స్కూళ్లు తెరిచిన వారంలోనే పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు..
*తల్లిదండ్రుల్లో ఆందోళన..*
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరిచిన తొలి వారంలోనే 1,500 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అటు పిల్లల తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితుల్లో స్కూళ్లలో హాజరు శాతం 40 శాతం మాత్రమే కనిపిస్తోంది. పెరుగుతున్న కేసుల కారణంగా మరింత తగ్గుతున్నట్టుగా ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఆందోళన లేదంటుంది. తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా నియంత్రణపై అన్ని చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటున్నారు.
కొత్తగా బయటపడిన కేసులెన్ని?
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 3,05,473 గా ఉంది. మొత్తం 41,623 ప్రభుత్వ స్కూళ్లుండగా, వాటిలో 1.81 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. వారిలో ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న వారు 71,634 మంది. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 25,574 మంది టీచర్లు పనిచేస్తుండగా, హైస్కూళ్లలో 84,146 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు.
కరోనా కారణంగా లాక్ డౌన్ అనంతరం నవంబర్ 2 నుంచి ఏపీలో ప్రాధమిక పాఠశాలలు తెరిచారు. నెల రోజుల కిందటి నుంచే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక 9, 10 తరగతులతో పాటుగా ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థుల కోసం కాలేజీలను కూడా తెరిచారు.
స్కూళ్లు తెరుస్తున్న సందర్భంగా ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు ఉపాద్యాయుల కోవిడ్ బారిన పడినట్టు పరీక్షల్లో తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5వ తేదీ సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 829 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.
మొత్తం 70,790 మందికి పరీక్షలు నిర్వహించగా 1.17 శాతం మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. అంటే ఇప్పటికే దాదాపు సగం మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో 95,723 మందికి పరీక్షలు చేశారు. వారిలో 575 మందికి (0.6 శాతం మందికి) కరోనా సోకినట్లు తేలింది.
*ఆందోళన అవసరం లేదు:*
విద్యాశాఖ డైరెక్టర్
ప్రస్తుతం బడులు తెరిచిన తర్వాత కొత్త కేసులు వెలుగు చూడడం పట్ల ఆందోళన అవసరం లేదని ఏపీ విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు అంటున్నారు.
”కేసులు పెరుగుతుండడం పట్ల చింతించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి, పరీక్షలు చేయడం వల్ల ఈ కేసులన్నీ వెలుగు చూస్తున్నాయి. కరోనా సోకిన వారిని ప్రారంభంలోనే గుర్తించడం వల్ల ఇతరులకు అది సోకకుండా నివారించగలిగుతున్నాం. ప్రస్తుతం అన్ని రకాల సురక్షిత మార్గాలు అన్వేషిస్తున్నాం. పూర్తిగా కరోనా నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. విద్యార్థుల కోసం అన్ని రకాలుగానూ రక్షణ చర్యలు తీసుకున్నాం. పిల్లల్లో అవగాహన పెంచుతున్నాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించకపోతే ఇన్ని కేసులు బయటపడేవి కాదు. పేద విద్యార్థుల సంరక్షణకు అనుగుణంగా పాఠశాల, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటున్నారు” అని వివరించారు.
”ఈ పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడం శ్రేయస్కరం కాదు”
కరోనా కేసుల సంఖ్యను బట్టి వైరస్ వ్యాప్తి తగ్గిందనే అభిప్రాయానికి రాకూడదని ప్రముఖ డాక్టర్ ఎస్ భక్తియార్ చౌదరి అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ పాఠశాలల్లో క్లాసుల నిర్వహణ శ్రేయస్కరం కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ”కరోనావైరస్ మ్యుటేషన్‌తో రూపాన్ని మార్చుకుని, ఎటువంటి లక్షణాలు లేకుండానే పలువురు మరణిస్తున్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్ కన్నా వివిధ రకాల రూపాల్లో వైరస్ ఉన్న ఒకరికే సోకడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎక్కువ మంది వైద్యులు, సిబ్బంది మరణించడానికి ఇదే కారణం. ఇప్పుడు విద్యార్థులకు స్కూళ్లు తెరిచిన తర్వాత తరగతి గదులలో వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇది మరింత ప్రమాదం. ప్రభుత్వం తరగతుల నిర్వహణపై పునరాలోచన చేయాలి” అని సూచించారు.
”ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు.. వచ్చిన వ్యాక్సిన్ ఏమేరకు పనిచేస్తుందో తెలీదు. ధీమా లేదు. ఇలాంటి సమయంలో క్లాసుల నిర్వహణ ద్వారా పెను ముప్పు ఉంటుందని అంతా గ్రహించాలి. ప్రస్తుతం వైరస్ తగ్గిందనే వాదన సరికాదు. అనేక మందికి నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు.. నిర్ధారణ అయిన వారందరినీ రికార్డులలో పేర్కొనడం లేదు. కాబట్టి మరిన్ని జాగ్రత్తలు చాలా అవసరం” అని ఆయన అభిప్రాయపడ్డారు.
