టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ నూతన మేయర్ శ్రీ గుండా ప్రకాష్.
నూతనంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన గుండా ప్రకాష్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్ గా ఎంపికైన ప్రకాష్ గారిని కేటీఆర్ గారు అభినందించారు. నూతన మేయర్ తో పాటు జిల్లా మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండ ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ రాజయ్య, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి గుండు సుధారాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బస్వరాజు సారయ్య, మరియు పలువురు సీనియర్ నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. ఏకగ్రీవంగా మేయర్ ఎన్నిక ను పూర్తి చేసినందుకు స్థానిక నాయకులతో పాటు పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ శ్రీ బాలమల్లుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ నగర పాలక సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని, ఇందుకోసం స్థానిక కార్పొరేటర్లను అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని నూతన మెయర్ కి కేటీఆర్ సూచించారు.