భాగవతం – 4 వ భాగం :-
అటువంటి వానికి ఇంద్రపదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు.
అటువంటి మహానుభావుడయిన శుకుడు నిరంతరమూ ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదయినా ఒక ప్రదేశమునకు వస్తే ఒక ఆవుపాలు పితకడానికి ఎంతసమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు వాడు కాదు. ఎందుకు? ఒకవేళ ఎక్కడయినా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి, వీరు ఫలానా వీరు ఫలానా అని గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ లోపలపెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమము తగ్గిపోయి లోకముతో సంగమం పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని ఏడురోజులు భాగవతములు ప్రవచనము చేశాడు.
భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరు వినలేరు అని శాస్త్రం చెపుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన పదిహేడు పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది. ఏదో నిరాశ! ఏదో లోటు! తానేదో తక్కువ చేశాననే భావన! ‘ఎక్కడో ఏదో చెయ్యడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది’ అని అనుకున్నారు.
ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. ‘వేదరాశినంతటినీ విభాగం చేశాను. పదిహేడు పురాణములను రచించాను. బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను. ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది’ అని ఆలోచన చేశారు.
ఆ ఆలోచన చేసినపుడు మహానుభావుడు నారదుడు దర్శనం ఇచ్చారు. మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడూ నారదుడే. భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడూ నారదుడే. ‘నారం దదాతి ఇతి నారదః’ – ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒకమాట చెప్పారు. ‘వ్యాసా, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో, ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు. భారతమును రచించావు. కానీ భారతంలో కృష్ణకథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు. అంతేతప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతున్నదో విశ్వము ఎలా సృష్టించబడిందో పంచభూతములు ఎలావచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయై స్థితికర్తయై, ప్రళయ కర్తయై ఈలోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు. ఆకారణం చేత నీమనస్సులో ఎక్కడో చిన్నలోటు ఏర్పడింది ✍