రాయచోటి వద్ద 10 ఎర్రచందనం దుంగలతో స్మగ్లర్ అరెస్ట్

కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమల్ల గ్రామం దుగ్గన పల్లి సమీపంలోని మామిడి తోట వద్ద పది ఎర్రచందనం దుంగలతో ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాలు మేరకు కడప టాస్క్ ఫోర్స్ ఆర్ ఐ షేక్ ఆలీ భాషా టీమ్ మంగళవారం ఉదయం రాయచోటి రేంజ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. వీరు మామిడి తోట ప్రాంతానికి చేరుకునే సరికి అక్కడ కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు.  వారిని లొంగిపోవాలని హెచ్చరిస్తూ చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అందులో దుగ్గనపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి పట్టు బడగా మిగిలిన వారు పారిపోయారు. సుధాకర్ రెడ్డి ని విచారించగా, లతీఫ్ అనే వ్యక్తి ఎర్రచందనం దుంగలను సేకరించి, మామిడి తోటలో దాచి ఉంచాలని పురమాయించినట్లు తెలిపారని సిఐ చంద్రశేఖర్ తెలిపారు. పారిపోయిన వారితో పాటు, లతీఫ్ కోసం గాలుస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో నమోదు చేశారు. ఈ ఆపరేషన్ లో సిఐలు సుబ్రహ్మణ్యం, చంద్ర శేఖర్, ఎఫ్ బి ఓ రఘుపతి రాజు తదితరులు పాల్గొన్నారు.