కపటధారి సినిమా రివ్యూ


కన్నడలో వచ్చి సూపర్ హిట్ అయిన “కవలుదారి”కి తెలుగు రిమేక్ ఈ “కపటధారి”. “కవలుదారి” కి అర్థం “నాలుగు రోడ్ల కూడలి” అని. అది కథని సూచిస్తోంది. తెలుగు టైటిల్ మాత్రం విలన్ పాత్రని సూచించే విధంగా ఉంది. తెలుగులో సుమంత్ తోనూ, తమిళంలో శిబి సత్యరాజ్ తోనూ ఈ రీమేక్ తెరకెక్కింది. 2020 మేలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి ఇప్పటికొచ్చింది.

విషయంలోకి వెళ్దాం.

బ్రహ్మచారి అయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ (సుమంత్) కి ఒక మర్డర్ మిస్టరీ కంటపడుతుంది. దానిని ఛేదించే ఆసక్తితో తనది క్రైం డిపార్ట్మెంట్ కాకపోయినా తనదైన వ్యక్తిగత శైలిలో ఆ క్రైం యొక్క మూలం ఎలా కనుగొంటాడనేది ప్రధాన కథాంశం. తన పరిశోధనకి ఒక రిటైర్డ్ పోలీసాఫీసర్ (నాజర్) సాయం చేస్తాడు. కవలుదారి ఓటీటీ పుణ్యమా అని సరిహద్దులు దాటి చాలామంది ప్రేక్షకులను చేరింది. పైగా లాక్డౌన్ టైములో విరివిగా చూసిన సినిమాల్లో ఇదొకటి. క్రైం థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రానికి మౌత్ టాక్ కూడా కలిసొచ్చింది.

కన్నడ వెర్షన్ లో అనంతనాగ్ పోషించిన రిటైర్డ్ పోలీసాఫీసర్ రంజిత్ పాత్ర ఇందులో నాజర్ చేసారు. ఎప్పటిలాగానే వంకపెట్టలేని విధంగా పాత్రను పోషించారు. అలాగే కన్నడలో మైలూరు శ్రీనివాస్ పాత్రలో నటించిన నటుడు సంపత్ తెలుగులో కూడా ఆలూరి శ్రీనివాస్ పేరుతో నటించాడు. సుమన్ రంగనాథన్ అతిథి పాత్రలో కన్నడలో కనిపించిన పాత్రలోనే కనిపించింది.

కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక సస్పెన్స్ మిస్టరీ కథలో చేసే ప్రయాణానికి సరైన నేపథ్య సంగీతం చాలా అవసరం. కెమెరీ పనితనం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. దాదాపుగా కన్నడ వెర్షన్ లో వాడిన యాంగిల్స్ నే వాడారు. డయలాగ్స్ పరంగా తెలుగు వెర్షన్ కి దిద్దిన కొన్ని మెరుగులు బాగున్నాయి.

కథ విషయానికొస్తే ఎప్పుడో నలభైనాలుగేళ్ల క్రితం జరిగిన మూడు సామాన్యస్థాయి హత్యల కేసుని ఇప్పుడు తవ్వాల్సిన అవసరం హీరోకి ఎందుకొచ్చింది? కేవలం ఆసక్తా? తెలియని సెంటిమెంటా? లేక తెలిసో తెలీకో తనకి ఆ కేసుతో ఏదైనా సంబంధం ఉందా? ఈ సినిమా చూస్తున్నప్పుడు తలెత్తే ప్రశ్నలు ఇవే. అయితే లాస్ట్ సీన్లో దానికి సమాధానాన్ని చూపించాడు కథకుడు. అదొక్కటీ మొదటిసారి చూసినప్పుడు బాగుందనిపిస్తుంది.

ఈ కథలో ప్రథాన లోపం ఏంటంటే.. చనిపోయిన కుటుంబంతో తెర మీద పాత్రలకి తప్ప ప్రేక్షకులకి ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం. ఏవో కొన్ని కొన్ని సీన్స్ ద్వారా ఆ కుటుంబ పెద్ద ఎలాంటివాడో చెప్పే ప్రయత్నం చేసారు తప్ప ఆ కుటుంబాన్ని హత్య చేయించిన వాడికి భయంకరమైన శిక్ష పడాలన్న కసి ప్రేక్షకులకి కలగదు. దానివల్లనే క్లైమాక్స్ లో విలన్ చస్తున్నప్పుడు కూడా సంతృప్తి కలగదు. మూలకథ కన్నడలోనూ ఈ లోపం ఉంది. దీనిపై ఇంకాస్త వర్క్ చేసి ఆ ఎమోషన్ ని కూడా పండించి ఉంటే తెలుగు వెర్షన్ మెరుగైన సినిమా అనిపించుకునేది. బహుశా ఏది మార్చినా బెడిసి కొడుతుందేమో అన్న భయంతో యథాతథంగా తీసేసి ఉండొచ్చు.

అలాగే చాలా సన్నివేశాలు నేచురల్ గా అనిపించవు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే వ్యక్తి హీరో గారి సౌలభ్యం కోసం అన్నట్టుగా..పక్కన సెక్యూరిటీ లేకుండా ఉండడం లాంటివి టూ మచ్ గా అనిపిస్తాయి.

ఇంతకీ తెలుగులో తీసిన ఈ సినిమాకి సుమంత్, నాజర్ మొహాలు తప్ప వేరే మొహాలన్నీ కొత్తే. వెన్నెల కిషోర్ ది ఆటలో అరటిపండు పాత్ర. అది లెక్కలోకి రాదు. పెద్దగా పరిచయం లేని మొహాలు, పైగా ఒరిజినల్లో ఉన్న కన్నడ విలన్ నే పెట్టుకున్నప్పుడు మళ్లీ తీయడం ఎందుకు? డబ్బింగ్ సరిపోతుందిగా! వ్యాపారపరంగా అయితే ఓకే గానీ, నేటివిటీ అనుభూతిని కలిగించడంలో మాత్రం ఇలాంటి సగం చెక్కిన రీ”మేకులు” ఎంత గట్టిగా కొట్టినా బాక్సాఫీసు గోడలోకి దిగబడవు.

చిత్రం: కపటధారి
రేటింగ్: 2/5
తారాగణం: సుమంత్, నందిత, నాజర్, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సుమన్ రంగనాథన్, సంపత్
సంగీతం: సైమన్ కె కింగ్
ఎడిటర్: ప్రవీణ్
కెమెరా: రసమతి
నిర్మాతలు: ధనంజయన్, లలితా ధనంజయన్
దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి
విడుదల తేదీ: 19 ఫిబ్రవరి, 2021

About The Author