సుబ్బయ్య గారి హోటల్ గురించి మాటల రాతల మాంత్రికుడు హరిబాబు గారి మాటల్లో



శ్రీ కృష్ణా విలాస్ అంటే తెలీకపోవచ్చు గాని సుబ్బయ్యగారి హోటలంటే ఎవర్నడిగినా చెప్తారు కాకినాడలో అని..

ఏదైనా పనుండి కాకినాడొచ్చినోళ్ళు ఎవరైనా సరే ఓ సారి సుబ్బయ్య హొటేలుకెళ్ళి భోజనం చేయాలనుకుంటారు.. మనం ఒద్దు ఒద్దంటున్నా వినకుండా బలవంతం చేసి మరీ ఆకునిండా మొత్తం ఇరవై అయిదు రకాల ఐటెంసేసి పెట్టే సుబ్బయ్య హొటేలు భోజనం అంటే అంత ఫేమస్సు మరి.. ఎన్టీ రామారావుగారైతే అప్పట్లో తూగోజీ ఎప్పుడొచ్చినా ఇక్కడ భోజనం చెయ్యకుండా వెళ్ళీవోరు కాదని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు..

1940 లో కట్టిన పాతకాలం బిల్డింగులోకి అడుగెట్టగానే ఎక్కడికక్కడ కిటకిటలాడిపోయే జనాన్ని చూసి అది హోటలో లేక సత్రమో అర్ధంగాదు మనకి చాలాసేపు.. జనాన్ని చూసి కంగారు పడకండి.. రష్ ఎంతుంటాదో వడ్డింపు అంత స్పీడుగా ఉంటాది.. వడ్డన కుర్రోళ్ళు పిచ్చెక్కిస్తారు.

ఎంట్రన్సులో ఉన్న కౌంటర్లో టేబుల్ మీదెట్టిన నేతిబూరెలు, పాకంగారెలు, పులిహోరపొట్లాలు చూడగానే నోట్లో నీళ్లూరతాయ్.. ధైర్యం తెచ్చుకుని డైనింగ్ సెక్షనులోకి అడుగెడతాం…

ఎళ్ళగానే పెద్ద సర్వరెదురొచ్చి చుట్టానికి మర్యాద చేసినట్టు చేసి, కూర్చోబెట్టి ఆకేసి మిగతావోళ్ళని కేకేస్తాడు “రేయ్.. రాండ్రా” అని..

అంతే..

రైల్వే గేట్ దాటుతున్న గూడ్సుబండి బోగీల్లాగా ఎంతకీ తరగని ఐటమ్స్ అన్నీ సర్వర్ కుర్రోళ్ళ చేతుల్లోంచి ఒకదానెనకాల ఒకటి వస్తానే ఉంటాయి..

అన్నిటికంటే ముందు మజ్జిగావడలో బూందీ పలుకులు చల్లి మీ ముందెడతారు.. మీరు చేతిలోకందుకుని దాంతో మొదలెడతారు.. కళ్ళు మూసుకుని తింటా ఉండగానే పులిహోర, ఫ్రైడ్రైసు, చపాతీ ఒకదానెనకాలొకటి రెండు రకాల కూరలు, చట్నీలు, పచ్చళ్ళతో సహా మీ అరిటాకు ప్లేటులో ప్రత్యక్షమైపోతాయ్..

ఏ మాటకామాట.. ఎప్పుడు పడ్డాయో కూడా తెలీకుండా ఆ కుర్రోళ్ళు ఆకులోకి యేసే స్పీడ్ జూత్తే ముచ్చటేస్తాది..

“అబ్బే నేను పులిహోర కలుపుతాను తప్ప తినను, ఫ్రైడ్ రైస్ నాకు పడదు” అని మనమంటే ఆళ్ళు వినరు.. “బోంటాది సార్ తినండి” అని ఇంటికొచ్చిన చుట్టాన్ని బలవంతం జేసినట్టు జేత్తారు.. మనం కూడా ఐసైపోయి అలాగే తింటాం.. బాగానే ఉందనుకుని అప్పటికే ముప్పాతిక ఫుల్లయిపోయిన పొట్ట తడుముకుంటాం.. ఓపక్క కుడిచేత్తో తింటుంటాం ఇంకోపక్క ఎడంచేత్తో వొద్దు.. వొద్దు.. చాలు.. చాలు.. అని చెయ్యూపుతానే ఉంటాం.. ఈ హోటల్లో తినేవాళ్ళకి రెండు చేతులకి పనే అని అప్పుడర్ధమవ్వుద్ది..

