మూడు ఫ్లైట్లు – ముప్పు తిప్పలు – మూడు పాట్లు

ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ టూర్. ఫెడరల్ రాజకీయాలు. ఈసారి వేదిక కేరళ. తిరువనంతపురంలో అక్కడి సీఎం పినరయ్ విజయన్ తో భేటీ. సమాచారం రెండురోజుల ముందే తెలుసు. ఐనా అధికారికంగా ప్రకటించచాల్సిందే. అప్పటివరకు ఎలాంటి కదలిక ఉండదు. టీ న్యూస్ కావడంతో ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం షరా మామూలే!

ఆదివారం నాకు సెలవు. ప్రెస్ క్లబ్ లో ఈసీ మీటింగ్ అంటే వెళ్ళాను. అది ముగించుకుని ఇల్లు చేరే దారిలో ఉన్నాను. కట్ చేస్తే మే 5 న సీఎంఓలో ప్రకటన. సీఎం కేరళ, తమిళనాడు వెళ్తారని వాట్సప్ లో అధికారిక సమాచారం. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు ఆపి, విషయాన్ని ఆఫీస్ లో చేరవేసాను. మనం కవరేజికి వెళ్లాల్సి ఉంటుందా అని కూడా అడిగాను. పైవాళ్ళను అడిగి చెప్తామనే సమాధానంతో మళ్లీ డ్రైవింగ్ మొదలుపెట్టాను. ట్రాఫిక్ పద్మవ్యూహం దాటుకుంటూ, దాటుకుంటూ సరిగ్గా జేఎన్టీయూ చేరాను. సీఈఓ నుంచి కాల్. కేరళ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోమని ఆదేశం. అప్పటికి టైం రాత్రి పదిన్నర దాటింది. ఐనా సరే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ముందు ఫ్లైట్ టికెట్లు కొనాలి. మా హెచ్చార్ కు ఫోన్ చేశాను. ఈరాత్రి చేయగలిగింది ఏమీ లేదని చేతులెత్తేశాడు. నీకేమైనా మార్గం ఉంటే ప్రయత్నించు, మిగతా విషయాలు పొద్దున చూద్దాం అన్నాడు. ఇదిగో సరిగ్గా ఇక్కడ షురూ అయ్యాయి అసలైన ఇక్కట్లు. ఈ తతంగం ముగిసేసరికి రాత్రి 11:30 దాటింది. దాదాపు దారులన్నీ క్లోజ్. ఇక కష్టమే అనుకుంటున్న టైంలో, నాతోనే ఉన్న మా ఫ్రెండ్, ఉండు నేను ప్రయత్నిస్తాను అన్నాడు.

ఫ్లైట్ టికెట్ల వేట మళ్ళా మొదలైంది. కానీ ఒక్కటంటే ఒక్కటి అనుకూలమైన షటిల్ లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చెరోవైపు ప్రయత్నిస్తున్నారు. ఇటు, మా సీఈఓ, హెచార్లు వేరువేరు ఫోన్లలో లైన్లో ఉన్నారు. అటు డైరెక్ట్ ఫ్లైట్స్ దొరకడం లేదు. ఇటు కనెక్టింగ్ ఫ్లైట్స్ లో ఖాళీలు లేవు. ఖాళీ ఉన్న ఫ్లైట్స్ లో ధరలకు క్షణాల మీద రెక్కలొచ్చేస్తున్నాయి. అన్నా ఏదున్నా రేపు చూసుకుందాం. నువ్వైతే ట్రై చెయ్, అని ముక్తాయిస్తూ మా హెచ్చార్ ఫోన్ కట్ చేశాడు. సీఈఓ మాత్రం రాత్రి 1:30 వరకు లైన్లోనే ఉండి నన్ను గైడ్ చేశాడు. ఈలోపు మా ఫ్రెండ్ పిల్లల నుంచి కాల్. అంకుల్ ముందు బెంగళూరు, అక్కడి నుంచి త్రివేండ్రంకు రెండు వేరువేరు ఫ్లైట్స్ ఉన్నాయి. బుక్ చేయమంటారా అని అడిగారు. ఐతే ధరలు మాత్రం మండిపోతున్నాయని కాషన్ చేశారు. సీఎం ప్రోగ్రాం. ఎలాగూ వెళ్లక తప్పదు. ఫోన్ లైన్లోనే ఉన్న మా సీఈఓ కూడా రెండో ఆలోచన లేకుండా, ఒకే ప్రొసీడ్ అన్నారు. దాంతో అర్ధరాత్రి దాటాక ఆ రెండు ఫ్లైట్లలో టికెట్లు బుక్కయ్యాయి. తంతు ముగిసేసరికి రాత్రి 2 అయింది. ఇంత పెరుగన్నం తిని బెడ్ ఎక్కాను.

