తెలంగాణాలో నదుల సుందరీకరణ ప్రణాళిక బాగు…
★ నదుల సుందరీకరణ ప్రణాళిక బాగు
★ ఇంటింటి చెత్త సేకరణలో వేగం అభినందనీయం
★ తెలంగాణలో కాలుష్య నియంత్రణ చర్యలు భేష్
★ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశంసలు
★ ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న సీఎస్ ఎస్కేజోషి
రాష్ట్రంలో కాలుష్య నివారణకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సంతృప్తి వ్యక్తంచేసింది. ఇంటింటి చెత్త సేకరణలో 96శాతం లక్ష్యాలను సాధించినందుకు అభినందించింది. రాష్ట్రంలో నదుల సుందరీకరణ కార్యాచరణ ప్రణాళిక బాగుందని కితాబిచ్చింది. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియలో ఫలితాలు మరింత మెరుగుపడాలని సూచించింది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ, నివారణ, ఘన, ప్లాస్టిక్ వ్యర్థపదార్థాల నిర్వహణకు సంబంధించి ఢిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి పీ సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు. కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వపరంగా, ప్రభుత్వ శాఖలు, పురపాలకసంఘాలవారీగా తీసుకుంటున్న చర్యలపై ఎన్జీటీ పాలకమండలికి సీఎస్ సమగ్ర నివేదికను అందజేశారు. రాష్ట్రంలో మూసీనదితోపాటు మంజీరా, సింగూరు వంటి నదుల పునరుజ్జీవం, సుందరీకరణకు చేపడుతున్న కార్యక్రమాలను ఎన్జీటీకి వివరించారు. నదుల పునరుజ్జీవం, కాలుష్య నివారణకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించారు. రాష్ట్రంలో రోజుకు 8,450 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, రోజుకు దాదాపు 8,273 మెట్రిక్‌టన్నుల వ్యర్థాలను ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నట్టు సీఎస్ వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ పకడ్బందీగా జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో రోజూ 15వేల కిలోలకు పైగా బయోమెడికల్ వేస్ట్‌ను సేకరిస్తున్నామని, భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి కొత్త ప్లాంట్లను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నామని నివేదికలో పేర్కొన్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించామని చెప్పారు. అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలను నిరోధించామని చెప్పారు. ప్రస్తుతం 1,979 పరిశ్రమల్లో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఈటీపీలు) పనిచేస్తున్నాయని వివరించారు.