ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

కరోనా కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రెండు మూడుసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈసారి పరీక్షలు రాయకుండానే అందరు విద్యార్థులు పాస్ అయినట్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇదిలావుండగా ఇంకా

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించి సందిగ్ధత నెలకొంది. ఈ మేరకు కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జులై 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. కరోనా సమయంలో చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు.పొరుగున ఉన్న తెలంగాణ , తమిళనాడు , ఒడిశా , ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహించడం లేదని తెలిపారు.

డిగ్రీ , పీజీతో పాటు వృత్తి , ప్రవేశ పరీక్షలు సైతం రద్దైపోయాయని చెప్పారు. పేపర్లను కుదించినప్పటికీ ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించడం ఎంతమాత్రమూ మంచిదికాదని అభిప్రాయపడ్డారు. ‘ రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం ప్రమాదకరం. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో లేదు. ప్రైవేటు వాహనాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. విద్యార్ధుల తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి. పొరుగు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను పాటించాలి. విద్యావంతులు , వైద్య నిపుణులతో పలు దఫాలుగా చర్చించాకే ఈ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను’ అని పవన్ తెలిపారు.

About The Author