శ్రీశైలం ప్రమాదం పై 2 రోజుల ముందే హెచ్చరిక…


*కేబుల్స్‌పై నీటి తుంపర్లు పడి షార్ట్‌సర్క్యూట్‌ అయ్యే ముప్పుపై ఉన్నతాధికారులకు సమాచారం*

*- నిపుణుల్ని పంపి పరిష్కరిస్తామన్న అధికారులు*

*- రెండు రోజులు గడిచినా పట్టించుకోని వైనం*

*- ప్రమాద సమయంలోనూ బోర్డులకు ఆగని విద్యుత్తు సరఫరా*

*- పనిచేయని ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు..*

*- సరిపోని ఆక్సిజన్‌ సిలిండర్లు*

*- దాంతోనే ఊపిరాడక తొమ్మిది మంది దుర్మరణం*

★ శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాన్ని అక్కడి సిబ్బంది రెండు రోజుల క్రితమే గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారా?

★ విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నాయి.

_*ఆ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం..*_

★ పవర్‌ హౌజ్‌లో టర్బైన్ల నుంచి వచ్చే నీటితుంపర్లు పడి కేబుల్స్‌ షార్ట్‌సర్క్యూట్‌ అయ్యే ప్రమాదాన్ని స్థానిక ఏఈలు రెండు రోజుల క్రితమే గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.

★ నిపుణులను పంపి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు..

★ ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని, అందువల్లే షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందని ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

_*ఇదొక్కటే కాదు..*_

★ అడుగడుగునా నిర్వహణ లోపం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఇంతటి ఘోర ప్రమాదానికి, తొమ్మిది మంది మరణానికి, భారీ నష్టానికి కారణమైందని విద్యుత్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

_*నిబంధనల ప్రకారం..*_

★ విద్యుదుత్పత్తి సీజన్‌ ప్రారంభానికి ముందు టర్బైన్లు, కేబుళ్లు, ఎలక్ర్టికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ విభాగాలన్నింటినీ పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలి.

★ ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో ట్రయల్‌ రన్స్‌ నిర్వహించిన తర్వాతే యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాల్సి ఉంటుంది.

★ పవర్‌హౌజ్‌లో ఎప్పటికప్పుడు గాలి బయటకు వెళ్లేలా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు ఉండాలి.

★ యూనిట్లలో ఉష్ణోగ్రత సమతౌల్యంగా ఉండేలా ఏసీల నిర్వహణ చేపట్టాలి.

★ అత్యవసరమైనప్పుడు పవర్‌స్టేషన్‌ నుంచి సిబ్బంది తప్పించుకునేందుకు వీలుగా ఎస్కేప్‌ వేలు, అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండాలి.

★ అవసరమైనప్పుడు వినియోగించేందుకు వీలుగా ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉండాలి.

★ పక్కాగా అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

★ ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు చెబుతుంటే.. రాష్ట్రానికే తలమానికమైన శ్రీశైలం పవర్‌హౌజ్‌ వద్ద మాత్రం వీటిని పాటించలేదని, అందువల్లే ఈ పెనుప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.

★ సీజన్‌ ప్రారంభానికి ముందే ఉన్నతాధికారుల సమక్షంలో చేయాల్సిన తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయని, ప్రతి షిఫ్టు ప్రారంభానికి ముందు విధిగా జరగాల్సిన తనిఖీలు జరగడం లేదని అక్కడి సిబ్బందే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

_*వారు చెబుతున్నదాని ప్రకారం..*_

★ ప్రమాదం జరిగినప్పుడు పవర్‌హౌజ్‌లో ఉండే సిబ్బందిని తరలించేందుకు ఏడు ఎమర్జెన్సీ వాహనాలు ఉండాల్సి ఉండగా, ప్రమాద సమయంలో ఒక్క వాహనమే ఉంది.

★ మంటలు ఆర్పేందుకు ఆక్సిజన్‌ సిలిండర్లు ప్రతి యూనిట్‌లో అందుబాటులో ఉండాలి.

★ ఉన్నాయిగానీ.. అవి సినిమాహాళ్లలో మాదిరిగా చిన్నవిగా ఉన్నాయని సమాచారం.

★ వ్యాపించిన పొగ ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయేలా చేయాల్సిన ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు పనిచేయలేదు.

★ ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు వచ్చి సరిచేస్తే తప్ప ఆ ఫ్యాన్లు తిరగలేదు.

_*బయటికొచ్చే మార్గాలున్నా..*_

★ శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భంలో నిర్మించిన 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ జల విద్యుత్‌ కేంద్రంలో తొలి యూనిట్‌ 2001లో అందుబాటులోకి వచ్చింది.

★ ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మిగిలిన అయిదు యూనిట్లు కూడా 2003నాటికి అంది వచ్చాయి.

