వీకెండ్‌ వస్తే చాలు. పబ్బులు, పార్టీలు, డిస్కోథెక్‌లు.. షాపింగ్‌మాళ్లు.. మల్టీఫ్లెక్స్‌లు.. అంటూ తిరిగే యువతరం నగరాల్లో పెరిగిపోతోంది. వారికి ఇంతకంటే అర్థవంతమైన జీవితం మరొకటి లేదా? అన్న ఆలోచనకు బీజం వేసింది ‘ద వీకెండ్‌ అగ్రికల్చరలిస్ట్‌’ (టిడబ్య్లుఎ). ఫేస్‌బుక్‌లో మొదలైన ఈ ట్రెండ్‌.. పలువురు నవతరం ఉద్యోగుల్ని పొలాల బాట పట్టించింది.

పట్టణాలు, నగరాలకు వలస వచ్చిన ఎక్కువ మంది యువతీయువకుల మూలాలు గ్రామాలు. వారిది వ్యవసాయ కుటటుంబ నేపథ్యం కాబట్టి సేద్యంతో అనుబంధం ఉంటుంది. నగరాల్లోకి వచ్చిన తరువాత మట్టివాసనలు మాయమైపోతాయి. కాలువ గట్టు తెలీదు. కలుపు తీయడం, బురద మడిలో దుక్కి చేయడం ఉండవు. ‘‘నగరాల్లో ఉద్యోగాల్లో చేరినా వాటిని మరిచిపోకూడదు. మరో వైపు ఏ రైతులు అయితే కూలీలను పెట్టుకోలేకపోతున్నారో వారికి సహాయపడాలి అనుకున్నాం. దానికోసమే వీకెండ్‌ పార్మర్స్‌గా అవతారం ఎత్తాం’’ అంటున్నారు చెన్నైకు చెందిన హరీష్‌ శ్రీనివాసన్‌.

• ఫేస్‌బుక్‌ ఆలోచన…!

ఇరవై తొమ్మిదేళ్ల హరీష్‌ వినూత్న ఆలోచనే ‘ద వీకెండ్‌ అగ్రికల్చరిస్ట్‌’. ‘‘ఇది చాలా తమాషాగా జరిగిపోయింది. సిటీల్లో వీకెండ్‌ వస్తే పబ్బులు, బార్‌లు, మల్టీఫ్లెక్స్‌లు అంటూ తిరిగి డబ్బు ఖర్చు చేయడం.. అలసిపోయి ఇంటికి రావడం.. సర్వసాధారణం. మళ్లీ ఉదయాన్నే ఎవరి ఆఫీసులకు వాళ్లు వెళ్లిపోతుంటారు. ఇంతకంటే అర్థవంతమైన జీవితం మరొకటి ఉండదా? అన్న ఆలోచన వచ్చింది నాకు. ఎలాగూ యువకులం. ఎంత కష్టపడినా ఫర్వాలేదు. శ్రమను వృథా చేసే బదులు.. పల్లెలకు వెళ్లి చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో పనిచేస్తే ప్రయోజనం ఉంటుంది కదా? అనుకున్నాను. వెంటనే నా ఆలోచనలను ఫేస్‌బుక్‌లో ఉంచాను..’’ అని పేర్కొన్నారు హరీష్‌. మూడేళ్లు గడిచింది. ఫేస్‌బుక్‌లో తగిలిన రకరకాల స్నేహితులకు హరీష్‌ ఆలోచన తెగ నచ్చింది. ‘‘నాకే ఆశ్చర్యం వేసింది. మా గ్రూప్‌లో ఇప్పటికి అయిదువేల మంది చేరారు. అందులో ఐటీ ఉద్యోగులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఎంటర్‌ప్రెన్యూర్‌లు, సామాజిక సేవా కార్యకర్తలు వంటి వర్గాల వారు తోడయ్యారు’’ అని చెప్పాడీ యువకుడు.

• మూలాలు మరవకుండా…!

గ్రూప్‌లో చేరిన జె.సతీ్‌షకుమార్‌ అనే ఉద్యోగి ‘‘మాలాంటి వాళ్లు ఎంతో మంది సిటీలో పుట్టి పెరిగినా పల్లెలతో బంధం ఉంది. ఒకప్పుడు మా మూలాలు అవే. అందుకే మళ్లీ పొలాలకు వెళ్లి పనిచేయడం అద్భుతం’’ అన్నాడు. బృందాలుగా బయలుదేరే ఈ వీకెండ్‌ రైతులు అన్ని పనులు చేస్తారు. పొలాల్లోని మట్టిని చదును చేయడం, విత్తనాలు చల్లడం, కలుపుతీత, సాగు వంటివన్నీ చేస్తున్నారు. రైతులకు ఏ పని అవసరమైతే ఆ పనిని చేసిపెడుతున్నాం. మేము ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతోంది’’ అన్నది బృంద సభ్యుల అభిప్రాయం.

