వారధి కట్టిన రాముడు…

ఎవరో రావాలని, ఏదో చేయాలని అనుకోలేదాయన. నేనెందుకు చేయకూడదని సంకల్పించుకున్నాడు. నలుగురినీ తన వెంట నడిచేలా చేశాడు. అందుబాటులో ఉన్న వనరులతో వారధి నిర్మించి ఔరా! అనిపించుకున్నాడు.
ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం మణియపూర్‌ గ్రామవాసి కడు గంగారాం. ఊరి పొలిమేరలోనే పదెకరాల పొలం ఉంది. వాగు పక్కనున్న చేలు. నీటి వనరులున్న నేల కావడంతో బంగారం పండుతుంది. కనుచూపుమేరలో ఉన్న పొలానికి వెళ్లాలన్నా.. వెంటనే సాధ్యమయ్యేది కాదు. ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే. మధ్యలో వాగు అడ్డుగా ఉండటంతో చుట్టూ తిరిగి చేలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్య గంగారాం ఒక్కడిదే కాదు.. వాగుకు ఆవలి ఒడ్డునున్న రైతులందరిదీ.
వర్షాకాలం వచ్చిందంటే వాగులో ఆరునెలల పాటు నీరు ప్రవహిస్తుంటుంది. చెంతనే పెన్‌గంగా ఉండటంతో.. బ్యాక్‌వాటర్‌ వచ్చి వాగులో చేరుతుంటుంది. ఫలితంగా.. వాగు దాటడం కష్టంగా మారుతుంది. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే.. పక్క గ్రామంలో నుంచి వెళ్లాల్సి వచ్చేది. రహదారి సౌకర్యం లేకపోవడంతో.. బురదలో దిగబడుతూ ఇబ్బందులు పడేవారు. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను ఏడు పదుల వయసున్న గంగారాం పరిష్కరించాడు. దూరాభారాన్ని తగ్గించడానికి వాగుపై వారధి నిర్మించాలనుకున్నాడు.

తోటి రైతుల సాయంతో రంగంలోకి దిగాడు గంగారాం. వంతెన నిర్మించడానికి అందుబాటులో ఉన్న వనరులు సేకరించారు. వృథాగా ఉన్న విద్యుత్‌ తీగలను కొనుగోలు చేశారు. సిమెంట్‌ స్తంభాలు, ఇనుప రాడ్లు, దృఢమైన కర్రలు, ఇనుప రేకులను తీసుకున్నారు. తొలుత వంద మీటర్ల వెడల్పున్న వాగుకు ఇరువైపులా పిల్లర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ తీగలను లాగారు. తీగలకు ఆసరాగా వాగులో కర్రలతో, ఇనుప స్తంభాలతో పిల్లర్లు ఏర్పాటు చేశారు. చివరగా పిల్లర్ల మధ్య తీగలు లాగి.. వాటిపై రేకులను పరిచారు. ఈ వారధి కట్టి పుష్కర కాలం దాటిపోయింది. 2006లో నిర్మించిన వంతెన.. ఇన్నేళ్లలో ఎన్ని వరదలు వచ్చినా తట్టుకొని నిలబడింది. ఎందరో రైతులకు పొలం బాటయింది. ‘ఈ రాముడే పూనుకోకపోతే.. మా కష్టాలు నేటికీ తీరేవి కావ’ని అంటారు కడు గ్రామ రైతులు.

From : News Paper

About The Author