కరెంటు అవసరం లేని ఫ్రిజ్‌ను తయారు చేశాడు…

పదవ తరగతి ఫెయిల్ అయిన ఆ వ్యక్తి…కరెంటు అవసరం లేని ఫ్రిజ్‌ను తయారు చేశాడు……

నైపుణ్యం, సృజన ఉండాలే గానీ
ఎలాంటి నూతన వస్తువునైనా
ఎవరైనా సులభంగా ఆవిష్కరించవచ్చని నిరూపించాడు ఆ వ్యక్తి.
హై స్కూల్ మధ్యలో మానేసినా, తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన సాంప్రదాయ వృత్తిని నమ్ముకుని అందులో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. నేడు ఒక కంపెనీకి యజమాని అయి లక్షల టర్నోవర్‌తో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
తన లాంటి మరికొంత మందికి ఉద్యోగాన్ని కల్పించాడు.
వివరాల్లోకి వెళితే…

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ ప్రాంతంలో వాంకనర్ అనే చిన్నపాటి టౌన్‌లో నివాసం ఉండే మన్సూఖ్‌భాయ్ ప్రజాపతిది పేద కుటుంబం.
తన చిన్నప్పటి నుంచి వారి ఆర్థిక స్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు.
కాగా చదువుల్లో 9వ తరగతి దాకా వచ్చినా 10వ తరగతి పరీక్షల్లో మాత్రం మన్సూఖ్‌భాయ్ ఫెయిల్ అయ్యాడు.
ఈ నేపథ్యంలోనే ఏదైనా చిన్నపాటి పని చేసి జీవనం కొనసాగించాలని నిర్ణయించుకుని ముందుగా ఓ బ్రిక్ ఫ్యాక్టరీలో కూలీగా చేరాడు.
అక్కడికి సమీపంలోనే హైవేపై ఓ టీ షాప్ కూడా ఏర్పాటు చేశాడు.
అయితే 1985లో జగదంబా పాటరీస్ అనే పరిశ్రమలో ట్రెయినీగా ఉద్యోగం సాధించాడు.
అనంతరం 3 ఏళ్లు అందులో పనిచేశాడు. ఆ సమయంలోనే కుండలు తయారు చేయడంలో నూతన మెళకువలు, టిప్స్‌ను అతను అక్కడ నేర్చుకున్నాడు. అయితే ఆ మెళకువలే అతన్ని సొంత పరిశ్రమ ఏర్పాటు చేసుకునేలా చేశాయి…
1988 తరువాత జగదంబా పాటరీస్‌లో తన ఉద్యోగాన్ని వదిలి ఓ చిన్నపాటి పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రారంభించాడు.
అనుకున్నదే తడవుగా వెంటనే ఓ మట్టి ప్లేట్ తయారీ పరిశ్రమను చిన్నగా ప్రారంభించాడు.
అందులో రోజుకి ఒక వ్యక్తి 100 ప్లేట్ల వరకు తయారు చేయవచ్చు.
అయితే అది అతనికి సంతృప్తినివ్వలేదు. రూ.30వేలను అప్పుగా తెచ్చి ప్లేట్ల తయారీ కోసం ఉపయోగించే యంత్రాలను పూర్తిగా మార్చేశాడు.
దీని వల్ల రోజుకు ఒక వ్యక్తి 700 వరకు ప్లేట్లను తయారు చేయడానికి వీలు కలిగేది.
కాగా ఇదిలా కొనసాగుతుండగానే 1990లో తన పరిశ్రమకు మన్సూఖ్‌భాయ్ రాఘవ్‌భాయ్ ప్రజాపతి అని నామకరణం చేశాడు.
అయితే 1995వ సంవత్సరంలో
అతనికి టర్నింగ్ పాయింట్ లభించింది.

