ఆవకాయ బిర్యాని అలియాస్ తొక్కన్నం…


పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి….

అమ్మా, ఆవకాయ్ ఎన్నటికీ బోర్ కొట్టవు. వేడివేడన్నం, మామిడికాయ తొక్కు, ఇంత నెయ్యి అననుకుంటుంటారు జనం. కానీ, అరచేతినిండా పల్లినూనె వేసి తొక్కన్నంలో కలిపి ఆరగిస్తే ఉంటుందీ.. అబ్బో ఆ మజాయే వేరు. గరీబోడి నుంచి అమీరోళ్ళ దాకా ఎంతటోళ్లైనా లొట్టలేస్తూ వాయిలకు వాయిలు రఫ్ఫాడించాల్సిందే. ఇక దానికింత ముద్దపప్పద్ది కలిపితే, నా సామిరంగా ఉంటుందీ, ఆహా.. ఆ టేస్టే వేరు. కిక్కు నషాళానికెక్కుతుంది. జిహ్వ మహదానందం పొందుతుంది. అద్భుతమైన ఆ మిశ్రమాన్ని ఆస్వాదిస్తూ నాలుక మన మదిని స్వర్గపుటంచులకు చేరుస్తుంది. అందుకే అంటారు పుర్రెకో బుద్ధీ, జిహ్వకో రుచని.

ఈమధ్య మన ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల పొలిటికల్ టూర్లకు వెళ్లారు. ఆ కవరేజీకి మేము కూడా వెళ్ళాం. రెండూ మన దక్షిణాది రాష్ట్రాలే. కానీ, అక్కడి ఆహారపుటలవాట్లు మాత్రం కొంత భిన్నం. కేరళ వంటకాలు పూర్తిగా కొబ్బరినూనె మయం. తినేది స్టీమ్డ్ బాయిల్డ్ రైస్. వామ్మో నకనకలాడే ఆకలి మీద సైతం, ముద్ద దిగడం గగనమే. ఇక తమిళనాడులో కూడా దాదాపు సేమ్ టు సేమ్ పరిస్థితి. సాంబార్ వడా, ఇడ్లీ చట్నీలు మినహా వాళ్ళ వంటకాలు కూడా మన నోటికి ఆనవుగాక ఆనవు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నమైన ఆహారపుటలవాట్లు ఉండటం సర్వసాధారణమే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ వాటితో మన కడుపు నింపుకోవడమే అత్యంత దుఖభరితం. ఐనప్పటికీ, కేరళలో దొరికిందే తిన్నాం. ఇక లాభం లేదని చెన్నైలో మాత్రం డెలీషియస్ ఫుడ్ కోసం వెతికాం. అందుబాటులో ఉన్న యాప్ లన్నీ సర్చ్ చేశాం. వెతకగా వెతకగా, ఆవకాయ్ బిర్యానీ అనే ఒక ఐటం దొరికింది. సరే, వెరైటీగా ఉంది కదా, ఓసారి తిని చూద్దామనుకున్నాం. అక్కడే దెబ్బ పడింది. ఉత్త తొక్కన్నం పెట్టి ₹ 268 లు దొబ్బేశారు. ప్రాణం ఉసూరుమంది. బాబోయ్, ఆవకాయ్ బిర్యానీ, ఎంత పనిచేసింది. ఏ పనిలేని వెధవ, మరే ముహూర్తాన దానికి ఆవకాయ బిర్యానీ అని నామకరణం చేశాడో తెలియదు కానీ, మరో అంట్ల వెధవ, ఆ పేరిట ఏకంగా ఓ సినిమానే తీసాడు. సినిమా రంగం వాళ్ళు ఆవకాయ బిర్యానీ అని పేరు పెట్టి, అమాంతంగా దాన్ని విశేష ప్రాచుర్యంలోకి కూడా తెచ్చేశారంటే, మామూలు పైత్యమా అది!

ఇండియాలో బిర్యానీది ఒక ప్రత్యేక స్థానం. మొగలాయి, హైదరాబాదీ బిర్యానీల్లాంటి నోరూరించే రకాల్లో నాన్ వెజ్ వెరైటీలే పాపులర్. ఎగ్, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్, కల్యాణీ ఇలా ఒకటేమిటి నానా రకాలు బిర్యానీలు హోటళ్లలో అందుబాటులో ఉంటాయి. ఐతే వాటిని వండివార్చే పద్దతుల్లో మాత్రం తేడాలున్నాయి. మొగలాయి బిర్యానీని వండి వడ్డించే పద్దతి ఒకటైతే, హైదరాబాదీ బిర్యానీది మరోరకం. దీన్నే దమ్ బిర్యాని అని కూడా అంటుంటారు. అప్పట్లో నిజాం రాజుల పాకశాలల్లో అత్యంత రుచికరమైన మశాల వంటకంగా బిర్యానీ పురుడుపోసుకున్నది. ఆ తరవాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆ బిర్యానీని తమ వంటశాలల్లోకి తీసుకొచ్చాడని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి మొగలాయి రకం బిర్యానీ మార్కెట్లోకి వచ్చింది.

