యువకుల్లోనూ మతిమరుపు.. ఆందోళన, ఒత్తిడి కారణం…
మానసిక ఆందోళన, ఒత్తిడి, ఈ రెండూ మతిమరుపుకి ప్రధాన కారణం. ఈ రెండు జీవితంలో వదిలించుకోలేకపోతే మతి మరుపు 50ఏళ్లకి లోపలే మిమ్మల్ని ఆవహిస్తుంది. మెదడు కూడా పనిచేయడం మందగిస్తుంది. మెదడులోని క్వార్టిజాల్ అనే హార్మోన్ మెదడు పనితీరుకు ఇంధనంగా పనిచేస్తుంది. దీన్నే స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఇటీవల కాలంలో యువకుల్లో కూడా ఆందోళన, ఒత్తిడిలతో మతిమరుపు వ్యాధి వస్తోందని సాధారణంగా 65ఏళ్ల పైబడినవారిలో వచ్చే జబ్బు 35ఏళ్లవారిలో కూడా గమనిస్తున్నామని కాలిఫోర్నియా యూనివర్సిటీ నరాల వ్యాధి నిపుణులు ఒక నివేదికలో పేర్కొన్నారు. మనిషిలో ఒత్తిడి, ఆందోళన పెరిగినప్పుడు అడ్రినల్ గ్రంథులు క్వార్టిజాల్ హార్మోన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో ఈ హార్మోన్ శరీరంలోని ఇతర భాగాల పనితీరుపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి తగ్గించుకోకపోతే దీని ఫలితంగా గుండె జబ్బులు, తలనొప్పి, ఊబకాయం, నిద్రలేమి, ఏకాగ్రత కొరవడటం వీటన్నిటికి తోడు మతిమరుపు పైనపడటం జరుగుతుంది. మన దేహంలో అత్యంత ఆకలితో ఉండే అవయవం మెదడు. దానికి సరైన పోషకాలు, ఆక్సిజన్ లభిస్తేనే అది ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఆందోళన, ఒత్తిడులతో ఉంటే మతి మరుపు అనివార్యం అవుతుంది.