రాగి, కొర్ర, సజ్జల సాగులో మెళకువలు…

చిరుధాన్యాలకు ఇదే అదను
రాగి, కొర్ర, సజ్జల సాగులో మెళకువలు

పోషకాల గనులైన చిరుధాన్యాలకు మంచి డిమాండ్‌ ఉండటంతో వాటి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. చిరుధాన్యాలను ఎలా సాగు చేయాలి? ఎలాంటి పంట ప్రణాళిక అనుసరిస్తే అధిక దిగుబడులు వస్తాయో సూచిస్తున్నారు పాలెం
ప్రాంతీయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు.

నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గిపోతున్న వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలో నిర్ణయించుకోవాలి. తగ్గిపోతున్న జలవనరుల దృష్యా తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో తక్కువ నీటితో పండించగలిగే పంటలు సాగు చేసుకోవడం తక్షణావసరం. చిరుధాన్యాలు అంటే సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, నరిగలు, అరికలు, అండు కొర్రలు తక్కువ నీటితో సాగు చేసే వీలుంది. చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉండటంతో వీటికి నానాటికీ ఆదరణ పెరుగుతోంది. చిరుధాన్యాల్లో బీ17 విటమిన్‌ అధికంగా వున్న కారణంగా క్యాన్సర్‌ వంటి వ్యాధులను నిరోధించవచ్చు. పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉండటం మూలంగా వీటిని తింటే ఊబకాయం తగ్గుతుంది. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ 55 శాతం కన్నా తక్కువ ఉండటం వల్ల చక్కెర సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చు. రాగులలో అధిక కాల్షియం వుంది కాబట్టి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులను నివారించవచ్చు. అండుకొర్రల్లో 12.5 శాతం పీచు పదార్థం ఉండగా మిగిలిన చిరుధాన్యాల్లో 8 నుంచి 10 శాతం వరకు పీచు పదార్థాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చిరుధాన్యాల సాగు వల్ల రైతులకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. నీటి లభ్యత తక్కువగా వున్న ప్రాంతాల్లో కూడా చిరుధాన్యాలను సాగు చేయవచ్చు. 300 నుంచి 400 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కూడా చిరుధాన్యాలు మంచి దిగుబడిని ఇస్తాయి. అలాగే సాగు వ్యవధి తక్కువ. చిరుధాన్యాలకు చీడపీడలు ఆశించడం కూడా తక్కువే కాబట్టి రైతులకు సాగు ఖర్చులు తగ్గుతాయి. పంటను నిల్వ చేసుకోవడం కూడా తేలిక. చిరుధాన్యాలు కోసిన తరువాత ఆ గడ్డి పశువులకు మంచి పౌష్టికాహారంగా కూడా ఉపయోగపడుతుంది.

