రానున్న రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు

వేసవిని తలపిస్తున్న ఎండల్నించి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడనున్నాయి. వాతావరణంలో మార్పులు రానున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.

గత కొద్దిరోజులుగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో మరో రెండ్రోజుల్లో ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ(IMD) చెబుతోంది. జార్ఘండ్ నుంచి ఒడిశా వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..మరోవైపు ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది.

 

 ఇప్పటి వరకూ నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు..ఇక నుంచి నైరుతి నుంచి ఈశాన్యం వైపుకు వీయనున్నాయి. దాంతో వాతావరణంలో మార్పులు రానున్నాయి.

ఈ నెల 16న కోస్తాతీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో 16వ తేదీ నుంచి వర్షాలు జోరందుకునే సూచనలున్నాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో కూడా కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండ్రోజుల్లో వర్షాలు(Heavy Rains) కురవనున్నాయి.