రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి…


IRCTC:
ఐఆర్‌సీటీసీలో కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ, వికల్ప్ స్కీమ్, ఆటో అప్‌గ్రేడేషన్ అనే ఫీచర్లున్నాయి. ఈ మూడు ఫీచర్లను ట్రై చేశారంటే మీ టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి

టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? రైలు టికెట్ బుక్ చేసుకుంటున్నారా? రైలు టికెట్ బుక్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వెయిటింగ్ లిస్ట్ టెన్షన్ ఉండదు. టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. టికెట్ బుకింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, నియమనిబంధనల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామందికి టికెట్లు కన్ఫామ్ కావు. అందుకే రైల్వే నిబంధనలతో పాటు ఫీచర్లు కూడా తెలుసుకోవాలి. రైలు టికెట్ బుక్ చేసే ప్రయాణికులకు అనే ఫీచర్లను అందిస్తుంది ఐఆర్‌సీటీసీ. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని ట్రైన్ టికెట్ బుక్ చేస్తే టికెట్ సులువుగా కన్ఫామ్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీలో కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ, వికల్ప్ స్కీమ్, ఆటో అప్‌గ్రేడేషన్ అనే ఫీచర్లున్నాయి. ఈ మూడు ఫీచర్లను ట్రై చేశారంటే మీ టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మరి ఆ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో, బుకింగ్ సమయంలో వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి.

*CNF Probability:* ఈ ఫీచర్‌నే కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ అంటారు. మీరు రైలు టికెట్ బుక్ చేయడానికి ముందే ఈ ఫీచర్ ద్వారా మీకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలంటే బెర్త్‌లు ఖాళీగా ఉంటే టికెట్లు కన్ఫామ్ అయిపోతాయి. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే టికెట్ కన్ఫామ్ అవుతుందో లేదో అన్న సందేహాలుంటాయి. ఈ సందేహం తీర్చేందుకే ‘కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ’ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. వెయిటింగ్ లిస్ట్‌ చూపించినట్టైతే మీరు CNF Probability పైన క్లిక్ చేస్తే మీకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుస్తుంది. టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు 30 శాతం కన్నా తక్కువ ఉన్నట్టైతే టికెట్ బుక్ చేయకపోవడమే మంచిది. వేరే ట్రైన్‌ ట్రై చేయొచ్చు.

*Auto Upgradation Scheme:* స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకొని అదే టికెట్‌తో థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తే అంతకన్నా ఏం కావాలి. ఈ అవకాశం కల్పిస్తోంది ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్. మీరు బుక్ చేసుకున్న టికెట్ చార్ట్ ప్రిపేర్ చేసేవరకు వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే ఇక మీకు టికెట్ దొరకదు. అదే ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకున్నారంటే అదే రైలులో మీరు ఎంచుకున్న క్లాస్ కన్నా ఎక్కువ క్లాస్‌లో ఖాళీ బెర్త్‌లు ఉంటే మీకు ఆ బెర్త్ కేటాయిస్తారు. ఉదాహరణకు మీరు స్లీపర్ క్లాస్‌లో టికెట్ బుక్ చేసుకుంటే, స్లీపర్ బెర్తులన్నీ నిండిపోయి, థర్డ్ ఏసీలో బెర్తులు ఖాళీగా ఉంటే మీకు థర్డ్ ఏసీ టికెట్ కేటాయిస్తారు. ఇలా స్లీపర్ క్లాస్ నుంచి థర్డ్ ఏసీకి, థర్డ్ ఏసీ నుంచి సెకండ్ ఏసీకి టికెట్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అప్‌గ్రేడ్ చేసి మీకు బెర్త్ కేటాయించినందుకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరమే లేదు. అయితే మీరు ముందుగానే ఆటో అప్‌గ్రేడేషన్ ఎంచుకుంటేనే ఇది వర్తిస్తుంది. కన్సెషన్ టికెట్, ఫ్రీ పాస్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్లకు ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ వర్తించదు.

*VIKALP scheme:* మీరు బుక్ చేసుకున్న రైలులో చార్ట్ ప్రిపేర్ చేసేవరకు మీ నెంబర్ వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉంటే మీకు ఇక టికెట్ లభించనట్టే. అయితే మీరు వికల్ప్ స్కీమ్ ఎంచుకుంటే ఆ తర్వాతి రైళ్లల్లో అదే టికెట్‌పై ప్రయాణించే అవకాశం లభిస్తుంది. రైళ్లు, క్లాసులు, కన్సెషన్‌ అన్న సంబంధం లేకుండా వికల్ప్ స్కీమ్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అన్ని టికెట్లకూ వర్తిస్తుంది. వికల్ప్ స్కీమ్ ఎంచుకుంటే మీరు బుక్ చేసుకున్న రైలులో టికెట్లు లేకపోతే ఆ తర్వాత అదే రూట్లలో వెళ్లే రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటే టికెట్ కన్ఫామ్ అవుతుంది. వికల్ప్ స్కీమ్ ద్వారా టికెట్ పక్కాగా లభిస్తుందన్న గ్యారెంటీ లేకపోయినా తర్వాతి రైళ్లల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా టికెట్ దొరకచ్చు. మీరు బుక్ చేసుకున్న రైలు బయల్దేరే సమయం తర్వాత 30 నిమిషాల నుంచి 72 గంటల మధ్య ఉండే ప్రత్యామ్నాయ రైళ్లకు మాత్రమే వికల్ప్ స్కీమ్ వర్తిస్తుంది. మీరు గరిష్టంగా ఏడు రైళ్లను వికల్ప్ స్కీమ్‌లో ఎంచుకోవచ్చు.
నిజం న్యూస్ , ప్రతినిధి అమరావతి

About The Author