నీళ్ల బాటిల్‌ వెల కంటే తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌…


నీళ్ల బాటిల్‌ వెల కంటే తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ తీసుకొస్తామని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ప్రపంచంలోని ఏ ఫార్మా సంస్థ కూడా వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌ సంస్థల కంటే తక్కువ కాదని అన్నారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన కరోనా టీకాను అందిస్తామని వెల్లడించారు. భారత్‌లో ఇచ్చే వ్యాక్సిన్‌, విదేశాలకు ఎగుమతి చేసే వ్యాక్సిన్‌ ఒకే నాణ్యతతో ఉంటుందని అన్నారు. మంగళవారం మంత్రి కేటీఆర్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కరోనా టీకా ఉత్పత్తుల కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడారు.

కరోనా వ్యాక్సిన్ అయిన కొవాగ్జిన్‌ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్త వైరస్‌ కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారం అందిస్తున్నాయని వెల్లడించారు. భారత వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 70 శాతం వాటా హైదరాబాద్‌‌లోని 3 కంపెనీల నుంచే జరుగుతోందన్నారు. ఫార్మా మార్కెట్‌లో తాము పోటీదారులు అయినప్పటికీ, తుదకు అందరి పోరాటం మాత్రం కరోనాను జయించడమే అని ఎల్లా స్పష్టం చేశారు.

ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం కరోనాను ఆరోగ్యపరమైన సంక్షోభంగానే చూస్తోందని అన్నారు. అయితే, కరోనా భారీ ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. టీకాల అభివృద్ధిపై కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరపాలని కోరారు. వేగంగా కరోనా టీకాను అందుబాటులోకి తేవడానికి ఎవరి అవసరాలు ఏంటో తెలుసుకోవాలని సూచించారు. టీకా అభివృద్ధిలో భాగంగా ప్రతి చిన్న అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందని గుర్తు చేశారు. ఆ అవసరం లేకుండా తమకు అవసరమైన అనుమతులు ప్రాంతీయ కేంద్రం నుంచే ఇచ్చేలా చూడాలని డాక్టర్ ఎల్లా కోరారు.
వ్యాక్సిన్‌ ధర రూ.వెయ్యి ఉన్నా కష్టమే.. డాక్టర్‌ ఆనంద్‌
ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్‌ ఎండీ డాక్టర్‌ కూడా ఈ చర్చా కార్యక్రమంలోనే పాల్గొన్నారు. వ్యాక్సిన్‌ ధర మరీ ఎక్కువగా ఉంటే సామాన్యులకు సైతం అందుబాటులో లేకుండా పోతుందని అన్నారు. టీకా ఒక్క డోసు ధర రూ.వెయ్యి అయినా భారత్‌ లాంటి దేశాలకు అది చాలా భారంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఏడు సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలకంగా ఉన్నాయి. ఈ 7 సంస్థలను కలిపి ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు.

About The Author