రెండు ముక్కలైన ఫ్లైట్ .. కేరళలో ఎయిరిండియా విమానానికి ప్రమాదం..

దుబాయ్ నుంచి కేరళలోని కాలికట్ (కోజికోడ్) వెళ్తున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. రన్ వే మీద ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విమానం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వే మీద నుంచి పక్కకి దూసుకుపోయింది. కేరళలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రాధమిక సమాచారం మేరకు ఓ పైలెట్ చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొందరు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. వర్షం పడుతుండడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు విమానంలో కెప్టెన్ దీపక్ వసంత్, కో పైలెట్ అఖిలేష్ ఉన్నారు.మరో నలుగురు విమాన సిబ్బంది శిల్పా కటారా, అక్షయ్ పాల్ సింగ్, లలిత్ కుమార్, బిస్వాస్ ఉన్నారు.

‘దుబాయ్ నుంచి కాలికట్ (కోజికోడ్ ) వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం IX 1344 విమానం కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే మీద రాత్రి 7.41 గంటలకు ప్రమాదానికి గురైంది. లాండింగ్ సమయంలో ఎలాంటి మంటలు అంటుకోలేదు. విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఇద్దరు పైలెట్లు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు.’ అని విమానయానవర్గాలు ప్రకటించాయి.

About The Author