటీఆర్‌-6ను సమర్పించే అన్‌ లిస్టెడ్‌ కంపెనీలు కూడా తమ ఇన్వెస్టర్లు, భారత్‌లో వారి నివాస హోదా, పాన్‌, షేర్లను కేటాయించిన తేదీ, ఒక్కో షేరు ధర, వారు కలిగి ఉన్న షేర్లు, పెట్టిన పెట్టుబడి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.
విదేశీ కంపెనీలు ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయంలో అసలు లబ్ధిదారు (మాతృసంస్థ) కంపెనీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

♦వ్యవసాయం ద్వారా
ఆదాయం పొందుతూ ఐటీఆర్‌- 2 సమర్పించే వారు వారి సాగు భూమి గురించి పూర్తి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఎన్ని ఎకరాల పొలం ఏ జిల్లాలో (పిన్‌కోడ్‌తో సహా) ఉంది, సొంతం లేదా కౌలు తీసుకున్నారా..?, వర్షాధారితమా లేక సాగు నీటి సౌకర్యం ఉందా? ఇలా అన్ని వివరాలను సమర్పించాలి.
విదేశీ ఆస్తులు, విదేశాల నుంచి లభించే ఆదాయ వెల్లడికి సంబంధించిన షెడ్యూలు ఎఫ్‌ఏలో అదనపు వివరాలు అందించేందుకు వీలుగా మరిన్ని కాలమ్స్‌ను జత చేశారు.

♦ఐటీఆర్‌-2 సమర్పించేవారిలో ఇంటి అద్దె రూపంలో ఆదాయం ఆర్జిస్తుంటే ఇకపై అద్దెకు తీసుకున్నవారి పాన్‌ లేదా టాన్‌ (ట్యాక్స్‌ డిడక్షన్‌ అండ్‌ కలెక్షన్‌ అకౌంట్‌ నంబర్‌) వివరాలు సైతం పొందుపర్చాల్సిందే.
విరాళాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకునేవారు విరాళం అందుకున్న వారి పేరు, చిరునామా, పాన్‌తో పాటు నగదు రూపకంగా ఎంతిచ్చారు అన్న వివరాలూ సమర్పించాల్సిందే.

♦ ఐటీఆర్‌-3, 4, 6 సమర్పించే వ్యాపార సంస్థలు సరఫరా చేసిన వస్తువులు వార్షిక విలువ, జీఎ్‌సటీ ప్రకారంగా టర్నోవర్‌ వివరాలను సైతం పొందుపర్చాలి. వీరి ఐటీ రిటర్నులను జీఎ్‌సటీ రిటర్నులతోనూ పోల్చి చూసేందుకు వీలుగా ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

♦గత ఏడాది ఐటీఆర్‌-4 సమర్పించిన వ్యాపార సంస్థలకు జీఎ్‌సటీ వివరాలను (జీఎ్‌సటీ గుర్తింపు నంబరుతో సహా) పొందుపర్చడం తప్పనిసరి చేసింది. ఇకపై ఐటీఆర్‌-3, 6 ఫైల్‌ చేసేవారు సైతం ఈ వివరాలు అందించాల్సి ఉంటుంది

About The Author