రాజ్‌కోట్‌కు చెందిన చిరాగ్‌భాయ్ పటేల్ అనే వ్యాపార వేత్త మట్టితో తయారు చేసిన వాటర్ ఫిల్టర్లను అమ్మే విక్రయదారుల కోసం చూడసాగాడు.
అదే సమయంలో మన్సూఖ్‌భాయ్ తన టెర్రాకోట ఫిల్టర్‌ను చిరాగ్‌భాయ్ పటేల్‌కు చూపించగా అది అతన్ని అమితంగా ఆకట్టుకుంది.
దీంతో వెంటనే రూ.1లక్ష విలువ గల
500 ఫిల్టర్లకు చిరాగ్‌భాయ్ పటేల్ ఆర్డరిచ్చేశాడు.
కాగా అప్పటి నుంచి నేటి వరకు మన్సూఖ్‌భాయ్ వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతూనే ఉంది.
అయితే 2001లో వచ్చిన భూకంపం కారణంగా అతని పరిశ్రమలో తయారైన మట్టి పాత్రలు అనేకం నాశనమయ్యాయి. అయితే ఈ విషయంపై అప్పట్లో ఓ స్థానిక పత్రిక కథనం ప్రచురించగా, దాన్ని చదివిన మన్సూఖ్‌భాయ్‌కి మరో ఆలోచన వచ్చింది.
అయితే ఆ ఆలోచన కార్యరూపంలోకి వచ్చే సరికి మరో ఏడాది పట్టింది. 2002లో ఎట్టకేలకు కరెంట్ అవసరం లేని మట్టి ఫ్రిజ్‌ను రూపొందించే పనిలో పడ్డాడు.
ఈ నేపథ్యంలోనే అతనికి కొంత డబ్బు కూడా అవసరమైంది.
అయితే తన తండ్రి ద్వారా వచ్చిన ఇంటిని తాకట్టుపెట్టి కొంత,మరికొంత సొమ్మును బ్యాంక్ లోన్‌గా తీసుకుని తాను అనుకున్న పనికి రూపం ఇచ్చేందుకు ప్రయత్నం ప్రారంభించాడు. చివరికి 3 ఏళ్ల తరువాత 2005లో కరెంట్ అవసరం లేని మిట్టికూల్ ఫ్రిజ్‌ను అతను తయారు చేశాడు.
దీనికి ఉండే ప్రత్యేక పాయింట్లలో నీటిని పోస్తే చాలు ఆ నీరు ఆవిరిగా మారి ఫ్రిజ్‌కు చల్లదనాన్నిస్తుంది.
ఇది కేవలం రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య ధర కలిగి ఉంటుంది. ఇందులో ఉంచిన పదార్థాలు ఏవైనా సాధారణ ఫ్రిజ్‌లోలాగే 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చల్లగా ఉండడం గమనార్హం.
ఆ పదార్థాలు 4 నుంచి 5 రోజుల పాటు తాజాగా ఉంటాయి.
మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద వారికి అందుబాటులో ఉండే విధంగా అత్యంత తక్కువ ఖర్చుతో ఈ ఫ్రిజ్‌ను మన్సూఖ్‌భాయ్ రూపొందించాడు.
కాగా 2006లో ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన ప్రొఫెసర్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ అనిల్ కె గుప్తా మన్సూఖ్‌భాయ్‌కు రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించాడు.
ఇది మన్సూఖ్‌భాయ్ తన అప్పులను తీర్చుకునేందుకు ఉపయోగపడింది.
ఒక సంవత్సరం తరువాత మిట్టి కూల్ క్లే క్రియేషన్స్ పేరిట తన సొంత సంస్థను అతను ఏర్పాటు చేశాడు.
అప్పటి నుంచి మిట్టికూల్ ఫ్రిజ్‌తోపాటు మట్టితో తయారుచేసిన ప్రెషర్ కుక్కర్లు, వంట పాత్రలు తదితరాలను కూడా అమ్మడం ప్రారంభించి నేడు ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగాడు.
ఇప్పుడతని కంపెనీలో 35 మంది పనిచేస్తుండగా దాని టర్నోవర్ రూ.45 లక్షలుగా ఉంది.
కేవలం మన దగ్గరే కాదు, మన్సూఖ్‌భాయ్ తన పరిశ్రమలో తయారు చేసిన ఉత్పత్తులను ఆఫ్రికా, దుబాయ్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాడు.
నిజంగా ఆలోచన, సృజన ఉండాలే కానీ ఎలాంటి వారైనా అద్భుతాలు చేయవచ్చని మన్సూఖ్‌భాయ్ నిరూపించాడు.

About The Author