కాలుష్యం మనిషి ఆయుష్షును కాటేస్తోంది…
కాలుష్యం మనిషి ఆయుష్షును కాటేస్తోంది.
దేశ నగరాల్లో కాలుష్యం కోరలు విప్పిన సంగతి తెలిసిందే. అయితే కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలను భారత్ చేరుకోగలిగితే ఆయుప్రమాణం సగటున 4.3 ఏళ్లు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని చికాగో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వాయుకాలుష్యంపై ఇప్పటివరకు జరిపిన వివిధ పరిశోధనల్ని అధ్యయనం చేశారు. అనంతరం వాటిని విశ్లేషించి వాయునాణ్యత జీవిత సూచి (ఏక్యూఎల్‌ఐ)ని తయారు చేశారు. ఈ సూచి ప్రకారం కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆయుప్రమాణం సగటున 1.8 ఏళ్లు తగ్గుతోందని అంచనా వేశారు.
మానవాళికి ధూమపానం, ఉగ్రవాదం, యుద్ధం, ఎయిడ్స్ కంటే కూడా వాయుకాలుష్యమే భూమిపై అత్యంత పెద్ద ముప్పని హెచ్చరించారు. సిగరెట్‌తో 1.6 ఏళ్లు, మద్యపానంతో 11నెలలు, అపరిశుభ్రమైన నీటితో 7 నెలలు, హెచ్ఐవీతో 4 నెలలు సగటున ఆయుప్రమాణం తగ్గుతోందని, ఉగ్రవాదం కన్నా 25 రెట్లు కాలుష్యమే ప్రమాదకరమని వివరించారు. ప్రపంచ జనాభాలో 36 శాతం ఉన్న చైనా, భారత్‌లో అన్ని వయసులకు చెందిన 73 శాతం మందిపై వాయుకాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ప్రపంచ జనాభాలో 75శాతం అంటే 550 కోట్ల మంది డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు దిగువన ఉన్న నాణ్యత లేని గాలినే పీలుస్తున్నారని, ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధకుడు మిచెల్ గ్రీన్‌స్టోన్ పేర్కొన్నారు. భూగోళం డబ్లూహెచ్‌వో ప్రమాణాలను అందుకోగలిగితే సగటు ఆయుప్రమాణ ఏడాది పెరుగుతుందని పరిశోధకులు చెప్పారు.