#మొదటికే_మోసంలా_ఫస్ట్_ఫ్లైట్

ఫ్లైట్ జర్నీ అంటే ఓ రెండు గంటల ముందే ఎయిర్ పోర్ట్ లో ఉండటం నాకలవాటు. నాతో వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉండాలి. ముందు నుంచీ అదే పద్ధతి. అందుకే ఉదయం 4:30 కు లేచాను. అంటే బెడ్ పై నేను అటూ ఇటూ దొర్లింది తిప్పి కొడితే ఓ 2 గంటలు. సరె, అది పక్కన పెడితే ఆఫీస్ కార్లో ఓఆరార్ మీదుగా అనుకున్న టైమ్ కే ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. ఉదయం 9:30 కు గో ఎయిర్ ఫ్లైట్లో బెంగళూరు ప్రయాణం. కౌంటర్లో బోర్డింగ్ పాస్ లు తీసుకుని కొంత లగేజ్ అక్కడ అప్పగించాం. హ్యాండ్ లగేజీని కూడా సీఐఎస్ఎఫ్ దగ్గర స్కాన్ చేయించాం. వాళ్ళ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ ఇన్ అయ్యాం. ఎన్నడూ లేంది ఈసారి నడుముకి ఉన్న బెల్ట్ కూడా తీయించి మరీ చెక్ చేశారు. చెక్ ఇన్ తరవాత లోపల కొంత ఫ్రీటైం దొరికింది. బ్రేక్ ఫాస్ట్ చేశాం. ఈలోపు గేట్ నెంబర్ 31 దగ్గర బోర్డింగ్ అనౌన్స్ మెంట్. నేను, కెమెరామన్, టెక్నీషియన్ బోర్డయ్యాం. షటిల్ కూడా ఇన్ టైంలో టేక్ ఆఫ్ అయింది. గంట జర్నీ. రాత్రంతా నిద్ర లేకపోవడంతో నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నాను.

ఫ్లైట్ లాండింగ్ గురించి పైలట్ చేసిన అనౌన్స్ మెంట్ ను నిద్రలోనే విన్నాను. ఈలోపు కొంత అస్పష్టత. ఎందుకో కళ్ళు తెరిచి ఓసారి విండో దిక్కు చూసాను. విండో దగ్గరే కూచున్న మా టెక్నీషియన్ కూడా విండో లోంచి ఫ్లైట్ లాండింగ్ చూస్తున్నాడు. విమానం రెండు గీరెలు భూమిని తాకాయి. ముందుండే మూడో వీల్ గేర్ ఓపెన్ కాలేదో ఏమో! ఉన్నట్టుండి పైలట్, అమాంతంగా మళ్లీ ఫ్లైట్ ను టేక్ ఆఫ్ చేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపాటు. అన్నా, ఫ్లైట్ మళ్లీ టేక్ ఆఫ్ అయితుందని మా టెక్నీషియన్ కూడా అరవడంతో, నిద్ర హుష్కాకి. ప్రాణాలు ఆల్మోస్ట్ అరచేతిలోకి వచ్చినంత పనైంది. చూస్తుండగానే యుద్ద విమానం తరహాలో రయ్మంటూ మళ్ళా హై ఆల్టిట్యూడ్ లోకి దూసుకెళ్ళాం. చావు కబురు చల్లగా చెప్పాడు పైలట్. సరిగ్గా లాండింగ్ సమయంలో ఫ్లైట్ తన అదుపులో లేకుండా పోయిందని అనౌన్స్ చేశాడు. అంతటి ఏసీలో సైతం చల్ల చెమటలు పట్టాయి. ఏం జరుగుతుందో అని మేం ఒకళ్ళ ముఖం ఒకళ్ళం చూసుకున్నాం. అసలేం జరిగిందో మాత్రం పైలట్ చెప్పలేదు. కానీ, ఫ్లైట్ ఆకాశంలో ఓ చుట్టుచుట్టి రన్ వే పై గద్దలా వాలింది. హమ్మయ్య బతుకు జీవుడా అనుకున్నాం. ఉసూరుమని నిట్టూరుస్తూ ఫ్లైట్ బే నుంచి బస్సులో బయలుదేరాం. బెంగుళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. అప్పటికి టైం ఉ. 11:45 అయింది.

