బైరెడ్డి అక్కాతమ్ముడి మధ్య మాటల తూటాలు..
కర్నూలు జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి కుటుంబానిది ముఖ్యపాత్ర. గత కొంత కాలంగా ఆ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకుంది. పంచాయతీ ఎన్నికలు వాళ్ల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసినట్టైంది.
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామం బైరెడ్డి స్వస్థలం. ఆ గ్రామంలో గత కొన్నేళ్లుగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పిందే శాసనం. ఈ నేపథ్యంలో పెదనాన్నతో రాజకీయంగా విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న సిద్ధార్థ్ వైసీపీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో విడతలో నేడు జరుగుతున్న పంచాయతీ ఎన్నిక తండ్రీకొడుకుల మధ్య చిచ్చు రాజేసింది.
రెండురోజుల క్రితం ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం మినీ ట్రక్కు తీసుకెళ్లిన రాంబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి తనయ, బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి నేతృత్వం వహించారని పోలీసులు చెబుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శబరితో పాటు ఆమె అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో అక్కాతమ్ముడి మధ్య మాటల తూటాలు పేలాయి. తన వర్గీయులపై దాడిని ఖండిస్తూ బైరెడ్డి సిద్ధార్థ్ తన అక్క శబరితో పాటు పెదనాన్నపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తననంతా దళిత వ్యతిరేకి అని విమర్శిస్తున్నారని, మరి ఇంటింటికి రేషన్ తీసుకెళ్లేందుకు వెళ్లిన రాంబాబుపై బీజేపీ నాయకురాలు శబరి దాడి చేయడంపై దళిత సంఘాలు ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. దళితుడిని కొట్టడమే కాకుండా, అతని తల్లి, అక్కతో కాళ్లు పట్టించుకున్నారని మండిపడ్డారు.
తనను రౌడీ అంటున్న వారి చరిత్ర ఏంటో ఒక్కసారి చూడాలని ఆయన కోరారు. 40 నుంచి 50 హత్యలు చేసిన వాళ్లు తనను రౌడీ అని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరిని హత్య చేశారో వివరాలతో సహా బైరెడ్డి సిద్ధార్థ్ వెల్లడించడం గమనార్హం. హత్యలు, రౌడీయిజంతో వేల కోట్లు సంపాదించారని, సారాయి వ్యాపారం చేశారని, ఇప్పుడు గ్రామంలో ఆధిపత్యం పోతుందనే భయం పట్టుకుందని తన పెదనాన్నపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.
టీడీపీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోనూ, ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారని తన పెదనాన్న, అక్క గురించి దెప్పిపొడిచారు. అయితే బీజేపీలో కూడా ఎక్కువ కాలం కొనసాగరని హేళన చేశారు. ముచ్చుమర్రి గ్రామంలో పెత్తందారి తనానికి చరమ గీతం పాడే రోజు వచ్చిందన్నారు.
తమ్ముడి ఆరోపణలపై శబరి ఘాటుగా స్పందించారు. ఇంత కాలం ఊర్లో వాళ్లందరిని బెదిరించిన నాయకుడు, ఇప్పుడు ఏకంగా ఇంట్లో వాళ్లను కూడా విడిచిపెట్టడం లేదన్నారు. అక్కపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టేస్థాయికి దిగజారారని తమ్ముడిపై పరోక్షంగా ధ్వజమెత్తారు. కొంత మంది వైసీపీ నాయకులు ఎవరైతే తమపై కేసులు పెట్టారో, వాళ్ల వయసు, వాళ్ల స్థాయి ఎంత? అని శబరి ప్రశ్నించారు. బైరెడ్డి కొడుకుగా వచ్చాడని గుర్తు చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా? మా నాన్న ఎవరో అని ఆమె నిలదీశారు.
ఇప్పుడు అవసరం తీరాక వయసుకు మించి మాటలు మాట్లాడుతున్నాడని తమ్ముడిపై ధ్వజమెత్తారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి రౌడీ వెధవలను వైసీపీ మేపుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.