★ కృష్ణా నది బెడ్‌ కంటే కూడా ఈ విద్యుత్‌ కేంద్రాలు దిగువకు ఉంటాయి.

★ భూగర్భంలో ఉన్న ఈ విద్యుత్‌ కేంద్రంలో అప్రోచ్‌ టన్నెల్‌ ప్రధానమైంది.

★ ఈ మార్గం గుండానే విద్యుత్‌ కేంద్రంలోకి వాహనాలపై రాకపోకలు సాగుతున్నాయి.

★ ఇది సుమారు 1.4 కిలోమీటర్ల మేర ఉంటుంది.

★ ఈ మార్గంలోనే జనరేటర్ల పై భాగం కనిపిస్తుంది.

★ ఆరు జనరేటర్లు ఒకదాని తరువాత మరొకటి మూడు అంతస్తుల ఎత్తులో ఉంటాయి.

★ పై భాగానికి దిగువన రెండు అంతస్తుల్లో ఇవి అమరి ఉన్నాయి.

★ ఇక, ఈ అప్రోచ్‌ టన్నెల్‌కు పక్కనే మరో చిన్న టన్నెల్‌ ఉంటుంది.

★ ఇది కూడా ఒక రకంగా రెండు అంతస్తుల భవనం.

★ దీని కింద భాగంలో ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయగా.. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తీసుకెళ్లే వ్యవస్థను పై భాగంలో అమర్చారు.

★ రెండు టన్నెళ్ల మధ్య సర్వీస్‌ బే ఉంటుంది. దానిలోనే ఒక వైపు నియంత్రణ వ్యవస్థ ఉంది.

★ అప్రోచ్‌ టన్నెల్‌ కాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ అని మరో మార్గం ఉంది.

★ ఈ మార్గం శ్రీశైలం డ్యామ్‌ దిగువన బయటకు ఉంటుంది.

★ మరొకటి ఇంక్లైన్‌ టన్నెల్‌. దీని ముఖ ద్వారం శ్రీశైలం జలాశయంలోకి ఉంది.

★ నిర్మాణ సమయంలో తవ్విన బండ రాళ్లను బయటకు తీయడానికి కన్వేయర్‌ బెల్ట్‌ కోసం దాన్ని ఉపయోగించారు. తరువాత కన్వేయర్‌ బెల్ట్‌ తీసివేశారు.

★ విద్యుత్‌ కేంద్రంలో గాలి కోసం దాన్ని వాడుతున్నారు.

★ అగ్నిప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ను టీవీల్లో చూసినపుడు దాదాపు చివరి జనరేటర్‌ పక్కన మంటలు కనిపించాయి.

★ మంటలు చెలరేగినప్పుడు పై నుంచి కిందకు దిగి ప్రధాన అప్రోచ్‌ టన్నెల్‌ ద్వారా బయటకు రావొచ్చు.

★ పొగ ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఎటు వెళ్లాలో తెలియక అచేతనంగా వారు పడి ఉండవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.

★ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ఉన్నా.. గురించి అక్కడ పనిచేస్తున్న పాతవాళ్లకు తెలుసు..

★ కొత్తవారికి తెలియదని సిబ్బంది చెబుతున్నారు.

★ అత్యవసర ద్వారం గురించి తెలిసినవారే బయటపడ్డారని వారు వివరిస్తున్నారు.

_*ఆగని కరెంటు..*_

★ పవర్‌హౌజ్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ప్యానల్‌ బోర్డుకు మంటలు అంటగానే.. దానికి కరెంట్‌ సరఫరాను ఆపేయడానికి సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

★ మంటలు అంటుకున్న ప్యానల్‌ బోర్డుకు రెండు వేర్వేరు మార్గాల నుంచి బ్యాటరీల నుంచి డైరెక్ట్‌ కరెంట్‌(డీసీ) అందుతుండేది.

★ ప్రమాద సమయంలో రెండు స్విచ్‌లూ పనిచేయలేదని తేలింది.

★ ఆ స్విచ్‌లు పనిచేసి ఉంటే… ఐదు నిమిషాల్లోపే అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.

★ మంటలే మరింత చెలరేగడానికి.. ప్యానల్‌ బోర్డుకు విద్యుత్తు సరఫరా అవుతుండడమే కారణమని వారు వివరిస్తున్నారు.

★ కాగా, జెన్‌కో వర్గాలు మాత్రం నిర్వహణలో లోపాలున్నాయనే వాదనను ఖండిస్తున్నాయి.

★ పవర్‌హౌజ్‌లో ప్రమాదం సంభవించిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయని, దీంతో అక్కడ ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయాయని.. పొగ కమ్మేయడంతో బయటకు రాలే ని స్థితి ఏర్పడి ప్రాణాలు కోల్పోయారని వారు చెబుతున్నారు.

★ ఏదేమైనా, ఈ ప్రమాదంపై లోతైన విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

About The Author