కన్వేయర్ బెల్ట్ దగ్గరికి చేరుకున్నాం. ఫ్లైట్ లో ప్రకటించిన బెల్ట్ నెం 2 కాక, బెల్ట్ నెం 7 పై లగేజీల రవాణా జరిగింది. సరే, అక్కడికి వెళ్లి మా లగేజీలు అన్నీ ఒక్కొక్కటిగా చేజిక్కించుకొని, ఇండిగో కౌంటర్ల వైపు వెళ్ళాం. త్రివేండ్రం రవాణా కోసం బోర్డింగ్ పాసులు తీసుకున్నాం. అక్కడే లగేజ్ కూడా ఇచ్చేసాం. మిగిలిన హ్యాండ్ లగేజ్ స్కానింగ్ చేయించి సీఐఎస్ఎఫ్, డీఎఫ్ఎండీ దగ్గర చెక్ ఇన్ అయ్యాం. మ. 1:30 కు షటిల్. మరో గంట సమయం ఉండటంతో అక్కడే లంచ్ చేశాం. గేట్ నెం 28 దగ్గరికొచ్చాం. ఈలోపు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ జట్టు గేట్ నెం: 27 నుంచి బోర్డ్ అవుతున్నారు. కెమెరామెన్, టెక్నీషియన్లు క్రికెటర్ల దగ్గరికి వెళ్ళి చుసొచ్చారు. నేను మాత్రం అక్కడే ఉన్నాను. ఐతే నా పక్క నుంచే వెళ్ళిన శ్రీలంకన్ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ను మాత్రం అతి దగ్గరగా చూశాను. ఇంతలో బోర్డింగ్ అనౌన్స్ మెంట్.

#రెంటికీ_చెడ్డ_రెండో_ఫ్లైట్

గేట్ నెం 28 ఫ్లైట్ బే రాంప్ ద్వారా విమానంలోకి చేరుకున్నాం. నెంబర్లు చూసుకుని సీట్లలో సెటిల్ అయ్యేలోపు పైలట్ అనౌన్స్ మెంట్. టేకాఫ్ కు గంటన్నర డిలే ఉందనేది దాని సారాంశం. పాసింజర్లలో అసహనాన్ని తగ్గించడానికి ఫ్లైట్ క్రూ రంగంలోకి దిగింది. అందరికీ స్నాక్స్ అందించారు. ఈలోపు ఒక ఎయిర్ హోస్టెస్ ను ఫ్లైట్ డిలేకు కారణం ఏంటని అడిగాను. అందుకు బదులుగా ఆమె, ఇవాళ త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ రన్వే మూసి ఉంచే రోజు. మధ్యాహ్నం 3:30 తరవాత రన్వే ఓపెన్ చేస్తారు అని చెప్పింది. అందుకు అనుగుణంగా విమాన సమయాన్ని సవరించారు అన్నది. కొంత వింతగా అనిపించింది. అదేంటని అడిగాను. దానికి ఆమె, ప్రతీ ఎయిర్ పోర్ట్ కు వారంలో ఏదో ఒకరోజు రన్వే క్లోజర్ డే ఉంటుంది. సోమవారం త్రివేండ్రం రన్వే క్లోజర్ డే అని వివరించింది. ఒక కొత్త విషయం తెలుసుకున్నాం అనుకొని సైలెంట్ అయిపోయాను. కానీ ఫ్లైట్ డిలే కారణంగా మా ప్రోగ్రాం దెబ్బతింటుందనే ఆందోళన మాత్రం కొనసాగుతోంది. సరిగ్గా ఫ్లైట్ సమయాలను లెక్కలు కట్టి టికెట్లు బుక్ చేశాం. తీరా త్రివేండ్రంలో సీఎం గారి మొదటి ప్రోగ్రాం టైంకు చేరుకోలేమేమో అనే అనుమానం మొదలైంది.