”భయంతోనే విధులు నిర్వహిస్తున్నాం..”
లాక్‌డౌన్ కాలమంతా ఎన్ని జాగ్రత్తలు పాటించినా ప్రస్తుతం విధులకు హాజరుకావడం తప్పనిసరి కావడంతో భయంతోనే విధులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇటీవల కరోనా కారణంగా పలువురు విధుల్లో ఉన్న ఉపాధ్యాయులతో పాటుగా రిటైర్ టీచర్లు కూడా మృత్యువాత పడ్డారు.
తాజాగా చిత్తూరు జిల్లా బీఎన్ కండ్రిగ మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ దినేష్ కరోనా కారణంగా చికిత్స పొందుతూ మరణించారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయులు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 12 మంది ఉన్నట్టు తాడేపల్లిగూడేనికి చెందిన ఉపాధ్యాయుడు ఎం సత్యన్నారాయణ బీబీసీకి తెలిపారు.
”మేము ఇప్పుడు రోజూ పట్టణాల నుంచి స్కూళ్లకు వెళుతున్నాం. ప్రయాణాల సమయంలో అనేక మందిని కలవాల్సి వస్తోంది. ఇక పిల్లల్లో కూడా ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందన్నది తెలియడం లేదు. ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడుతున్నట్టు లెక్కలే చెబుతున్నాయి. మా స్కూల్లో కూడా 25 మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తే ఇద్దరికి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వారి కారణంగా మిగిలిన పిల్లలను కూడా హోం ఐసోలేషన్ లో పెట్టాల్సి వచ్చింది. వారి కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉన్నారు. మరో ఒకటి రెండు వారాల పాటు ఇలానే ఉంటుందని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మా అధికారులు చెబుతున్నారు. మాకు మాత్రం ఆందోళన కలిగిస్తోంది” అని వివరించారు.
*కలవరం అవసరం లేదు:*
వైద్యశాఖ మంత్రి
ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో కరోనా కేసులు నమోదు కావడం పట్ల కలవరపడాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని బీబీసీతో పేర్కొన్నారు.
”ఇప్పటికే కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. అనుమానితులందరికీ పరీక్షలు నేరుగా స్కూళ్లలోనే నిర్వహిస్తున్నాం. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత లక్షణాలు లేని వారిని హోం ఐసోలేషన్‌కి తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. డీఈవో కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశాం. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని చర్యలు తీసుకున్నాం” అంటూ వివరించారు.
ప్రభుత్వం పాఠశాలల్లో నమోదవుతున్న కరోనా కేసుల విషయంలో బోధనేతర సిబ్బంది, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఖ్యను కలిపితే ఎక్కువే ఉంటుందని రాజమహేంద్రవరానికి చెందిన తాళ్లూరి రవి రాయల్ అంటున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ”పిల్లల తల్లిదండ్రులు చాలా టెన్షన్‌లో ఉన్నారు. పైగా ఈ నెలలోనే గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు తెరిచేందుకు అనుమతులిస్తున్నారు. ఇంత ఉత్సాహం ఎందుకున్నది అర్థం కావడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకే మొగ్గు చూపాలి. మధ్యాహ్న భోజన పథకం వండే వారికి కరోనా ఉంటే అది ఎక్కువ మందికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వం ఆలోచన చేయాలి” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది: విద్యామంత్రి
పాఠశాలల్లో హాజరు శాతం పరిశీలిస్తే తొలి రోజు కన్నా క్రమంగా పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అంటున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ”10వ తరగతి విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు. శుక్రవారం 49.63 శాతం మంది, 9వ తరగతి విద్యార్థులు 38.29 శాతం మంది హాజరయ్యారు. ఉపాధ్యాయులు 89.86 శాతం మంది విధులకు హాజరయ్యారు. 2వ తేదీన 42 శాతం విద్యార్థులు, 3న 33.69 శాతం విద్యార్థులు హాజరవ్వగా 4వ తేదీన 40.30 శాతం, 5వ తేదీ 35 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. ఆరో తేదీన హాజరు శాతం 43.89కి చేరింది” అని చెప్పారు.
”అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్ట్‌లు చేస్తున్నారు. కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్‌లు ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం” అని వివరించారు.
జిల్లాల వారీగా స్కూళ్లలో కేసులు…
జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లా స్కూళ్లలో కరోనా కేసులు నమోదయ్యాయి, ఆ జిల్లాలో 434 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 213 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మాత్రం కరోనా తక్కువ ప్రభావం ఉంది. అధికారిక లెక్కల్లో కృష్ణా జిల్లాలో బడులు తెరిచిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఒక్కరికి కూడా వైరస్ సోకకపోవడం విశేషం.
”ఇప్పుడు విద్యార్థులకు స్కూళ్లు తెరిచిన తర్వాత తరగతి గదుల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇది మరింత ప్రమాదకరం. ప్రభుత్వం తరగతుల నిర్వహణపై పునరాలోచన చేయాలి.”