ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే మీడియా ప్రసారం చేయాలి.


న్యూఢిల్లీ: కరోనావైరస్(కొవిడ్-19)కు సంబంధించిన ఏ సమాచారం అయిన ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే మీడియా ప్రసారం చేసే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీని వల్ల వాస్తవాలు మాత్రమే ప్రజలకు చేరుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరింది.

అంతకుముందు నకిలీ వార్తలు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు వార్తలు కరోనావైరస్ పోరాటంలో అవరోధంగా మారుతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. నకిలీ వార్తలు మహమ్మారి కరోనాపై చేస్తున్న పోరాటంలో తీవ్ర అంతరాయాలను సృష్టిస్తున్నాయని తెలిపింది.

కాగా, వలస కూలీలు, కరోనా నివారణ చర్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వలస కార్మికుల పరిస్థితిపై మంగళవారం కేంద్రం కోర్టుకు స్టేటస్ రిపోర్టును సమర్పించింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

కరోనా నివారణకు కేంద్రం జనవరి 17 నుంచి చర్యలు చేపట్టిందని కోర్టుకు తెలిపారు. దీని కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో 4.14 కోట్ల మంది వలసదారులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. అయితే, కరోనాపై వస్తున్న నకిలీ వార్తలు, వదంతుల వల్లే భయంతో వారంతా స్వస్థలాలకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారని కోర్టుకు వివరించారు.

వలస కూలీల కోసం అన్ని రాష్ట్రాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేశామని కోర్టు తెలిపారు. భోజన వసతి, స్క్రీనింగ్, వైద్య సౌకర్యాలు కల్పించామన్నారు. కూలీలందరినీ వసతి గృహాలకు తరలించాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశించిందని తెలిపారు. కాగా, దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. బాధితుల చికిత్సకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

అంతేగాక, వదంతుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక పోర్టల్, ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. పోర్టల్ ద్వారా ప్రజలకు సరైన సమాచారం అందజేయాలని, 24 గంటల్లోగా ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వలస కూలీల తరలింపులను ఆపేసి, వారికి వసతి గృహాల్లో భోజన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది.

About The Author