పోషకాహారం, వ్యాయామంతో కరోనాను ఎదుర్కొందాం!
కరోనాను ఎదుర్కొనడంలో అత్యంత కీలకమైన వాటిలో రోగనిరోధక శక్తి కీలకమైనది. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ వచ్చినా సులువుగా ఎదుర్కొనగలం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక మార్గాలున్నాయి. మంచి పోషకాహారం తీసుకోవడంతోపాటు తప్పనిసరిగా వ్యాయామాలు చేయడం మంచిది. కరోనా వంటి జబ్బుల నుంచి రక్షణ పొందాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. అందుకు డైట్‌తో పాటు వ్యాయామాలు కూడా చేయాలి.
* కరోనా వైరస్ నేపథ్యంలో మన ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని పదే పదే చేతులతో తాకకూడదు. అలా చేస్తే కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
* రోగనిరోధక శక్తి ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. విటమిన్లు, పోషకాలు ఎక్కువగా లభించే కూరగాయాలు తినాలి. అప్పుడే నూతన ఉత్సాహంతో పనులు చేసుకోవచ్చు
* మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు ఉండేలా చూసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఉడకబెట్టిన గుడ్డు తింటే శారీరకంగా బలం చేకూరి రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కరోనా వైరస్ బాధితులకు సైతం వైద్యులు గుడ్లు అందిస్తున్నారు.
* తాజా ఆకుకూరలు తింటే కంటిచూపు మెరుగ్గా ఉంటుందంటారు. అయితే ఆకుకూరల్లో విటమిన్లు ఎ, సి, కె లభిస్తాయి. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం శరీరానికి అందితే నూతన ఉత్సాహంగా కనిపిస్తారు.
* కరోనా సమయంలో ఉద్యోగాలు చేసేవారు వర్క్ హోం కారణంగా రోజంతా ఇంట్లోనే ఉంటూ పనిచేయాల్సి వస్తోంది. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వ్యాయామం, యోగా, ఎక్సర్‌సైజ్ లాంటి శారీరక శ్రమ చేయాలి. తద్వారా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుకోవడంతోపాటు రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు.
మంచి నీరు కూడా ఎక్కువగా తాగాలి. తక్కువగా నీరు తీసుకుంటే డీహైడ్రేట్ అవుతారు. లేక తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
*మాస్కు, శానిటైజర్, భౌతికదూరం కొనసాగించాలి*
ముఖ్యంగా కరోనా వైరస్ కు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎలాంటి మందులు లేవు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. అది పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ వైరస్ వ్యాప్తి జరగకుండా బయటకు వెళ్తున్నపుడు మాస్కు ధరించడం, శానిటైజర్ వెంట తీసుకెళ్లడం, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు భౌతిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేతులను తరచూ సబ్బు నీటితో శుభ్రం చేసుకోవడం మన దైనందిన కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలి.
*వ్యాయామం లేదా యోగా*
ప్రతిరోజూ ఉదయం యోగా లేక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి తగ్గాలి అంటే వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ తప్పక చెయ్యాలి. కనీసం రోజుకు 45నిమిషాల పాటు ఈ వ్యాయామలు చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండడానికి సహాయ పడుతుంది.
*ఆహారపు అలవాట్లు మారాలి*
కరోనా వైరస్ కు ముందు మన ఆహారపు అలవాట్లకు ఇప్పటికీ చాలా తేడా వచ్చి ఉంటుంది. దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలి. ముఖ్యంగా వేడివేడి పదార్థాలనే తినడం అలవాటు చేసుకోవాలి. ఫ్రిజ్ లో పెట్టి రెండు మూడు రోజులపాటు తినే అలవాటును మానేయాలి. కేవలం రుచికోసమే కాకుండా మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటివాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకుంటూ ఉండాలి. నిజానికి జంక్ ఫుడ్ తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు తక్కువే. ఫ్రిజ్ లో పెట్టి చల్లని నీళ్లు తాగడం మానేసి గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
*వ్యాయామం తప్పనిసరి*
మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉంటే వైరస్ లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను సులభంగా ఎదుర్కొనవచ్చు. అదే మనశరీరం ధృడంగా లేకపోతే ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. రోగ నిరోధకశక్తి కోసం కోసం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. తీసుకున్న ఆహారాన్ని శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వ్యాయామాలు చేయాలి. ఇప్పటిదాకా వ్యాయామాలు చేయడం అలవాటు లేకపోతే ఇక నుంచయినా మొదలుపెట్టాలి. వ్యాయామం అనేది రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా చేసుకోవాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా చేయాలి.
*వ్యక్తిగత పరిశుభ్రతా ముఖ్యమే*
కరోనా సమయంలోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది అవసరమే. అత్యవసరమైన పనులున్నాయని, సమయం లేదని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కొనసాగించాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు మానుకోవాలి.
*పిల్లలు, పెద్దలపట్ల జాగ్రత్తగా ఉండాలి*
పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘జ్వరం, జలుబు, దగ్గు అవేవి మామూలు రోగాలే అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. అదే తగ్గిపోతుందనుకోవద్దు. అలాగని మెడికల్ షాపు నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయకండి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు మంచి పోషకాహారం ఇవ్వాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినట్టయితే వైద్యులను సంప్రదించాలి.
*అత్యవసరం అయితేనే బయటివారిని కలవాలి*
కరోనా సమయంలో అవుట్ డోర్ మీటింగ్స్ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అత్యవసరమైతేనే వెళ్లాలి. వీలైనంత వరకు ఫోన్, ఆన్లైన్ చాటింగ్ ద్వారా పూర్తయ్యేలా చేసుకోవాలి.
==================
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*