సరే, ఆ ఆలోచనలు నా మదిలో అలా గింగిరాలు తిరుగుతుండగానే, త్రివేండ్రంలో మిత్రులకు ఫోన్ చేసాను. ఒక నమ్మకమైన డ్రైవర్ ఉన్న క్యాబ్ బుక్ చేయమని కొరాను. 5 ని.ల్లో క్యాబ్ నెంబర్, డ్రైవర్ వివరాలు మెసేజ్ వచ్చాయి. నేను కూడా డ్రైవర్ తో మాట్లాడి, మేము రావడం కొంత ఆలస్యం అయినా కంగారు పడద్దని చెప్పాను. ఈలోపు 2 గంటలు లేట్ గా అంటే సా. 4 గం.లకు ఫ్లైట్ బెంగుళూరులో టేకాఫ్ అయింది. ఒక గంట ప్రయాణం. త్రివేండ్రంలో దిగాం. సీఎం ప్రోగ్రాం కనుక్కున్నాను. ఆయన త్రివేండ్రం చేరారు, కానీ ఇంకా హోటల్ నుంచి బయలుదేరలేదు. మొదటి ప్రోగ్రాం పద్మనాభ స్వామి టెంపుల్. ఎయిర్ పోర్ట్ కు 7 కి.మీ. బయట క్యాబ్ రెడీగా ఉంది. లగేజ్ తీసుకుంటే, కార్లో బయలుదేరి 10 ని.ల్లో అక్కడికి చేరడమే తరవాయి. ఫ్లైట్ లో కన్వేయర్ బెల్ట్ నెంబర్ 3 అని ప్రకటించారు. అక్కడికి చేరుకొని ఒక్కొక్కటిగా లగేజ్ చేజిక్కించుకున్నాం. మొత్తం 4 లగేజీల్లో 3 చేతికి అందాయి. నాలుగోది రావాలి. బెల్ట్ ఆగిపోయింది. ఒక బాగ్ రాలేదు. ఇక టెన్షన్ మెల్లిగా మొదలైంది. మిస్సింగ్ బాగ్ కోసం ఇండిగో సిబ్బందిని సంప్రదించాము. బెంగళూరు ఫోన్ కమ్యునికేషన్, మా మధ్య వాగ్వాదాల తరవాత, బాగ్ బెంగళూర్ లోనే ఆపేశారని తేలింది. దాన్ని ఇండిగో సిబ్బంది త్రివేండ్రంకు పంపనేలేదు. ప్రత్యక్ష ప్రసారానికి అవసరమయ్యే ముఖ్య సరంజామా అంతా ఆ బాగ్ లోనే ఉందిపోయింది. మా పర్యటన ఉద్దేశ్యమే సీఎం టూర్ లైవ్ కవరేజీ. అది కాస్తా చెడిపోయింది. ఇక సహనం నశించింది. అప్పటికే సమయం మరో అరగంట లాగేసింది. ఠారెత్తిపోయాను. ఇండిగో సిబ్బందిపై ఫైర్ అయ్యాను. ముందే ఫ్లైట్ డిలే అని టైం తగలబెట్టారు. ఇప్పుడు లగేజ్ ఆపేసి మరింత ఇబ్బంది పెడుతున్నారు అని నిలదీసాను. అందుకు బదులుగా వాళ్ళు, బాగ్ లో పవర్ బాంక్ ఉంది. దాంట్లో లిథియం బ్యాటరీ ఉంటుంది. అది పేలుడు పదార్థం కిందికి వస్తుంది. లగేజీలో రవాణా చెయ్యకూడదు. సెక్యూరిటీ చెక్ ఇన్ అయి, అక్కడి నుంచి హ్యాండ్ బ్యాగేజీలో తెచ్చుకోవాలి అని చెప్పారు. దాంతో ఒళ్ళు మండిపోయింది. టెక్నీషియన్ కు గట్టిగా నాలుగు అక్షింతలేసాను.