ఆగండాగండి.. అది ట్రైలరంతే.. ఇప్పుడసలు సినిమా స్టార్టవ్వుద్ది..

పొగలు కక్కుతున్న తెల్లన్నాన్ని బేసిన్లతో పట్టుకొచ్చిన పెద్ద సర్వరు స్టార్ హోటళ్లలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్లాగా వయ్యారంగా చేతులు విదల్చకుండా, స్టీలు హస్తంతో తీసి ఒకే ఊపుతో హస్తంతో సహా అన్నాన్ని మొత్తాన్ని ఆకులోకి ఒంపుతాడు.. అదీ పద్దతంటే..పెట్టే మనసేంటో అక్కడ తెలుస్తాది.. ?

“కరేపాకు పొడి సార్, కందిపొడి సార్, నెయ్యి సార్, ఇది దోసవకాయ టేస్ట్ చెయ్యండి..” అని పేరుతో సహా చెప్పి మరీ ఆప్యాయంగా వడ్డింతారు అన్నంలోకి పొడులు, పచ్చళ్ళు.. “ఇది బీట్రూట్ పచ్చడి.. ఆరోగ్యం” అని సలహాలిచ్చి ఒక చెమ్చాడు ఆకులో ఏసిగాని ముందుకి కదలడు ఇంకో ఎర్రరంగు బనేలు కుర్రోడు..

క్యారెట్-కొబ్బరి, దొండకాయ ఫ్రైల్లో ఏది కలుపుకోవాలో తెలీక మామిడికాయ పప్పు మీదకి మనసు లాగుతుంటే స్టక్కయిపోతాం మనం.. ఈలోగా గుళ్లో ఉండే దేవుడి విగ్రహాల్ని చేతి వెళ్ళకే ఉంగరాలుగా పెట్టుకున్న ఓ నల్లటి పెద్దమనిషి మనదగ్గరికొచ్చి “ఇది ఈరోజు స్పెషల్ ఐటమ్ సార్..” అన్జెప్పి మసాలా కూరి, జీడిపప్పు చల్లిన గుత్తివంకాయని ఆకు చివర్న నింపాదిగా పెడతాడు.. ఆ పెద్దమనిషే ఆ హోటలు ఓనరని మనకి అర్ధమయ్యిలోపులోనే ఆ గుత్తివంకాయ మన నోట్లో కమ్మగా కరిగిపోయి, అరిగిపోద్ది.. ఆటోమేటిగ్గా, మన సిస్టం కూడా హెవీ అయిపోద్ది… అలాగని ఏదీ వొదిలెయ్యడానికి మనసొప్పదు.. దేని రుచి దానిదే అన్నట్టు పోటీ పడతుంటాయ్..

రైస్ సార్ అని మరోసారి బేసిన్తో రెడీ అయిపోతాడు ఇందాకటి కుర్రోడు..

ఇంకెక్కడేట్టుకోమంటావ్ అని గుడ్లురిమి “పెరుగు పట్రా” అంటాంగానీ, “పెరుగా.. అప్పుడే.. ఇంకా సాంబారుంది, ఉలవచారుంది, మజ్జిగపులుసుంది..” అని ఆ కుర్రోడు మళ్ళీ లిస్టు చదివేసరికి కళ్ళు బైర్లు కమ్మి కడుపట్టుకుంటాం.. ఇక మనవల్ల కాదన్నట్టు సప్లయర్ వొంక జూత్తాం గానీ ఆళ్ళు వొదిలితే కదా..

ఎర్రమట్టి దాకలో తోడెట్టిన పెరుగుబిళ్ళ తీసి “సుబ్బయ్యగారి పేరుగండీ” అని వొడ్డింతారు.. పన్లోపని బట్టర్ మిల్కు కూడానండోయ్.. దాంతోపాటే ఆరోజు ఏ స్పెషలుంటే ఆ స్పెషలు స్వీటు, కిళ్లీ కూడా కామననుకోండి..

ఇలా “పెట్టి పెట్టి సంపేత్తార్రా బాబూ” అంజెప్పడానికి కాకినాడ సుబ్బయ్యగారి హోటేలనండీ ఉదాహరణ..

ఒకేళ అక్కడ తినలేమనుకుంటే పార్సిల్ ఫెసిలిటీ కూడా ఉంటాది.. మా ఏరియాలోనే ఫేమస్ అయిన బుట్టభోజనం పార్సిల్ కూడా పట్టుకెళ్లొచ్చు..

