ఎన్నికల ఏర్పాట్లను క్షణం తీరిక లేకుండా పర్యవేక్షిస్తూన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్
ఎన్నికల ఏర్పాట్లను క్షణం తీరిక లేకుండా పర్యవేక్షిస్తూన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్…
రాజధాని నగరం నుంచే ఎన్నికల ఏర్పాట్లను క్షణం తీరిక లేకుండా పర్యవేక్షిస్తూన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ శనివారం కాస్త వీలు చేసుకుని నల్గొండ జిల్లాలోని బంజారా తండాలను సందర్శించి అక్కడ పోలింగ్ బూత్‌లలో చేసిన ఏర్పాట్ల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారు. దేవరకొండ శాసనసభ నియోజక వర్గంలోని చింతపల్లి, కేశ్వ తండాలలో ఎన్నికల అధికారుల సర్వసన్నద్ధత పట్ల హర్షం వ్యక్తం చేసారు.ఈ రెండు తండాలలో దివ్యాంగులు పోలింగ్ బూత్‌ల లోపలికి సులభంగా వెళ్ళడానికి నిర్మించిన ర్యాంపులు, వాటి రైలింగ్‌ల నాణ్యతను, అందుబాటులో ఉంచిన చక్రాల కుర్చీల ఏర్పాటును ఆయన ప్రశంసిస్తూ, అక్కడే ఉన్న కొందరు దివ్యాంగులను చూసి ‘‘ఇప్పడు మీరు ఏ ఇబ్బందిలేకుండా హాయిగా, సౌకర్యంగా పోయి ఓటు వేసి రావచ్చు’’అనడంతో వారు కూడా కృతజ్ఞతాపూర్వకంగా స్పందించారు. సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన తండా స్త్రీలను ఉద్దేశించి ‘‘మీ అందరికీ ఓట్లు ఉన్నాయిగా ! ’ అనడంతో ఉన్నాయన్న సంకేతంగా వారు నవ్వుతూ చేతులెత్తారు. దానితో ‘‘ఇక్కడి యంత్రాలతో ఎలా ఓటు చేయాలో మా వాళ్ళు మీకు దగ్గరుండి చేసి చూపారుగా, ఈ సారి మీరందరూ తప్పకుండా పోలింగ్ బూత్‌కు వెళ్ళి ఓటు వేయాలి’అంటూ వారిని ఉత్సాహ పరిచారు.దీనికి ముందు తండాలలోని పోలింగ్ కేంద్రాలలోకి వెళ్ళేముందు ఒక దృశ్యం ఎన్నికల కమీషనర్‌ను విపరీతంగా ఆకర్షించింది. కేంద్రం బయటి గోడల మీద బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారుల పేర్లు వాటికి ఎదురుగా వారి టెలిఫోన్ నంబర్లు ప్రస్ఫుటంగా రాసి ఉన్నాయి. ‘‘మీరు ఏవయినా ఫిర్యాదులు చేయదలచుకుంటే అనవసరంగా హైదరాబాద్‌దాకా రావడమెందుకు, ఇవిగో ఈ నంబర్లకు ఫోన్ చేస్తే చాలు’’ అని అక్కడి తండావాసులతో చెప్పారు. వారి బాగోగులు అడుగుతూ బాగా కలిసిపోయి చనువుగా మాట్లాడిన డా.కుమార్ ‘‘ఇప్పుడు మీకు చాలామంది బయటినుండి వచ్చి ఉచితంగా తాగిస్తారు, డబ్బిస్తారు. మోసపోవద్దు. మీరు ఎవరికి ఓటు వేసేది జాగ్రత్తగా చూసుకుని మీ మనసుకు నచ్చిన వారికే ఓటెయ్యండి’’ అని సూచించారు.
తరువాత పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ‘‘ ఇక్కడ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన అలాగే కొనసాగుతాయని, వీల్ ఛైర్లను కూడా పంచాయతీ పర్యవేక్షణలో అవసరమయినవారికోసం అందుబాటులో ఉంచుతామని ఆయన తెలియ చేసారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివీ కెమెరాలు, వీడియో కెమెరాలతో, వెబ్ప్రసారాలతో నూరు శాతం నిఘా ఉంచుతామని ఆయన తెలిపారు.
జిల్లాలో ఎన్నికలకోసం సర్వసన్నద్ధంగా ఉంటూ ఏర్పాట్లను చక్కగా చేసిన అధికారులందరినీ ప్రశంసిస్తూ, ముఖ్యంగా కలెక్టర్ శ్రీ గౌరవ్ ఉప్పల్ ను, ఎస్.పి శ్రీ ఎ.వి.రంగనాథ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.