విషయం మా ఆఫీస్ లో సంబంధిత అథారిటీలకు చేరవేసాను. ఈలోపు ఆఫీస్ నుంచి ఓ వాట్సప్ కాల్. ఈమాత్రం దానికి కేరళ ఎందుకు వెళ్ళిండ్రయా, పీకడానికా, అంటూ షంటింగ్. తల కొట్టేసినట్లయింది. 20 ఏళ్ల కెరీర్లో కొన్ని వందల టూర్లు చేశాను. కానీ ఇలా ఎన్నడూ జరగలేదు. వెళ్ళిన ప్రోగ్రాం ఫెయిల్ అయింది లేదు. అసలు నేను వెళ్ళానంటే ఆ ట్రిప్ నూరు శాతం సక్సెస్ అవుతుంది. గొప్పని కాదు గానీ, పని పట్ల నిబద్దత, పకడ్బందీ ప్రణాళిక, ఫీల్డ్ లో స్పీడ్ రియాక్షన్ నా బలాలు. అవన్నీ మాయమైపోయాయి. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. ఇక బాగ్ లేదని నిర్ధారించుకున్నాం. బేలగా అక్కడి నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బయలుదేరాం. కార్లో కూచుని చెన్నై ఎయిర్ పోర్ట్ లో పనిచేసే ఒక మిత్రునికి ఫోన్ చేశాను. విషయం వివరించాను. హెల్ప్ అడిగాను. అటునుంచి సానుకూల స్పందన వచ్చింది. కొంత రిలాక్స్ అయి టెంపుల్ ఈస్ట్ గేట్ చేరుకున్నాం. అక్కడ సీఎం విజువల్స్ కొన్ని తీసుకున్నాం. లైవ్ మాట దేవుడెరుగు. కనీసం ఆఫీస్ కు ఫీడ్ పంపడానికి కూడా దిక్కులేకుండాపోయింది. ఈలోగా మా టెక్నీషియన్, ఎవరో లోకల్ ఛానల్ వాళ్ళను సంప్రదించి సీఎం టూర్ లైవ్ ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అక్కడి నుంచి కేరళ సీఎం నివాసం ఉండే క్లిఫ్ హౌజ్ వెళ్ళాం. నేను బాగ్ ఎలా వెనక్కి తెప్పించాలనే పనిలో ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాను. ఈలోపు మా కెమెరామెన్ పిలుపు.

అన్నా, ఫీడ్ వెళ్ళింది. నువ్వు వస్తే లైవ్ ఇద్దాం అన్నాడు నా కెమెరామెన్. ఉలిక్కి పడ్డాను. ఒక్కసారిగా ఉత్సాహం. వెంటనే పరిగెత్తాను. ఎలా? అని అడిగాను. స్థానిక మీడియాను అడిగాను. వాళ్ళు హెల్ప్ చేశారని చెప్పాడు. ఒకేఒక్క దూకుడు కెమెరా ముందుకు. 10 నిమిషాలు లైవ్ విత్ విజువల్స్. హమ్మయ్య కొంత ఊరట. ఆ తరవాత ఇద్దరు సీఎంల భేటీ. అది కూడా లైవ్ ఇచ్చేసాం. వచ్చిన పని పూర్తయింది. నిరర్థకం అనుకున్న టూర్ సార్థకమయింది. పొలిటికల్ టూర్ సక్సెస్. ఇక మిగిలింది, సీఎం గారి పర్సనల్ టూర్. మీరు హైదరాబాద్ వెళ్ళండి, మళ్లీ 13 వ తేదీ చెన్నై వచ్చేయండి అని పైనుంచి ఆదేశం. ఆమేరకు తిరుగు ప్రయాణం ఏర్పాట్లు మొదలుపెట్టాం. త్రివేండ్రం – హైదరాబాద్ ల మధ్య ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండటంతో ఒకరోజు అక్కడే ఉండాల్సి వచ్చింది. దాంతో లోకల్లో సైట్ సీయింగ్ ప్లాన్ చేశాం. మంగళవారం తెల్లవారుఝాము 3:30 గం.లకు శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవాలని నిర్ణయం చేశాం. ఆ తరవాత మధ్యాహ్నం కోవలం ఇంటర్ నేషనల్ బీచ్ వెళ్ళాలనుకున్నాం. ఈలోపు బుధవారం ఉ 9:30 కి టికెట్లు బుక్ అయ్యాయి. ఈసారి హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్. రెండు గంటలే జర్నీ. త్వరగా ఇల్లు చేరతాం అనుకున్నాం. గుళ్ళో దర్శనం చేసుకుని, బీచ్ లో కాస్త సరదాగా గడిపి, వచ్చేప్పటి ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను మరిచిపోవాలనుకున్నాం, కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని..

