ఆ గ్రామంలో మహిళలు, నైటీలు వేస్తె 2 వేలు ఫైన్ ..

ఆ గ్రామంలో మహిళలు, నైటీలు వేస్తె 2 వేలు ఫైన్ ..
ఆచూకీ చెప్తే వెయ్యి బహుమానం…

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు వేసుకునే నైటీలను గ్రామపెద్దలు నిషేధించారు. ఎవరైనా పగటి పూట వీటిని వేసుకుంటే రూ. 2వేల జరిమానా, చూసి చెప్పిన వారికి రూ.1000 బహుమానం ఇస్తామని ప్రకటించారు. దీనిపై గ్రామంలో ప్రచారం కూడా చేయించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో గురువారం నిడమర్రు తహశీల్దార్‌ ఎం.సుందర్రాజు, ఎస్‌ఐ విజయకుమార్‌ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకున్నారు. గ్రామపెద్దలు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికుల్లో ఏ ఒక్కరూ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. తెలుగు సంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలు ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గ్రామపెద్దలు స్పష్టం చేశారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించారు. కొల్లేరు లంక గ్రామాల్లో వడ్డి కులస్థులు ఎక్కువగా ఉంటారు. వీరిలో 9 మందిని పెద్దలుగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే శాసనం. తోకలపల్లిలో 1100 కుటుంబాలు ఉన్నాయి, 3600 మంది జనాభా ఉన్నారు. లంక గ్రామాల్లో కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా చేయకపోతే జరిమానా కట్టాల్సిందే. ఈ విధంగా వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు.

About The Author