పట్టణాలలో హరితసాధన కోసం అర్బన్ పాలసీ లోని నిబంధనలు…
పట్టణాల్లో గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి, అమలు చేయడానికి కలెక్టర్ నేతృత్వంలో అటవీశాఖ డిఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ పట్టణాలలో గ్రీన్ కవర్ పనులను పర్యవేక్షిస్తుందని, ప్రతి మున్సిపాలిటీ బడ్జెట్లో 10 శాతానికి తగ్గకుండా గ్రీన్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నూతన మున్సిపాలిటీ చట్టం స్పష్టం చేస్తున్నది. వచ్చే ఐదేళ్ల కోసం వార్డుల వారీగా హరితహారం యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలి.హరితహారం ఉద్దేశాన్ని లక్ష్యాన్ని ప్రజలకు వివరించి చెప్పాలని, మొక్కలు నాటడమే కాదు నాటిన మొక్కలు బతికే విధంగా బాధ్యతను నిర్వహించడానికి వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని చట్టం చెప్తున్నది.
ప్రతి వార్డు లో నర్సరీ ఏర్పాటు చేసి, దాని నిర్వహించే బాధ్యతను చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ నిర్వర్తించాలి.నాటిన మొక్కల లో కనీసం 85% బతికే విధంగా చర్యలు తీసుకోవాలి. మొక్కలు నాటే విషయంలో వాటిని రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డ్ కౌన్సిలర్, కార్పొరేటర్లు, స్పెషలాఫీసర్లపై చర్యలకు చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.మున్సిపల్ ఉద్యోగుల్లో జవాబుదారితనం పెంచేందుకు కామన్ మున్సిపల్ సర్వీసెస్ అమలుచేయాలని, ఉద్యోగులను ఏ మున్సిపాలిటీ నుండి ఏ మున్సిపాలిటీ కి అయినా బదిలీ చేసే విధంగా అవకాశం కల్పిస్తూ చట్టంలో నిబంధనలను పొందుపరిచారు.