#మూడో_ఫ్లైట్లో_మరో_ముప్పు

నేను ముందు చెప్పినట్టుగానే మేం ఓ రెండు గంటల ముందే త్రివేండ్రం డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాం. బోర్డింగ్ పాసులు తీసుకుని చెక్ ఇన్ అయ్యాం. ఇంకా టైం ఉండటంతో అక్కడే బ్రేక్ ఫాస్ట్ ముగించాం. సరిగ్గా ఉ. 8:45 కు బోర్డింగ్ ప్రారంభమయ్యింది. ఫ్లైట్ లోకి చేరి మాకు అలాటయిన సీట్లకు చేరాం. విమానం కూడా సమయానికే రన్వే మీదుగా ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఎర్లీ వేక్ అప్ తో మళ్లీ కూర్పాట్లు మొదలయ్యాయి. గంట కునుకు తరవాత, మరో అరగంటలో లాండ్ అవుతామని పైలట్ ప్రకటన వెలువడింది. ఇంకేం, ఇక అయిపోయిందిలే లాండ్ అయి దిగిపోవడమే కదా అని అందరూ అనుకున్నారు. ఫ్లైట్ దిగుతున్న సంకేతంగా కొంచం ముందుకు జాలువారింది. ఎడమ రెక్కను కిందికి వంచి, విమానాన్ని కొంచం దించాలని పైలట్ ప్రయత్నం. అంతవరకు ఒకే. తరవాత కుడివైపు కూడా అలాగే దించాడు. ఇదీ ఒకే. సరే, ఇక నెమ్మదిగా ఫ్లైట్ కిందకు దిగుతుందిలే అనుకుంటున్న తరుణంలో డబడబ శబ్దంతో ఓ కుదుపు. అంతే లోపల ఒక్కసారిగా హాహాకారాలు. పరిస్థితి కొంచం అదుపులోకి వచ్చిందనుకుంటుండగా, ఒక్కసారిగా మరో కుదుపు. ఈసారి విమానం జారి ఆకాశం నుంచి కింద పడుతుందా అన్న ఫీలింగ్. ఒళ్లు జలదరించింది. గుండెలదిరిపోయాయి. అసలు క్షేమంగా దిగుతామా, ఇల్లు చేరుతామా అన్న అనుమానం మొదలైంది. పైలట్ నుంచి ఎలాంటి ప్రమాద ప్రకటనా లేదు. కొన్ని కుదుపులు, డబడబ శబ్దాలతో ఎట్టకేలకు ఫ్లైట్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంత్జాతీయ విమానాశ్రయం రన్వేపై దిగింది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. దిగేముందు నెమ్మదిగా ఎయిర్ హోస్టెస్ ను అడిగాను. లాండింగ్ అంత ట్రబుల్ అవడానికి కారణమేంటి అని. అందుకు బదులుగా, ముందు ఆమె, నేను ఉటంకించిన సాంకేతిక కారణాలను తోసిపుచ్చింది. క్లౌడ్స్, బ్యాడ్ వెదర్ కండిషన్స్ ట్రబుల్ లాండింగ్ కు అసలు కారణాలని వెల్లడించింది. దడదడమంటూ గుండెలదురుతుంటే విమానం దిగి కన్వేయర్ బెల్ట్ మీదుగా లగేజీ పికప్ చేసి, అటు నుంచి అటే అరైవల్స్ ఎగ్జిట్ ద్వారా ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చేసాం. మధ్యలో మరోసారి కెమెరా స్టాండ్ లగేజీ మిస్సయినా ఇండిగో సిబ్బంది వెంటనే దాన్ని తెచ్చి చేతికందించారు. అక్కడి నుంచి మేం ఔటర్ రింగ్ రోడ్ మీదుగా నిజాంపేట్ మూవ్ అయ్యాం.

#కొసమెరుపు

నా జర్నలిజం కెరీర్లో అనేక టూర్లు చేశాను. లెక్కలేనన్ని సార్లు విమాన ప్రయాణాలూ చేశాను. కానీ, ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవడం మాత్రం ఇదే మొదలు. ట్రిప్ ఆద్యంతం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగింది. అసలు ఇలా ఔట్ డోర్ కవరేజీ టూర్లు సక్సెస్ చేయడానికి నేను ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటాను. కానీ ఈ ట్రిప్ లో చోటు చేసుకున్న పరిణామాలు నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. ఒక్కో టైం ఒక్కోలా ఉంటుంది. ఏది ఏమైనా అప్పజెప్పిన టాస్క్ పూర్తిచేసి, నాకు, నా టీంకు, మా ద్వారా మా పైవాళ్లకు అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడ్డాం. మళ్ళా ఈ అనుభవాలు ఎదురవద్దు అని మనసులో అనుకుంటూ ఇల్లు చేరాను.

About The Author