కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!
సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నకోవిడ్-19 వ్యాక్సిన్లు వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తాయని చెబుతున్నప్పటికీ అన్ని పరిస్థితులలోనూ 100 శాతం రక్షణ ఇవ్వలేదని నిపుణులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, వ్యాధినుంచి కోలుకున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది.ముఖ్యగా వైరస్ బారిన పడి కోలుకున్న వారు వెంటనే తమ టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చాలని దంత వైద్యులు తాజాగా సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు వచ్చిన 20 రోజుల తర్వాత వీటిని మార్చాలని పేర్కొన్నారు. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ డెంటల్ సర్జరీ అధిపతి డాక్టర్ ప్రవేష్ మెహ్రా అభిప్రాయం ప్రకారం వైరస్ నుంచి కోలుకున్నవారు తక్షణమే తమ టూత్ బ్రష్‌లను మార్చాలి. అలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా కాపాడవచ్చని చెబుతున్నారు. అంతేకాదు అదే వాష్‌రూమ్‌ను ఉపయోగిస్తున్న వారిని కూడా ఇది రక్షిస్తుందంటున్నారు. బ్రష్‌లు, టంగ్ క్లీనర్లు కూడా వైరస్‌ను వ్యాప్తి చేస్తాయనే విషయాన్ని విస్మరించొద్దని డాక్టర్ ప్రవేష్ మెహ్రా వివరించారు. ఈ వాదనను ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ (డెంటల్) డాక్టర్ భూమికా మదన్ కూడా అంగీకరించారు. సాధారణంగా ఫ్లూ, దగ్గు, జలుబు బారిన పడిన వ్యక్తులకు కోలుకున్న తర్వాత టూత్ బ్రష్, క్లీనర్లను మార్చమని తాను సిఫారసు చేస్తాననీ, ఇపుడు కోవిడ్ బాధితులకు కూడా ఇదే సలహా ఇస్తున్నామని ఆమె తెలిపారు. టూత్ బ్రష్ ఉపరితలంపై బ్యాక్టీరియా / వైరస్ దాగి ఉంటుందని ఇది శ్వాసకోశ అంటువ్యాధులకు కారణమవుతుందని డాక్టర్ వివరించారు.
టూత్ బ్రష్ ద్వారా ఎలా వ్యాప్తి చెందుతుంది?
సాధారణంగా ఒక వ్యక్తి దగ్గు, తుమ్ము, అరవడం, మాట్లాడటం లేదా నవ్వినప్పుడు విడుదలయ్యే తుంపర్లు , డైరెక్టుగా గానీ, కొంతకాలం గాలిలో ఉండిగానీ ముక్కు లేదా నోటిద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తి బ్రష్ చేసినపుడు కూడా వైరస్ ఇలాగే వ్యాప్తి చెందుతుంది. కోలుకున్న తరువాత కూడా ఈ వస్తువులను నిరంతరం ఉపయోగించడం వల్ల అధిక సాంద్రత గల సార్స్ సీవోవీ-2 వైరస్ ఇతరులకూ సోకుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటిలో ఎవరికైనా కరోనావైరస్ సంక్రమించినట్లయితే, సోకిన వ్యక్తి ఉపయోగించిన టాయిలెట్ వస్తువులను (టూత్ బ్రష్, నాలుక క్లీనర్ మొదలైనవి) బయటకు విసిరేయడం మంచిదని వీరు సూచిస్తున్నారు.