?విద్యార్థుల కన్నీటికి కారకులెవరు?

?అనుభవం లేని సంస్థకు అప్పనంగా టెండరు

?నిబంధనలు సడలించి మరీ గ్లోబరీనాకు ఖరారు

?15 ఏళ్లుగా ఉన్న సంస్థను తప్పించి అప్పగింత

?అర్హతలు లేకపోయినా ప్రభుత్వ పెద్దల సాయం

?సమస్యలపై ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’
పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు

?ఇప్పుడు అక్షర సత్యమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు

?అప్పట్లో గ్లోబరీనాకు కడియం కమిటీ గ్రీన్‌సిగ్నల్‌

?ఇప్పుడు అదే గ్లోబరీనా సామర్థ్యాలపై ప్రత్యేక కమిటీ

?ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

?మా నుంచి ఎలాంటి సమస్యలూ లేవు: గ్లోబరీనా

*”ఆంధ్ర జ్యోతి ” హైదరాబాద్*

ఇంటర్‌ పరీక్షల ముందు హాల్‌ టికెట్లు జారీ చేశారు. వాటిలో బోలెడు తప్పులు దొర్లాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్‌ బోర్డు ఎదుట ఆందోళన చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి వరకూ హాల్‌ టికెట్లలో తప్పులు సరి చేయించుకుని 18వ తేదీన ఉదయమే పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్‌ ఫలితాలు వెల్లడించారు. ‘99’ మార్కులు వచ్చిన విద్యార్థికి ‘00’ మార్కులు వేశారు. మొత్తంమీద 900 మార్కులకుపైగా తెచ్చుకున్న టాపర్లనూ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ చేశారు. ఓ విద్యార్థి ఫస్టియర్లో అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ, సెకండియర్‌ ఫలితాల తర్వాత ఫస్టియర్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ చేశారు. ఇలా.. హాల్‌ టికెట్ల జారీ నుంచి ఫలితాల వెల్లడి వరకూ ఇంటర్‌ బోర్డు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. సాధారణంగా, ఇంటర్‌ ఫలితాలు వెల్లడైతే.. కొంతమంది విద్యార్థుల్లో సంతోషం కనిపిస్తుంది. మరి కొంతమందిలో బాధ కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది మొత్తం విద్యార్థులందరి ముఖాలు కన్నీటితో కనిపిస్తున్నాయి. పాసైన విద్యార్థి కళ్లు, ఫెయిలైన విద్యార్థి కళ్లు.. చివరికి టాపర్ల కళ్లు కూడా కన్నీటిని వర్షిస్తున్నాయి. దీనికి కారకులెవరు? ఈ పాపం ఎవరిది? ఈ తప్పు ఇంటర్మీడియట్‌ బోర్డుదా? గ్లోబరీనా సాఫ్ట్‌వేర్‌ సంస్థదా?

ఆది నుంచే సమస్యలే..

?ప్రస్తుత (2018-19) విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ ఇంటర్‌ బోర్డు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. బోర్డులో ఈ ఏడాది అధికారులు చేపట్టిన ప్రతి పనిపై ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. విద్యార్థుల వివరాల సేకరణ నుంచి మొదలుకుని ఫలితాల విడుదల వరకూ అన్నిటా సమస్యలే. దాంతో, విద్యార్థులు, కాలేజీల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి, విద్యార్థుల వివరాల సేకరణ (డేటా క్యాప్చరింగ్‌) ఏటా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) చేస్తోంది. కానీ, ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది సాఫ్ట్‌వేర్‌ సంస్థ గ్లోబరీనా ఆ పని చేయాలి. కానీ, విద్యార్థుల వివరాల సేకరణలో గ్లోబరీనా ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో, బోర్డు అధికారులు మళ్లీ ఆ పనిని సీజీజీకి అప్పగించారు.

