రోజూ ఆరు గంటలే నిద్రపోయే వారిలో కొన్ని నిజాలు ….

 

రోజూ ఆరు గంటలే నిద్రపోయే వారిలో డీహైడ్రేషన్‌ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నిద్రకు, డీహైడ్రేషన్‌కు ఎలాంటి సంబంధం ఉందన్న కోణంలో అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనానికి చైనా, అమెరికాకు చెందిన యుక్త వయసు వారిని ఎంచుకున్నారు. రాత్రి 6, 8 గంటలు నిద్రపోతున్న వారి మూత్ర నమూనాలను పరీక్షించి పోల్చి చూడగా.. 6 గంటలు నిద్రపోతున్న వారిలో 16 నుంచి 59 శాతం డీహైడ్రేషన్‌ లక్షణాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
శరీరంలోని వాసొప్రెషన్‌ హార్మోనే దీనికి కారణమని తేల్చారు. ఈ హార్మోనే పగలు, రాత్రి శరీరంలో హైడ్రేషన్‌ను నియంత్రిస్తుందని చెప్పారు. నిద్రిస్తున్నప్పుడు ఆరు గంటల వ్యవధి తర్వాత ఈ హార్మోన్‌ అధిక మొత్తంలో విడుదలవుతుందని, ఒకవేళ 2 గంటలు ముందే నిద్రలేస్తే ఈ హార్మోన్‌ తగ్గి డీహైడ్రేషన్‌ బారిన పడుతున్నట్లు పరిశోధకుడు అషెర్‌ రోసింగర్‌ తెలిపారు. డీహైడ్రేషన్‌ వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు వస్తాయని హెచ్చరించారు. అయితే 6 గంటలు నిద్రపోతే దానికి తగ్గట్టు ఎక్కువ నీటిని తాగితే ఏ సమస్యా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు జర్నల్‌ స్లీప్‌లో ప్రచురితమయ్యాయి

About The Author