పాశుపత వ్రతం – : శివసాయుజ్యాన్నిచ్చే మహత్తర వ్రతం…
పాశుపత వ్రతం – :
శివసాయుజ్యాన్నిచ్చే మహత్తర””వ్రతం””
శైవ సంప్రదాయంలో ఓ మహత్తర వ్రతముంది. శివసాయిజ్యాన్ని పొందడానికి దానిని మించిన వ్రతం మరొకటిలేదని లింగపురాణం చెబుతోంది. అసలు పశుత్వం అంటే ఏమిటి?, దాన్ని ఎవరు పొందారు?, అది పోగొట్టుకోవడానికి శివుడు వారిని చేయమన్న పనులేమిటి? తదితర విషయాలు లింగపురాణం శివ విజ్ఞాన వీచిక ఎనభయ్యో అధ్యాయంలో ఉన్నాయి.
పశుపతి అంటే ఆ పరమేశ్వరుడే. పశుత్వాన్ని పారదోలి ధ్యానమార్గం వైపు నడిపించగలిగే దివ్యశక్తి ఆ శివశక్తి మాత్రమే. అందుకే ఒకసారి దేవతలంతా కలసి ఆ పశుపతి దర్శనం కోసం బయలుదేరారు. కైలాసంలోని మహోన్నత శిఖరం మీద భోగ్యం అనే శివసన్నిధానానికి వారు చేరారు. శ్రీహరి ముందుగా గరుడ వాహనాన్ని దిగి నడక ప్రారంభించాడు. భోగ్యం అనే ఆ పట్టణం ఉన్న దివ్య ప్రదేశమంతా ఎంతో ఆనందంగా సంచరిస్తున్న మృగాలతో నిండి ఉంది. అక్కడ మంద్రగతిలో మధుర గానం వినిపిస్తోంది. ఆ కొండచరియల వెనుక వైపు అంతా చీకటిగా ఉంది. మనోహరాలైన పిల్లగాలులు వీస్తున్నాయి. సెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి. చుట్టుపక్కలంతా అసంఖ్యాకంగా దివ్యభవనాలు ఉన్నాయి. మెల్లమెల్లగా నడిచే రాజహంసలు, చందనాది వృక్షాలు ఇలా ఆ ప్రదేశమంతా సుందరంగా ఉంది. అలాంటి రమ్యమైన ప్రదేశంలో కొద్దిగా ముందుకు నడిచి వెళ్ళే సరికి భోగ్యం అనే ఆ నగరపు తొలి ప్రాకార మహాద్వారం కనిపించింది. శ్రీహరి, బ్రహ్మదేవుడు దానిలోకి ప్రవేశించి రెండు, మూడు ప్రాకారాలను దాటారు. అక్కడ కొందరు దేవతా రమణులు శ్రీహరి మీద పూలు, కుంకుమ, అక్షతలను చల్లి స్వాగతించారు. ఇలా పదో ప్రాకారం దాటి పదకొండో ప్రాకారం దగ్గర ఉన్న మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించారు బ్రహ్మ, విష్ణులు. అక్కడ సూర్యమండలాన్ని పోలిన స్ఫటిక మణిమయ మంటపం ఒకటి కనిపించింది. అది అనేక అలంకరణలతో ఉంది. దానికి ఇరవై ఎనిమిది మహాద్వారాలు, అంతరాళాలు ఉన్నాయి. ఆ లోపలే కుమారస్వామి, గణపతి, ప్రమద గణాల నివాసాలు ఉన్నాయి. శ్రీగంధ వృక్షాలతో కూడిన ఉద్యానవనాలతోనూ, సువర్ణ సోపానాలతోనూ చక్కటి దిగుడుబావులు, సరస్సులతోనూ ఆ సౌధం విలసిల్లుతోంది. రాజహంసలు, నెమళ్ళు, కోయిలలు, చక్రవాక పక్షులు ఇలాంటి