• ఏ వంగడాలు ఉత్తమం?
* సజ్జ: పీహెచ్‌బీ-3, పీహెచ్‌బీ-67, ఐసీఎంహెచ్‌-356, ఐసీటీపీ-8203 రకాలు 80 నుంచి 85 రోజుల్లో కోతకు వచ్చి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
* రాగులు: భారతి, శ్రీచైతన్య, వకుళ, మారుతి వంటి రకాలు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి ఎకరానికి వస్తుంది. వీటి పంట కాలం 105 నుంచి 120 రోజులు. ఇందులో మారుతి స్వల్పకాలిక రకం. ఇది 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది.
* కొర్రలు: సూర్యనంది, ఎస్‌ఐఏ-3156, ఎస్‌ఐఏ-3085 రకాలు 80 నుంచి 90 రోజుల్లోనే కోతకు వచ్చి, ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి రాబట్టవచ్చు.
 సాగుబడికి మంచి సమయం
సాధారణంగా చిరుధాన్యాలను జూలై ఆఖరు వరకు విత్తుకోవచ్చు. సజ్జ మాత్రం జూలై 15లోపే విత్తుకోవాలి. విత్తన మోతాదు ఎకరానికి కిలోన్నర నుంచి రెండు కిలోలు. అలాగే విత్తుకునేటప్పుడు సజ్జ పంటైతే మొక్కకు మొక్కకు 15 సెం.మీ, సాలుకు సాలుకు 45 సెం.మీ. మధ్య దూరం పాటించాలి. ఇతర చిరుధాన్యాల పంటలను మాత్రం మొక్కకు మొక్కకు పది సెం.మీ, సాలుకు సాలుకు 22.5 సెం.మీ.ల దూరం పాటించి విత్తుకోవచ్చు. ఈ ధాన్యం చిన్నవిగా ఉంటాయి కాబట్టి విత్తుకునేటప్పుడు సమపాళ్లలో విత్తనం… ఇసుక కలిపి విత్తుకోవాలి. సాళ్లలో విత్తుకోవడం ద్వారా అంతర కృషి సులభమవుతుంది. రాగులు మాత్రం నారుమడి తయారుచేసుకొని 21 రోజులకు పీకి వరుసల్లో నాటుకోవాలి. మొక్కలను పలుచన చేయడం ద్వారా పిలకల సంఖ్య పెరిగి అధిగ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
కుదురుకు 2 లేదా 3 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. సజ్జలో 4 గ్రాముల అట్రజన్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకొని కలుపు నివారణ చేసుకోవచ్చు. అలాగే విత్తనం విత్తే ముందు సజ్జలైతే 6 గ్రాముల ఆప్రాన్‌ను కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇతర చిరుధాన్యాల విత్తనాన్ని 2 గ్రా. కార్బండిజమ్‌ను కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేయాలి. దుక్కులు సిద్ధం చేసుకునేటప్పుడు ఎఫ్‌వైఎంను ఎకరాకు 3 నుంచి 4 టన్నులు చల్లుకోవాలి. సజ్జ సాగు చేసుకుంటే కిలో ఎన్‌పికే (12-12-8)ను ఎకరాకు, రాగులైతే ఎన్‌పీకే (12-16-12)ను కిలో ఎకరాకు, ఇతర చిరుధాన్యాలైతే ఎన్‌పీకే (8-12-8) కిలో చొప్పున ఎకరాకు చల్లుకొని సాగు చేసుకోవాలి. పైపాటు ఎరువులుగా సజ్జ పైరుకు ఎకరానికి 8 కిలోల నత్రజని, రాగులకు ఎకరానికి 12 కిలోల నత్రజని, ఇతర చిరుధాన్యాల పంటలకు ఎకరానికి 8 కిలోల నత్రజని ఎరువులను అందించాలి.

 వర్షాధారంతో దిగుబడి
ఖరీ్‌ఫలో వర్షాలు బాగా ఉన్నట్లైతే నీటిని పెట్టాల్సిన అవసరం లేదు. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు సజ్జలు, రాగులు, కొర్రల పంటలకు 12, 15 రోజులకోసారి, మిగతా చిరుధాన్యాల పంటలకు 18, 20 రోజులకోసారి నీటి అవసరమవుతుంది. క్లిష్టమైన పూత, గింజ అభివృద్ధి, గింజ నిండుకునే దశల్లో తడులు అవసరం ఉంటుంది. బెట్ట ఉన్నట్లైతే పూత రాలటం, గింజల సంఖ్య తగ్గిపోవడం, తాలు గింజలు ఏర్పడటం జరుగుతుంది. చిరుధాన్యాల సాగులో పెద్దగా సమస్యలు ఉండవు కానీ అగ్గితెగులు, మోగి చనిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని గమనించి సకాలంలో నివారించుకుంటే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించవచ్చు.చిరుధాన్యాలే ఆరోగ్యానికి చిరునామా

కాలనుగుణంగా ఆహార అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడంతో తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడం గణనీయంగా తగ్గిపోయింది. వాణిజ్య పంటల సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం రావడంతో తృణధాన్యాల సాగు తగ్గింది. నిజానికి తృణధాన్యాలను సాగు చేసేందుకు పెట్టుబడి పెద్దగా ఉండదు. తెగుళ్ల బెడద కూడా తక్కువే. దిగుబడులు తక్కువగా వస్తాయనే ఆలోచనతో రైతులు వరి, మొక్కజొన్న, పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రోజుల్లో చిరుధాన్యాలకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఖర్చులు తగ్గించుకుని సాగు చేస్తే తృణధాన్యాలపై కూడా మంచి రాబడి పొందవచ్చు.
– డాక్టర్‌ టి.శోభ,
తృణధాన్యాల సీనియర్‌ శాస్త్రవేత్త, ఆర్‌ఏఆర్‌ఎస్‌, పాలెం.

 

About The Author