భారీ అగ్నిప్రమాదం: తొమ్మిది మంది అధికారులు సజీవదహనం


కోల్‌కతా: కోల్‌కతాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కోల్‌కతాలో తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈప్రమాదంలో తొమ్మిదిమంది అధికారులు అగ్నికి ఆహూతైపోయారు. వీరిలో ఒక పోలీసు ఉన్నతాధికారితో పాటు నలుగురు ఫైర్‌మేన్లు ఇద్దరు రైల్వే ఆఫీసర్లు, ఒక సెక్యూరిటీ ఆఫీసర్‌ ఉన్నారు. తొమ్మిది మృతదేహాలలో ఐదు మృతదేహాలను 12 వ అంతస్తులోని లిఫ్ట్‌లో కనుగొన్నారు. వారంతా లిఫ్ట్‌లోపల ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొంతమంది కనిపించకుండా పోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరణించిన నలుగురు అగ్నిమాపక సిబ్బంది గిరీష్ డే, గౌరవ్ బెజ్, అనిరుద్ద జన, బీమన్ పుర్కాయత్‌గా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతులకు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అటు ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారుత్వరగా కోలుకోవాలంటూ ప్రధానిమోదీ ట్విట్‌ చేశారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రమంత్రి ఆదేశించారు.

About The Author