పెట్రో ధ‌ర‌లు పెర‌గ‌డానికి గ‌త ప్ర‌భుత్వాలే కార‌ణ‌మ‌న్న మోడీ!


దేశంలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగిపోతూ ఉన్న పెట్రోధ‌ర‌ల అంశంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ స్పందించారు. ఇందుకు కార‌ణం ఏమిటో వారు సెల‌విచ్చారు. ఇందుమూలంగా ఆయ‌న తెలియ‌జేయున‌ది ఏమ‌న‌గా.. ఇప్పుడు పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు, రికార్డు స్థాయిలో లీట‌ర్ పెట్రోల్ చాలా చోట్ల వంద రూపాయ‌ల‌కు చేర‌డానికి కార‌ణం నిస్సందేహంగా గ‌త ప్ర‌భుత్వాలే.
గ‌తంలో ఏలిన కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు చేసిన త‌ప్పుల వ‌ల్ల ఇప్పుడు పెట్రోల్ ధ‌ర‌లు నింగిని అంటుతున్నాయి. ఈ విష‌యంలో మోడీ కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. ఇదీ మోడీగారు చెబుతున్న విష‌యం.
ఒక‌వైపు అంత‌ర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ ధ‌ర‌లు తీవ్ర ప‌త‌నానికి లోనుకాగా.. దేశంలో మాత్రం పెట్రో ధ‌ర‌లు అత్యంత గ‌రిష్ట స్థాయికి చేరిపోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సింపుల్ గా గ‌త ప్ర‌భుత్వాల వ‌ల్ల‌నే అనే డైలాగ్ ను వేశారు మోడీ.
ఏ విష‌యం ఎత్తినా 60 యేళ్ల పాల‌న అంటూ విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటుంది బీజేపీ. కాంగ్రెస్ నిర్మించి పెట్టిన వ్యవ‌స్థ‌ల‌ను నేడు ప్రైవేటైజేష‌న్ చేస్తూ నిధులు స‌మీక‌ర‌ణ చేసుకుంటూ ఉన్న‌ప్పుడు 60 యేళ్ల పాల‌న గుర్తు రాదు. వైఫ‌ల్యాల గురించి అడిగితే.. గ‌త పాల‌న‌, గ‌త పాల‌కులు అంటూ మాట్లాడ‌టం.
ఆఖ‌రికి పెట్రోల్ ధ‌ర‌ల పెంపును కూడా గ‌త ప్ర‌భుత్వాల‌కే ముడిపెట్టేశారు మోడీజీ! అదేమంటే.. గ‌తంలో పెట్రోల్ దిగుమ‌తుల మీద ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌టాన్ని అల‌వాటు చేశార‌ట‌. అప్పుడు దిగుమ‌తులు త‌గ్గించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇప్పుడు ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ట‌! ఈ మాట‌లు వింటే చెవిలో పువ్వు అనిపిస్తే వారికి ఈ దేశంలో ఉండే అర్హ‌త లేక‌పోవ‌చ్చు గాక‌!
ఆరేడేళ్ల పాల‌న త‌ర్వాత కూడా ఇంకా.. గ‌తాన్ని నిందిస్తూ ప‌బ్బం గ‌డుపుకోవ‌డమా, ఆఖ‌రికి పెట్రోల్ ధ‌ర‌ల పెంపుకూ గ‌త ప్ర‌భుత్వాల‌కూ ముడి పెట్ట‌డ‌మా, గ‌తంలో పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోడీ ఎలా స్పందించారు.. అనే అంశాల గురించి ఎవ‌రూ ఆలోచించ‌రాదు!

About The Author