తాటాకుబుట్టలో వేడేడి అన్నం సగంపైగా పెట్టి దానిమీద అడ్డుగా కోసిన అరిటాకు అడ్డేసి, అందులో రెండు కూరలేసి, మళ్ళీ ఇంకో అరిటాకు అడ్డేసి, దాని మీద తీపి బూందీగానీ, గొట్టంకాజాలు గాని పెట్టి మళ్ళీ ఆకేసి అందులో పచ్చళ్ళు పెట్టి.. ఇలా దొంతలుగా ఇచ్చే బుట్టభోజనం ఈజీగా ఇద్దరు, ముగ్గురికి సరిపెడతాది.. చుట్టుపక్కల లారీ డ్రైవర్లు, క్లీనర్లకి, ఇంకా చిన్నపాటి పనులు చేస్కునేవాళ్ళకి తక్కువలో ఇలాంటియ్యే కదండీ కడుపు నింపేది మరి..

ఈళ్ళు పెట్టే క్వాంటిటీ సరే గానీ క్వాలిటీ మాట ఏంటంటారా.. ?

ఇత్తడి గుండిగలో వొండిన అన్నం ఒంటికి వేడి జెయ్యకుండా నోటికి కమ్మగా ఉంటాదని నమ్మిన సుబ్బయ్యగారి కాలంనించీ ఉన్న నమ్మకాన్ని, క్వాలిటీని ఆయన పోయాకా కూడా అలాగే మైంటైన్ చేసుకుంటా వస్తన్నారు సుబయ్యగారి కొడుకులు కూడానూ..

ఇత్తడి గుండిగల్లో వొండిన అన్నం వార్చేసాక తెల్లగుడ్డకప్పి తేమనంతా లాగేసి పొడిపొడిగా ఉండేలా జేస్తారు.. కొబ్బరాకులు మీద పులిహోర కలుపుతారు.. బూరెలకి, గారెలకి మినప్పిండిని రుబ్బురోల్లో రుబ్బితే మసాలాలనేమో రోట్లో దంచుతారు..
ఈటికి ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టి మరీ ఇలాంటి పద్ధతులు, పరికరాల మీదే జేయిస్తారు తప్ప మిషన్లమీద ఆధారపడటం తక్కువంటారు తెల్సినోళ్లు.. ఎంతవరకూ నిజమో మరి..

ఈమధ్యకాలంలో ఈ ముగ్గురన్నదమ్ములు ఎవరికీ వాళ్ళు విడిపోయి సొంతంగా పక్కపక్కనే ఇంకో రెండు రెస్టారెంట్లు పెట్టుకున్నాకా క్వాలిటీ తగ్గిపోయి, ఏదో పాతకాలం బ్రాండింగ్తో నడిపించేస్తన్నారని అక్కడక్కడా ఇనబడద్ది గానండీ, ఎప్పుడో 1940లో గునుపూడి సుబ్బయ్యగారు పెట్టిన హోటల్కున్న మంచి పేరైతే ఈళ్ళెవరూ చెడగొట్టలేదనే అందరి అభిప్రాయం.. ఇప్పుడు హైదరాబాద్లో కూడా kphb దగ్గర బ్రాంచ్ పెట్టేరని విన్నాను.. దగ్గర్లో ఉన్నోళ్లు వీలైతే ఓసారెళ్లి తినొచ్చి చెప్పండి ఎలా ఉంది యవ్వారం ఏంటి అనేది.. అలాగే కాకినాడొచ్చేవాళ్ళు కూడా కోటయ్యగారి కాజాలతో పాటు సుబ్బయ్యగారి హోటలుకెళ్ళి చూసి రాండి ఓసారి.. “ఓసోస్ ఈమాత్రం దానికి కాకినాడదాకా రావాలేంటి, ఈ మాత్రం ఐటెమ్స్, టేస్టు మా దగ్గర ఉన్న వేరే హోటళ్లలో కూడా దొరుకుతాయి” అని మీరనొచ్చుగానండీ ఓపక్క ప్రేమని కలిపి వొండే వంటా, ఇంకోపక్క ఆప్యాయంగా బంధువుకి తినిపించినట్టు చేసే వడ్డన, ఈళ్ళు జేసే మర్యాద మాత్రం ఇంకెక్కడా నేను చూళ్ళేదండీ..

ఇక్కడ వడ్డించేవోళ్ళందరూ మిమ్మల్ని అందరూ “అయ్యగారు” అని పిలుత్తారు లేదంటే సాగదీసుకుంటా “సార్” అంటారు.. ఏమని పిల్చినా గానీ మావోళ్లకి మాత్రమే సొంతమైన “అండీ” అని మాత్రం చివర్లో తప్పకుండా ఉంటాదండీ.. ఆయ్..

About The Author