‘‘రైతు సమస్యల పరిష్కారం కోసం రాజకీయ నాయకుల్ని తిట్టిపోస్తాం. టీవీ చర్చల్లో ఎడతెరిపి లేకుండా ఊదరగొట్టేస్తాం. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు ఉండిపోతాం. అదే రోజు సాయంత్రం సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి.. మన తిండిగింజల్ని మనం తెచ్చుకుంటాం. రైతుల్ని మాత్రం మరిచిపోతాం..’’ అన్నారు చెన్నైలోని ఒక సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి. ఈయన కూడా ఇప్పుడు వీకెండ్‌ అగ్రికల్చరిస్ట్‌.

• పాఠశాలల్లో బస…!

‘ద వీకెండ్‌ అగ్రికల్చరిస్ట్‌’ ఎలా పనిచేస్తుందంటే – శని, ఆదివారాల్లో ఏ పల్లెలకు వెళ్లాలో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేస్తారు నిర్వాహకులు. ‘‘మేము ఏ పొలాల్లో పని చేయాలనుకున్నామో ఆ రైతులకు ముందే కబురు పెడతాం. రాత్రి పూటే ఆ ఊరికే చేరుకుంటాం. రవాణా, తిండి ఖర్చులు అన్నీ మేమే పెట్టుకుంటాం. పల్లెల్లోని ఆరుబయళ్లు, పాఠశాలలు, దగ్గర్లో ఉంటే చిన్న హోటళ్లలో కూడా ఒక్కోసారి బస చేస్తుంటాం. మా బృందంలోని సభ్యులందరు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు లేని వాళ్లు’’ అని చెప్పారు సభ్యులు. ‘‘కొన్ని గ్రామాల్లో అయితే వరి, పండ్లు, పూల రైతులు కూలీలు దొరక్క అగచాట్లు పడుతున్నారు. రోజుకు 250 రూపాయలు ఇస్తేగానీ కూలీలు దొరకడం లేదు. కొంత వరకు ఆ కొరతను తీరుస్తున్నాం మేము. పల్లెల్లో ముఖ్యంగా పూలతోటల్లో ఉదయాన్నే చాలామంది కూలీలు అవసరం అవుతారు. వారి స్థానంలో మేము పొలాల్లోకి దిగి కనకాంబరాలు, రోజాపువ్వులు కోస్తున్నాం. రైతులకు ఎంతో ఊరట.’’ అన్నారు సభ్యులు.

• పూలతోటల్లో…!

రైతులకు సహాయం చేయడం ఒకటైతే.. వారు పండించిన పంటలకు ఎందుకు గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఏ పంటకు ఎంత పెట్టుబడి అవుతోంది? మార్కెటింగ్‌లో లోపాలు ఎక్కడ ఉన్నాయి? రసాయనాలు ఎందుకు వాడాల్సి వస్తోంది? బయట చూస్తే ధరలు ఎక్కువ.. రైతులకు మాత్రం దక్కుతున్నది తక్కువ.. ఎందుకిలా? వంటి విషయాల మీద కొత్తతరం యువతీయువకులకు అవగాహన ఏర్పడుతోంది. కొన్ని చోట్ల మార్కెట్‌ పట్ల అవగాహన లేని రైతుల్ని వీరు చైతన్య పరుస్తున్నారు. వీకెండ్‌ అగ్రికల్చరి్‌స్టల వల్లే రైతులు బయట పడిపోతారని కాదు కానీ.. కొత్తతరానికి వ్యవసాయంపై అనుబంధం తెగిపోకుండా ఉండేందుకు ఇది పనికొస్తోంది అంటున్నారు సామాజిక అధ్యయనకారులు.

• ఆ పుస్తకమే స్ఫూర్తి..!

‘‘వాస్తవానికి నాకు ఎటువంటి వ్యవసాయ నేపథ్యమూ లేదు. ఒక సందర్భంలో తమిళ రచయిత వైరముత్తు రాసిన ‘మూండ్రమ్‌ ఉళగపోర్‌’ (థర్డ్‌ వరల్డ్‌ వార్‌) నవల చదివాను. అందులో రైతుల బాధలు నన్ను కుదిపేశాయి. అప్పుడే అనుకున్నాను.. రైతులకు నా వంతు ఏదో ఒకటి చేయాలని’’
– హరీష్‌ , ద వీకెండ్‌ అగ్రికల్చరిస్ట్‌

About The Author