నాకు అల్లు అర్జున్‌ అంటే ఇష్టం: టైగర్‌ ష్రాఫ్‌…

నాకు అల్లు అర్జున్‌ అంటే ఇష్టం: టైగర్‌ ష్రాఫ్‌

 

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ కుమారుడైన టైగర్ గురువారం హైదరాబాద్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియా వర్గాలతో సమావేశమయ్యారు. తనకు టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ అంటే ఇష్టమని తెలిపారు. ఆయనతో కలిసి నటించే రోజుకోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. తన తండ్రి జాకీ ష్రాఫ్‌ తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించారని మంచి స్క్రిప్ట్‌ వస్తే త్వరలో తానూ టాలీవుడ్‌లో నటించాలనుకుంటున్నానని అన్నారు. మరో విషయం ఏంటంటే.. ఆయన బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘హీరోపంతి’..తెలుగులో బన్నీ నటించిన ‘పరుగు’కు రీమేక్‌గా వచ్చింది.ఆ తర్వాత ‘మున్నా మైఖెల్‌’, ‘బాఘి’, ‘బాఘి 2’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో యాక్షన్‌ హీరోలుగా పేరు తెచ్చుకున్నవారిలో టైగర్‌ ష్రాఫ్‌ ఒకరు. ప్రస్తుతం ఆయన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. 2012లో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. పునిత్‌ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే, తారా సుతారియా ఈ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. వచ్చే ఏడాది మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About The Author