ఫీజులతోనూ పరేషాన్‌:

?ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపులోనూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. వెబ్‌సైట్లో విద్యార్థుల వివరాలు గల్లంతు కావడం, ఫీజు చెల్లించినా చెల్లించనట్లు చూపడం, ఇలా అనేక సమస్యలు ఎదురయ్యాయి. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో, పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను మూడుసార్లు పొడిగించారు. దీనినిబట్టే, విద్యార్థులకు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయో అర్థం చేసుకోవచ్చు. పలు ప్రభుత్వ కాలేజీలు రెండుసార్లు ఫీజు చెల్లించాల్సి రావడం గమనార్హం.

? టెండర్‌… మాయాజాలం:

ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్‌కు ఈ ఏడాది నిర్వహించిన టెండర్ల ప్రక్రియ అంతా ఓ మాయాజాలాన్ని తలపించింది. నిజానికి, 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న మ్యాగ్నటిక్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థను ఈ ఏడాది తప్పించారు. గ్లోబరీనా అనే కొత్త సంస్థకు టెండరు కట్టబెట్టారు. ఈ టెండరు వ్యవహారంలో అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. తగిన అర్హతలు లేకపోయినా.. నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయంతో గ్లోబరీనా ఈ టెండరు దక్కించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేసి మరీ గ్లోబరీనాకు టెండరు కట్టబెట్టారనే ఆరోపణలు వెలువడ్డాయి. వీటికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒక్క ఇంటర్‌ బోర్డుకు కూడా గ్లోబరీనా ఇప్పటి వరకు ఫలితాల ప్రాసెసింగ్‌ నిర్వహించ లేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షలు. కానీ, గ్లోబరీనా ఇప్పటి వరకు గరిష్ఠంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థుల ఫలితాలనే ప్రాసెసింగ్‌ చేసింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి రాజు కూడా అంగీకరించారు. అయితే, 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న సంస్థను కాదని.. అంతగా అనుభవం లేని గ్లోబరీనాకు నిబంధనలు సడలించి మరీ టెండరు అప్పగించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇందుకు బోర్డు కార్యదర్శి అశోక్‌ పలు కారణాలను వివరించారు.

?‘‘ఇప్పటి వరకు పరీక్ష ఫలితాల ప్రాసెసింగ్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంతా. ఇందుకు ఇప్పటి వరకు సుమారు 8-10 కోట్లు ఖర్చు చేశాం. సొంతంగా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసుకోవడంలో భాగంగానే గ్లోబరీనాకు టెండరు అప్పగించాం. మూడేళ్లపాటు ఆ సంస్థ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తుంది. ఆ తర్వాత ఆ సాఫ్ట్‌వేర్‌ను ఎలాంటి ఖర్చు లేకుండానే బోర్డుకు అప్పగిస్తుంది. ఆ తర్వాతి ఏడాది నుంచి బోర్డు ఉద్యోగులే పరీక్ష ఫలితాల ప్రాసెసింగ్‌ చూసుకుంటారు’’ అని గతంలో తెలిపారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. అయితే, ఇదే ఒప్పందాన్ని మ్యాగ్నటిక్‌ సంస్థతో ఎందుకు కుదుర్చుకోలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. 15 ఏళ్లుగా మిగతా కంపెనీల కన్నా తక్కువ కోట్‌ చేస్తూ టెండరు దక్కించుకున్న మ్యాగ్నటిక్‌.. ఈ ఏడాది ఎందుకు విఫలమైందనే ప్రశ్నలు వచ్చాయి. ఇందుకు బోర్డులోని అధికారులు గ్లోబరీనాకు అంతర్గతంగా సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటికే ముగిసిన 2017-18 ఫలితాలను మళ్లీ ప్రాసెసింగ్‌ చేయడానికి గ్లోబరీనాకు డబ్బులు ఇచ్చేలా టెండర్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

? అర్హతలు చూడకుండానే ఇచ్చారా!?:

