హెచ్ ఐ వి తో పోరాడుతూ , జీవితాన్ని ఎదురీదుతూ …
హెచ్ ఐ వి తో పోరాడుతూ , జీవితాన్ని ఎదురీదుతూ …
హెచ్ ఐ వి బాధితులకు అండగా , నీడగా …
ఆమె పేరు టి. లక్ష్మి. హెచ్ఐవీ బాధితురాలు. భర్తతో కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ఆమె ఆ తరువాత తనలాంటివారికి సాయం చేసే స్థాయికి చేరుకుంది. అదెలా సాధ్యమయ్యిందంటే…
మాది మధ్య తరగతి కుటుంబం. నాకు పదిహేడేళ్లప్పుడు పెళ్లిచేశారు అమ్మానాన్న. గర్భం దాల్చిన ఎనిమిది నెలలకు పరీక్షలకని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు నాకు హెచ్ఐవీ ఉందని తెలిసింది. కానీ నాకు ఆ వ్యాధి లేదని వైద్యులతో వాదించా. వాళ్లేమో ‘పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి సోకకుండా చూడొచ్చు…’ అని చెప్పారు. మావారికి కూడా పరీక్షలు చేస్తే పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఇద్దరం చనిపోవాలనుకున్నాం. చివరి నిమిషంలో కడుపులో బిడ్డ గుర్తొచ్చి మా ఆలోచనను విరమించుకున్నాం. కాన్పు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కేజీహెచ్‌లో హెచ్ఐవీ-ఎయిడ్స్ కౌన్సెలర్‌గా పనిచేసే శైలజా మేడమ్ సాయం తీసుకున్నాం. బాబు పుట్టాడు.
కార్యకర్త నుంచి అధ్యకురాలిగా… తనవల్లే నేనిలా అయ్యానని మావారు మానసికంగా కుంగిపోయారు. తాగుడుకీ బానిసయ్యారు. పైగా జబ్బు విషయం అత్తయ్య వాళ్లకు తెలియడంతో మమ్మల్ని చిన్నచూపు చూసేవారు. చివరకు ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని బాబుకు రెండేళ్లున్నప్పుడు చనిపోయారు. మావారి మరణానికి కారణం నేనేనని అత్తింటివారు నన్ను వేధించేవారు. దాంతో పుట్టింటికి వచ్చేశా. మందులు వాడుతూ బాబుని చూసుకుంటూ బతికేదాన్ని. మా చుట్టాలు నాకు మరో పెళ్లి చేస్తామని అనడంతో అసలు విషయం చెప్పా. ఆ సమయంలో నేనూ డిప్రెషన్లోకి వెళ్లిపోయా. అప్పుడే శైలజా మేడమ్ ‘సొసైటీ ఆఫ్ విశాఖ నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ మెంబర్స్ (ఎస్వీఎన్పీ ప్లస్)’ సంస్థ గురించి చెప్పి చేరమన్నారు. దీన్ని ఏడుగురు సభ్యులతో జామీ శ్రీనివాస్ అనే వ్యక్తి 2005లో ప్రారంభించారు. ఏ మాత్రం ఆలోచించకుండా అందులో చేరిపోయా. ఆ సంస్థ ప్రతినెలా యాక్ట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది. హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు తమ సమస్యలను ఇతర బాధితులతో పంచుకునేవారు. వాటికి నేనూ వెళ్లేదాన్ని. మొదట్లో ఏడుగురు ఉండేవారు. ఇప్పుడు మా జిల్లావ్యాప్తంగా దాదాపు 12,000 మంది హెచ్ఐవీ బాధితులున్నారు. తరువాత ప్రభుత్వం ‘ఆశా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా స్వయంసహాయక బృందాలకు, యూత్ లీడర్స్‌కు శిక్షణ ఇస్తూ హెచ్ఐవీపై అవగాహన కల్పించాలి. అలాగే హెచ్ఐవీ రోగులకు ఆరోగ్యపరీక్షలు చేయించడం, క్షయ ఉంటే మందులు వాడేలా చూడటం మరో ప్రాజెక్టు లక్ష్యం. వీటికి నేను కార్యకర్తగా మారా. ప్రతి రెండేళ్లకు మాకు ఎన్నికలు జరుగుతాయి. బాధితులంతా కలిసి సంస్థ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జామీ శ్రీనివాస్ 2011లో చనిపోయారు. అప్పటినుంచీ నేను అధ్యక్ష్యురాలిగా ఉన్నా.
ఉపాధీ కల్పిస్తాం… విహాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా హెచ్ఐవీ రోగులకు కౌన్సెలింగ్ చేస్తాం. మందులు వాడే విధానం, వాళ్ల జీవనవిధానం ఎలా ఉండాలీ, మందుల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను ఎలా అధిగమించాలనేదీ వివరిస్తాం. హెచ్ఐవీ పాజిటివ్ వల్ల డిప్రెషన్‌కు గురైన వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. అలాగే జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ మండలి సాయంతో హెచ్ఐవీ బాధితులకు ముఖ్యంగా మహిళలకు పోషకాహారం, సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. 2005 నుంచి ఇప్పటి వరకు యాభై మూడు మందికి ఇళ్లు ఇప్పించాం. దాదాపు 200 మందికి ఆరోగ్య బీమా కల్పించాం. కొంతమందికి కొవ్వొత్తులు, ఫినాయిల్, డిటర్జెంట్ పౌడర్, సబ్బుల తయారీ నేర్పించాం. ఆ తరువాత వాళ్లకో ఉపాధి మార్గం చూపించాం. 50 మందికి టైలరింగ్‌లో శిక్షణే కాదు, కట్టుమిషన్లూ ఇప్పించాం. అనాథ పిల్లలకు ఐసీటీఎస్ కార్యక్రమం కింద నెలకు అయిదు వందల రూపాయలు అందేలా చూస్తున్నాం. నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూనే ఇవన్నీ చేస్తున్నా.