వాటన్నిటితోనూ ఎంతో మనోహరంగా ఆ ప్రదేశమంతా కనిపించింది. సంగీతాన్ని శ్రావ్యంగా ఆలపిస్తూ వేలాది రుద్ర కన్యలు అక్కడ ఉన్నారు. అప్సరసలు అందంగా నాట్యం చేస్తున్నారు. అలాంటి మహేశ్వర నివాసాన్ని చూసి శ్రీహరి, ఆయన వెంట వచ్చిన దేవతలంతా ఎంతో విస్మయం చెందారు. అక్కడే వేలకొద్దీ రుద్రగణాలు, మరిన్ని స్ఫటిక సౌధాలు, యక్షులు, కిన్నెరులు, సిద్ధకన్యలతో ఆ భవనాలు ఉన్నాయి. మరికొంత ముందుకు వెళితే పరమేశ్వరుడు ఉండే మందిర ద్వారం కనిపించింది. నందికేశ్వరుడు ఆ ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. దేవతాగణాలన్నీ తరలి రావడాన్ని చూసి అలా రావడానికి కారణమేమిటి అని నందీశ్వరుడు వారిని అడిగాడు. అప్పుడు శ్రీహరి, ఆయనతోపాటు వచ్చిన దేవతలు ముక్తకంఠంతో ‘త్రిపురాసుర సంహార సమయంలో దేవతా గణాలన్నీ సంసారపాశబద్ధులై పోయాయి. ఆ కారణంగా పశుత్వం (అజ్ఞానం) ప్రాప్తించింది. సంసార పాశాలను ఇకనైనా ఛేదించుకొని పశుత్వాన్ని వీడి జ్ఞానమయ జీవితాలను గడపాలని వేడుకోవడానికి వచ్చాం’ అని నందీశ్వరుడితో చెప్పారు. దాంతో నంది వారందరినీ లోపలికి ప్రవేశపెట్టాడు. అక్కడ దివ్య సింహాసనం మీద కూర్చున్న పార్వతీపరమేశ్వరులకు దేవతలంతా నమస్కరించి విషయమంతా చెప్పి తమను అనుగ్రహించమన్నారు. అప్పుడు ఆ పశుపతి పశుత్వాన్ని పోగొట్టుకునే ఉత్తమ వ్రతం ఒకటుందని, అదే పాశుపత వ్రతమని తెలిపాడు. ఆ వ్రతం భస్మ ధారణాత్మకం, భస్మరుద్రాక్ష ధారణాత్మకం, భస్మరుద్రాక్ష మంత్ర ధారణాత్మకం, భస్మరుద్రాక్ష మంత్ర శివలింగ ధారణాత్మకం అని నాలుగు విధాలుగా ఉంటుంది. వీటిలో మొదటి దానికన్నా రెండోది, దాని కంటే మూడోది, దాని కంటే నాలుగోది ఎంతో శ్రేష్ఠమైనవి. మొదటి రెండు విధానాలనూ పన్నెండు సంవత్సరాలపాటు కానీ, పన్నెండు రోజులపాటు కానీ ఓపికను బట్టి చేయవచ్చు. మూడు, నాలుగు విధానాలను జన్మాంతం ఆచరించాల్సి ఉంటుందని పరమేశ్వరుడు పాశుపత వ్రతాన్ని, దానిలోని విధానాలను వివరించి ఎవరికి వీలైన విధానాన్ని వారు ఆచరించి పశుత్వాన్ని పోగొట్టుకొని జ్ఞానసంపన్నులు అవ్వండని ఆశీర్వదించాడు. ఆ వ్రతం తన సాయిజ్యాన్ని పొందేందుకు పనికొచ్చే చక్కటి సోపానం లాంటిదని పాశుపత వ్రత మహత్వాన్ని ఆ స్వామి వివరించి చెప్పాడు. ఈ వ్రతాచరణం ఎంతో ప్రశస్తమైందని అనుభవజ్ఞులైన పెద్దలు చెబుతున్నారు..!!