గ్లోబరీనాకు తగిన అర్హతలు లేవని, టెండరు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని గతంలో ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై బోర్డు కార్యదర్శి అశోక్‌ స్పందించారు. అన్నీ నిబంధనల ప్రకారమే టెండరు కేటాయించినట్లు తెలిపారు. ఐటీ శాఖ అధికారులతో కూడిన విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ టెండరును పరిశీలించి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తప్పితే.. గ్లోబరీనాకు ఉన్న అర్హతలు ఏమిటి? గతంలో ఎక్కడెక్కడ పని చేసింది? టెండరు కోసం బోర్డు నిబంధనలు ఏమిటి? అనే అంశాలను బోర్డు కార్యదర్శి వెల్లడించలేదు. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వ్యక్తం చేసిన ఆందోళనకు అనుగుణంగానే ఇప్పుడు పరీక్ష ఫీజులు, హాల్‌ టికెట్ల జారీ, ఫలితాల వెల్లడిలో గందరగోళం చోటుచేసుకుంది.

?దాంతో, ఇప్పుడు ప్రభుత్వం ముగ్గురు నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గ్లోబరీనా పనితీరు, సామర్థ్యంపై విచారణ చేయాలని నిర్దేశించింది. దానిలో తగిన సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారా? ఫలితాల వెల్లడి సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉన్నాయా? తదితరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో ఐటీ అధికారులతో కూడిన మంత్రి కడియం నేతృత్వంలోని కమిటీ గ్లోబరీనాకు అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకోకుండానే టెండరు ఇచ్చిందా!? ఒకవేళ, నాడు ఇచ్చి ఉంటే అందుకు వచ్చిన ఒత్తిళ్లు ఏమిటి!? నాడు సమగ్రంగా పరిశీలించి ఉంటే.. నాటి కమిటీ ఓకే చెప్పిన సంస్థపై ఇప్పుడు మళ్లీ ప్రత్యేక కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటి..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఫలితాల్లో గందరగోళానికి కారణం బోర్డా..? గ్లోబరీనా సంస్థనా..? తేల్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

?ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’:

ఇంటర్‌ ఫలితాల ప్రాసెసింగ్‌ను గ్లోబరీనాకు అప్పగించిన నేపథ్యంలో.. టెండరు ప్రక్రియలో లోపాలు, గ్లోబరీనా సామర్థ్యాలు, ఇతర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలను ప్రచురించింది. సదరు సంస్థకున్న అనుభవం, ఇతర అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. గ్లోబరీనా ద్వారా పరీక్షలు నిర్వహిస్తే ఆ తర్వాత ఫలితాల వెల్లడిలో ఇబ్బందులు తప్పవని ‘ఆంధ్రజ్యోతి’ ఆనాడే హెచ్చరించింది. ఈ విషయాన్ని నాటి ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు గానీ పట్టించుకోలేదు. పైగా, ‘ఆంధ్రజ్యోతి’ కథనాలను ఖండిస్తూ బోర్డు కార్యదర్శి అశోక్‌ పలుమార్లు రిజాయిండర్లు (ఖండనలు) పంపించారు. కానీ, ప్రస్తుతం ఫలితాల్లో జరుగుతున్న గందరగోళాన్ని గమనిస్తే నాడు ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిన విషయాలు అక్షర సత్యమయ్యాయి. ఇక, ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళ పరిస్థితులు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని ప్రస్తుత ఉన్నతాధికారులు, ఇతర పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

సాంకేతిక సమస్యలు లేవు: రాజు, గ్లోబరీనా ప్రతినిధి

పరీక్ష ఫలితాల వెల్లడిలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సరి చేస్తున్నాం. ఫలితాల విడుదల రోజున మా దృష్టికి వచ్చిన సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాం. ఫలితాల వెల్లడిలో మావైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవు. ఇక, టెండరును కూడా నిబంధనల ప్రకారమే కోట్‌ చేసి దక్కించుకున్నాం. మాకు ఎవరూ సహాయం చేయలేదు. గతంలో ఇతర వర్సిటీల్లో పరీక్షలు, ఫలితాలు నిర్వహించిన అనుభవం మాకు ఉంది.

About The Author