శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగాయి. అయిన కోట్లు సంపాదిస్తున్నాడు…
ఆ బాలుడి శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగాయి. అయినప్పటికీ పాటలు పాడుతూ కోట్లు సంపాదిస్తున్నాడు తెలుసా..?
ఒక చిన్న గీత గీయండి. దాన్ని మీకు వచ్చిన కష్టం అనుకోండి. దానిపై కొంచెం పెద్ద గీత గీయండి. అది వేరే వారి కష్టం అనుకోండి. ఇప్పుడు మళ్లీ చూడండి. ఏమనిపిస్తుంది..? ఎదుటి వారి కష్టంతో పోలిస్తే మీ కష్టం చిన్నదైపోయింది కదా. అవును, అదే. అలాగే అనుకోవాలి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, సమస్యలు దాటుతూ ముందుకు సాగాలి. అంతేగానీ అధైర్య పడకూడదు. ఎలాంటి క్లిష్టతర పరిస్థితులు ఎదురైనా లక్ష్య సాధన దిశగా ముందుకే సాగాలి తప్ప వెనుకడుగు వేయకూడదు.
ఇలా అనుకున్నాడు కాబట్టే ఆ బాలుడు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఓ వైపు అష్ట కష్టాలు పెడుతున్న అనారోగ్యం, మరో వైపు కుర్చీలో నుంచి కదలలేని స్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇబ్బంది పెట్టే వ్యాధి. అయినప్పటికీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఓ వైపు కోట్లాది రూపాయలను సంపాదిస్తూనే మరో వైపు తన అనారోగ్యానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అతని గురించి తెలిస్తే ఎవరైనా అయ్యో అనక మానరు.
అతని పేరు స్పార్ష్ షా. వయస్సు 13 సంవత్సరాలు. ఉంటున్నది అమెరికాలోని న్యూజెర్సీలో. భారత సంతతికి చెందిన బాలుడు ఇతను. అయితే ఈ బాలుడికి పుట్టుకతోనే ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే వ్యాధి వచ్చింది. దీంతో ఈ బాలుడు పుట్టడమే 35 చోట్ల ఎముకలు విరిగిపోయి పుట్టాడు. ఆ తరువాత కూడా ఎముకలు విరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అతని శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఇక భవిష్యత్తులో ఎన్ని చోట్ల ఎముకలు విరుగుతాయో తెలియదు. అందుకు కారణం, అతనికి ఉన్న ఆ వ్యాధి. దీంతో ఆ బాలుడు వీల్ చెయిర్‌కే పరిమితం అయ్యాడు. అయితేనేం సంగీతం నేర్చుకున్నాడు. అద్భుతంగా పాటలు పాడుతున్నాడు.
నాట్ అఫ్రైడ్ పేరిట 2016 జనవరిలో స్పార్ష్ షా ఓ వీడియో సాంగ్స్ ఆల్బమ్‌ను విడుదల చేశాడు. దీంతో ఆ ఆల్బమ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ఆదరణ లభించింది. దాదాపుగా 6 కోట్ల మంది ఆ ఆల్బంను చూశారు. సోషల్ మీడియాలో ఇతని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ బాలుడు ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.
అనేక మంది కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. మరో వైపు పాటలు పాడడం ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. అలా సంపాదించిన డబ్బును తన వైద్యం కోసం వాడుతున్నాడు. కాగా ఇతను రాగా ర్యాప్ పేరిట మరో కొత్త ఆల్బంను విడుదల చేయగా అది కూడా పాపులర్ అయింది. దీంతో లైవ్ షోలు చేయడం మొదలు పెట్టాడు.
గత డిసెంబర్ నెలలో ముంబయికి వచ్చి ఓ టీవీ టాక్ షోలో పాల్గొన్న ఈ బాలుడు… ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. కాకపోతే అది సాధించేందుకు కావాల్సినంత తపన, సాధన ఉండాలి. వెరీ సింపుల్‌గా సాధించవచ్చు. 11 అక్షరాలతో ఉండే కొన్ని సంక్లిష్ట ఆంగ్ల పద బంధాలను చదివినప్పుడు అమ్మో, వాటిని గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో అనుకున్నాను. ఆ మాటకొస్తే నా ఆరోగ్య పరిస్థితి క్లిష్టమైనది కాదా? అనుకున్నా. ఆ తర్వాత ఆ పద పంధాలన్నీ నాకు చాలా సులభమైనవి అనిపించాయి… అంటూ నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మాట్లాడాడు.
తనకు గ్రామీ అవార్డులు అక్కర్లేదని, తన పాటను ప్రపంచంలో ప్రతి ఒక్కరు వినాలన్నది తన ఆశ అని అన్నాడు. కనీసం వంద కోట్ల మంది ప్రేక్షకుల ముందు ఓ సారి ప్రదర్శన ఇవ్వాలన్నది అతని కోరిక అని చెప్పాడు. ఏదో ఒక రోజు ఆ కోరికను సాధిస్తానన్న సంపూర్ణ విశ్వాసంతోనే ముందుకు పోతున్నానని ఆ బాలుడు చెప్పాడు. కాగా స్పార్ష్ షా తన పేరును ప్యూరిథమ్ గా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా..? ప్యూర్ ప్లస్ రిథమ్ అనే రెండు పదాలను కలిపి ఆ పేరు పెట్టుకున్నాడు. ఇక అతని కల నెరవేరాలని మనమూ ఆశిద్దాం.