అలా పుట్టిన హైదరాబాదీ బిర్యానీ
ఇవాళ ప్రపంచంలోని అత్యంత పాపులర్ రెసిపీల్లో ఒకటి. వివిధ నగరాల్లోని పెద్దపెద్ద స్టార్ హోటళ్లు సైతం, ఇచ్చట హైదరాబాదీ బిర్యానీ లభించును అని డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తుంటాయి. తద్వారా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయంటే, హైదరాబాదీ బిర్యానీకున్న ప్రత్యేకత, పాపులారిటీ ఏపాటిదో వేరే చెప్పనక్కరలేదు. ఇక హోటళ్లలో షెఫ్ లు సైతం వివిధ రకాల బిర్యానీలను అత్యంత రుచికరంగా వండి కస్టమర్లకు వడ్డించడంలో ప్రత్యేక శ్రద్ద చూపుతుంటారు. అలా మన ఇండియాలో బిర్యానీది ఒక చరిత్ర.

ఇక ఇది ఆవకాయ్ బిర్యానీ కథ. మనం అచ్చంగా మార్కెట్ ఎకానమీలో ఉన్నామనడానికి ఈ ఆవకాయ్ బిర్యానియే ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎక్కడ, ఎలా, ఎందుకు పుట్టిందో తెలియదు, కానీ ఆవకాయ్ అనే పదం మాత్రం ఆంధ్రా మార్క్ పదం. కనక ఆ బిర్యానీ సృష్టికర్తలు కూడా వాళ్ళే అనేది ఓ థియరీ. ఆంధ్రాలో సాధారణంగా బిర్యానీ దొరకదు. దాన్ని వండటం కూడా వాళ్లకు రాదు. బదులుగా ఆ ప్లేస్ లో రకరకాల వెజ్, నాన్ వెజ్ పులావ్ లు మాత్రం అక్కడ పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. హైదరాబాదీలకు ఉండి, బహుశా తమకు అందుబాటులో లేని, ఆ వంటకమేదో మాకూ ఉండాలనే పోటీ కోసమో, లేక బిర్యానీ అంటే ఖరీదైన వంటకం, అంత ధరలు భరించి, వాటిని మేం తినలేమనో, అదీ కాకపోతే, వెజిటేరియన్ల జిహ్వ చాపల్యాన్ని తృప్తి పరచడం కోసమో ఈ కామన్ మ్యాన్ బిర్యానీ సృష్టించారనేది మరోస్టోరీ. ఏది ఏమైనా అది కామన్ మ్యాన్ బిర్యానీ అనడానికి మాత్రం లేదు. ఆ విషయం దాని రేట్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆవకాయ్ బిర్యానీల ధర ఆకాశంలో విహరిస్తూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తుందన్న విషయం ఒకసారి ఆర్డర్ చేస్తే కానీ మనకు బోధపడదు.

అసలు ఏంటి ఈ ఆవకాయ్ బిర్యాని ప్రత్యేకత. దాన్ని ఎలా తయారు చేస్తారు. దానికోసం ప్రత్యేక తయారీ విధానం ఏమైనా ఉందా? అంటే, అంతా తుస్సే. ఆ బిర్యానీ తయారీకి ఓ విధానమూ లేదు పాడూలేదు. ఇంకా చెప్పాలంటే ఉత్త తొక్కన్నం. అచ్ఛ తెలంగాణా భాషలో మామిడికాయ తొక్కన్నం అన్నమాట. అన్నంలో ఇంత మామిడికాయ తొక్కు కలిపి తింటే ఆ కిక్కే వేరు. ఆపాటి దానికి ఆవకాయ బిర్యానీ అని పేరు. చికెన్, మటన్ ముక్కలకు బదులుగా బిర్యానీ అనబడే ఈ తొక్కన్నంలో మామిడిచెక్కలు దండిగా దట్టిస్తారన్నట్టు. ఇక దాని ధర అత్యంత ప్రియం. ఇంతోటిదానికి హోటళ్ళు, యాప్ లు ఇచ్చే కలర్ అంతా ఇంతా కాదు. ఆ బాక్స్ లు, వాటి ప్యాకింగ్, ఇతరత్రా హంగామా చూస్తే, దిమ్మ తిరగడం ఖాయం. ఈ బిల్డప్ చూస్తే, మినిమం ఓ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసి, ఆ బిర్యానీకి కార్పొరేట్ హంగులు అద్ది, హోటళ్ళ యాజమాన్యాలు బహుశా పేటెంట్ హక్కులు కూడా పొందుతాయేమో అనే అనుమానం ఎవరికైనా కలగకమానదు. ఒక్క ఆవకాయనే కాదండోయ్ ఈమధ్య కాకరకాయ, బెండకాయ, వంకాయ ఎట్సెట్రా ఎట్సెట్రా బిర్యానీలు కూడా మార్కెట్లోకి వచ్చేశాయట. మరి వాటికెంత బాదుతారో, ఏమో!

అంతా మార్కెట్ మాయాజాలం, ప్లస్ ఆవకాయ్ బిర్యానీ అలియాస్ తొక్కన్నం తడాఖా!

About The Author