వినేదంతా నమ్మొద్దు..

వినేదంతా నమ్మొద్దు..
టీవీల్లో సోషల్ మీడియాలో చూసేదంతా నిజంకాదు..
లావుతగ్గాలని అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు…

ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. ఇప్పుడు అందరి దృష్టి తినే ఆహారం మీద పడింది. అది కూడా శాస్త్రీయంగా కాకుండా ఎక్కడో చూసి, ఎవరో చెప్పింది విని అనుసరిస్తున్నారు. అది ఎంత వరకు సరైందనే విషయాలను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో చూసి దానినే నమ్మేస్తున్నారు. కొందరు పూర్తిగా పిండి పదార్థాలు మానేద్దాం అనుకుంటారు. మరి కొందరు కొవ్వు పదార్థాలను కనీసం కన్నెత్తి కూడా చూడకూడదనుకుంటారు. ఇలా ఎవరికి తోచింది వాళ్లు చేసేస్తున్నారు. వైద్యుల సలహాలు తీసుకోకుండా ఆహారాన్ని ఇష్టారీతిన ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉన్నట్లు డాక్‌ఆన్‌లైన్‌ సంస్థ చేసిన సర్వేలో తేలింది.
ఆధునిక కాలంలో జీవన విధానం వైవిధ్యంగా ఉంటుంది. ఉద్యోగాలు ఉరుకులు పరుగుల మధ్య ఎప్పుడు తింటారో తెలియదు. సమయపాలన ఉండదు. వారాంతాలలో మస్తీ చేయాల్సిందే.. ముక్క దిగాల్సిందే. జంక్‌ఫుడ్స్‌, బిర్యానీ, బేక్డ్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకుంటారు. దీంతో వేగంగా బరువు పెరుగుతున్నారు. ఇలాంటి వారు అంతే వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారు. ఏం తింటే బాగుంటుందని, ఎలాంటి డైట్‌ను అనుసరించాలని సామాజిక మాధ్యమాల్లో వెతికి మరీ పాటిస్తున్నారు. దీంతో కార్బోహైడ్రేట్‌లను తగ్గించి కీటోడైట్‌ను పోలిన విధానాలను అనుసరిస్తున్నారు. కొవ్వులను అధికంగా తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటివి పాటిస్తే అనారోగ్యానికి గురవుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి డైట్‌లు తమ శరీరానికి సరిపోతాయో లేదో అని చూసుకోకుండా అనుసరిస్తున్నారు.
ఇబ్బందులు ఇవీ…
కొవ్వును కొవ్వుతోనే కరిగించాలని ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నారు. ఒకే సారి పిండిపదార్థాలను తీసుకోవడం ఆపేస్తున్నారు. శరీరానికి తక్షణ శక్తి కావాలంటే కార్బోహైడ్రేట్‌లు అవసరం. వీటిని పూర్తిగా మానేయడం వల్ల శరీరంలో సత్తువ తగ్గిపోతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం రోజువారీ తీసుకునే ఆహారానికి అలవాటుపడి ఉంటుంది. ఒక్కసారిగా మార్పులు చేయడం వల్ల జీవక్రియల్లో మార్పులు తలెత్తి జీర్ణసంబంధ ఇబ్బందులు తలెత్తుతాయి. తలనొప్పి, నీరసంగా ఉండటం, గొంతు పుల్లగా అయిపోవడం వంటి మార్పులు చోటు చేసుకుంటాయి.
నెమ్మదిగా తగ్గడమే మేలు
పిండిపదార్థాలతో జీవక్రియ తొందరగా జరుగుతుంది. అదే కొవ్వు పదార్థాలు తీసుకుంటే జీర్ణక్రియ జరగడానికి రెండు వారాల సమయం పడుతుంది. తక్షణ శక్తి కోసం శరీర వ్యవస్థలు దేహంలో నిల్వఉన్న పిండిపదార్థాలను కరిగించి శక్తిని విడుదల చేస్తాయి. కొవ్వుల నుంచి ఇలా తక్షణ శక్తి లభించదు. అందువల్ల శరీరం ఈ డైట్‌కు వెంటనే స్పందించదు. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్‌ నిల్వలు తరిగిపోయి తొందరగా అలసిపోతారు. చాలా మందికి అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, ఆరోగ్యమైన కొవ్వు పదార్థాల పట్ల అవగాహన లేదు. దీంతో ఏది పడితే అది తినేస్తున్నారు. వైద్యుల సలహాల మేరకే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వారు పరీక్షించి తట్టుకోగలరా.. లేదా.. అని చూసి సలహాలు, సూచనలు అందజేస్తారు. బరువు వేగంగా తగ్గడం కన్నా ఆరోగ్యకరమైన పద్ధతుల్లో నెమ్మదిగా తగ్గడమే మేలు.

About The Author